

Best Web Hosting Provider In India 2024

Tiger In Peddapalli: పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి, తోడు కోసం ఆడపులి ఆరాటం, భయాందోళనలో అటవీ గ్రామాల ప్రజలు.
Tiger In Peddapalli: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ వైపు పెద్దపులి మరో వైపు చిరుత సంచారం ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తోడు కోసం ఆడపులి మంథని మహదేవ్ పూర్, భూపాలపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Tiger In Peddapalli: పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. కొమురం భీం ఆసిఫాబాద్ అటవీప్రాంతంలో ఉండే పెద్దపులి మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా గోదావరినది దాటి మంథని మండలం బిట్టుపల్లి మీదుగా భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ అటవీ ప్రాంతం వైపు వెళ్ళినట్లు పాదముద్రల అనవాళ్ళు లభించాయి.
పెద్దపల్లి జిల్లాలోని బిట్టు పల్లి వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా పెద్దపులిని రైతులు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులతోపాటు పోలీసులు అక్కడికి చేరుకుని పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. ఆడ పెద్దపులి గా భావిస్తు మగ పెద్దపులి తోడు కోసం ఆసిఫాబాద్ అడవుల నుంచి బయలుదేరినట్లు భావిస్తున్నారు.
మంథని, మహదేవ్ పూర్, భూపాలపల్లి అటవీ ప్రాంతం నుంచి ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల వరకు వెళ్లి తిరుగు ప్రయాణించి వారం రోజుల్లో వెళ్ళిపోతుందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.
అప్రమత్తంగా ఉండాలి…హాని తలపెట్ట వద్దు…
బిట్టుపల్లి వద్ద కనిపించిన పెద్దపులి గోపాల్ పూర్ అటవీ ప్రాంతం నుంచి కాకర్లపల్లి వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు పాదముద్రలు గుర్తించారు. మరో వైపు మహదేవ్ పూర్ పంకెన పలిమెల అటవీ ప్రాంత సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. సంచరించేది ఆడ పెద్దపులి అని పెద్దపల్లి జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య తెలిపారు.
అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు, ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దని పశువులను అడవిలోకి పంపించవద్దని విజ్ఞప్తి చేశారు. జాతీయ వన్యప్రాణి అయిన పెద్దపులికి హాని తలపెట్ట వద్దని కోరారు. అటవీ ప్రాంతంలో ఉచ్చులు, కరెంట్ షాక్ లు పెట్టి పెద్దపులికి హాని కలిగిస్తే చట్టపకారం కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఒకే చోట ఉండదు…
పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి ఒకే చోట ఉండదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మగపులి తోడు కోసం సంచరిస్తున్న ఆడపులి గతంలో కూడా వచ్చి వెళ్లిందని శాఖ అధికారులు తెలిపారు. 2020లో ఒక్కసారి సంచరించిన పెద్దపులి, 2022లో మరోసారి పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరించినట్లు గుర్తు చేశారు. అయితే 2020లో సంచరించినప్పుడు పశువుపై పెద్దపులి దాడి చేసిందని ఆ తర్వాత ఎప్పుడు ఎవరికి హాని తలపెట్టలేదని స్పష్టం చేశారు. ఎవరు అడవిలోకి వెళ్ళద్దని పెద్దపులిని గుర్తించి బంధించేందుకు అక్కడక్కడ ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
సిరిసిల్ల జిల్లాలో చిరుత…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తూర్పు డివిజన్ లో పెద్దపులి సంచరిస్తుంటే పశ్చిమ డివిజన్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ శివారులో పాడి పశువుపై చిరుత దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
గత కొద్దిరోజులుగా కొడిమ్యాల, వేములవాడ, రుద్రంగి, చందుర్తి అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నా, ఎక్కడ చిరుత ఆనవాళ్ళు లభించలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. పాడి పశువు పై దాడి చేసింది ఏ వన్యప్రాణో స్పష్టంగా తెలియడం లేదని అటవీశాఖ అధికారులు ప్రకటించారు.
ఏదేమైనా అటవీ ప్రాంత సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. చిరుత సంచారాన్ని గుర్తించే పనిలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్