

Best Web Hosting Provider In India 2024
Telangana Congress : కొలిక్కి వస్తున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక.. కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక!
Telangana Congress : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి.. మార్చి 10వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇటు ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. కానీ.. కసరత్తు మాత్రం దాదాపుగా ముగిసింది. ఏ క్షణంలో అయినా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్‌తో ఏఐసీసీ పెద్దలు మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అటు హైకమాండ్‌కు మీనాక్షి నటరాజన్ నివేదిక ఇవ్వనున్నారు.
సీపీఐకి ఒకటి..
కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల ఆధారంగా కూర్పు ఉండనుంది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీ లేదా ఓసీకి ఒక సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఎస్టీ, ఓసీ కోటాలో..
ఇక ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓసీ కోటాలో జెట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇంఛార్జ్ కుమార్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరోవైపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఉన్నవారికి కూడా అవకాశం లేనట్లేనని స్పష్టం అవుతోంది.
హస్తినలో ప్రయత్నాలు..
ఇప్పటికే చాలామంది ఆశావహులు హస్తినలో మకాం వేసి ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో స్థానానికి మూడు పేర్లతో ఏఐసీసీకి ప్రతిపాదనలను పంపినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుని ఆదివారం (మార్చి 9న) పేర్లు ప్రకటించనున్నారు. దీంతో నేతల్లో టెన్షన్ నెలకొంది.
కాంగ్రెస్‌కు నాలుగు..
మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. శాసనసభలో కాంగ్రెస్‌కున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి 4 స్థానాలు దక్కనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. వీటిలో ఒకటి తమకు కేటాయించాలని సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్‌ను కోరింది. సీపీఐ జాతీయ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌గాంధీని కూడా కలిసినట్టు ప్రచారం జరుగుతోంది.
టాపిక్