



Best Web Hosting Provider In India 2024

Kobbari Payasam: మీకు స్వీట్ అంటే ఇష్టమా? ఈజీగా తయారయ్యే కొబ్బరి పాయసం ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా సింపుల్
Kobbari Payasam: మీరు తీపి ప్రియులైతే కొబ్బరి పాయసం తినకుండా ఊరుకోకండి. సింపుల్ గా చాలా త్వరగా తయారయ్యే కొబ్బరి పాయసం తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలని అడగని వారుండరు. ఇదిగోండి రెసిపీ ట్రై చేసి చూడండి.

తీపి తినడం అంటే చాలా మందికి ఇష్టం. అందులోని పాయసం అంటే చిన్న పిల్లల నుంచీ పెద్ద వాళ్ల వరకూ పరుగుత్తుకుంటూ వచ్చేస్తారు. అయితే మీరు కొబ్బరి పాయసం ఎప్పుడైనా తిన్నారా? ఇంతవరకూ లేకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో దేవుడికి నైవైద్యం పెట్టాలన్నా, ఇంటికి వచ్చిన అతిథులకు నోరు తీపి చేయాలన్నా కొబ్బరి పాయసం ఫర్ఫెక్ట్ రెసిపీ. దేవుడికి కొట్టిన కొబ్బరి ముక్కలు ఊరికే ఉన్నా కూడా మీరూ ఈ పాయసం తయారు చేసుకోవచ్చు.ఎప్పుడు చేసినా కొబ్బరి పాయసం రుచి మాత్రం అదిరిపోతుంది. కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ రెసిపీ ఇక్కడుంది.
కొబ్బరి పాయసం కోసం కావలసిన పదార్థాలు:
- ఒక టేబుల్ స్సూన్ – బియ్యం
- అర చిప్ప కొబ్బరి
- అర లీటర్ పాలు
- చక్కెర పావు కప్పు
- కుంకుమపువ్వు- చిటికెడు
- యాలకుడ పొడి- అర టీస్పూన్
- నెయ్యి – అర టీస్పూన్
- డ్రై ఫ్రూట్స్
కొబ్బరి పాయసం తయారు చేసే విధానం..
- కొబ్బరిపాయసం తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ బియ్యం వేయండి. తర్వాత దాంట్లో నీరు పోసి అరగంటకు పైగా నాననివ్వండి.
- ఇప్పుడు కొబ్బరి చిప్పలోని సగం కొబ్బరిని తీసుకుని పైన చెక్కు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకుని ఓసారి మిక్సీ పట్టండి.
- బియ్యం కచ్చపచ్చాగా నలిగిన తర్వాత దాంట్లో కొబ్బరి ముక్కలను వేసి, కొద్దిగా నీరు మెత్తటి పేస్టులా తయారు చేసుకుని పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని దాంట్లో నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్ వేసి వేయించండి.వీటిని అలాగే పక్కకు పెట్టుకోండి.
- తర్వాత పాయసం కోసం వెడల్పాటి గిన్నెను తీసుకుని దాంట్లో పాలు పోసి వేడి చేయండి. పాలు పొంగు వచ్చేంత వరకూ మీడియం ఫ్లేములో మాత్రమే మరిగించండి.
- మరుగుతున్న పాలలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, బియ్యం మిశ్రమాన్ని పాలలో వేసి బాగా కలపండి.
- స్టవ్‌ని చిన్న మంట మీదే ఉంచి పదే పదే కలుపుతూ పాలు చిక్కబడేంత వరకూ మరిగించండి.
- పాలతోని కొబ్బరి, బియ్యం కాస్త ఉడికి పాలు బాగా చిక్కపడుతున్నప్పుడు దాంట్లో రుచికి సరిపడా పంచదార వేసుకుని బాగా కలపండి.
- పంచదార కరిగిన తర్వాత దాంట్లో కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలపండి. తర్వాత ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించిన తర్వాత పాలు బాగా చిక్కబడతాయి.
- ఇప్పుదు దీంట్లోకి ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.
- అంతే రుచికరమైన కొబ్బరి పాయసం తయారు అయినట్టే.
దీన్ని దేవుడికి ప్రసాదంగానూ, ఇంటికి వచ్చిన అతిథుల నోరు తీపి చేయడానికి సింపుల్ గా, త్వరగా తయారు చేసి పెట్టచ్చు. మీకు ఎప్పుడైనా తీపి తినాలనిపించినా కూడా ఈ రెసిపీని ట్రై చేయచ్చు. రుచి చూశారంటే తప్పకుండా వదలరు లెండి.
సంబంధిత కథనం
టాపిక్