

Best Web Hosting Provider In India 2024

Palm oil: బ్రెడ్‌లో కేకులు నూడుల్స్‌లో మీకు తెలియకుండానే పామాయిల్ తినేస్తున్నారా? జాగ్రత్త గుండెపోటు వచ్చే ఛాన్స్
Palm oil: పామాయిల్‌ని ఎన్నో ఆహారాల తయారీలో ఉపయోగిస్తారు. నిజానికి దాన్ని వాడడం ఏమాత్రం మంచిది కాదు. ఇంట్లో పామాయిల్ వాడకపోయినా బయట దొరికే బ్రెడ్లు, కేకులను తినడం ద్వారా పామాయిల్ కూడా తింటున్న వారి సంఖ్య అధికం గానే ఉంది.

పామాయిల్ వల్ల గుండెకు చేటు జరుగుతుందని ఎప్పటినుంచో పోషకాహారా నిపుణులు చెబుతున్నారు. బయట దొరికే ఇనిస్టెంట్ నూడిల్స్, చాక్లెట్ క్యూబ్స్, బ్రెడ్లు, కేకులు ఇలా ఎన్నో వాటిలో పామాయిల్ ను వినియోగిస్తారు. ఇలా మనకు తెలియకుండానే పామాయిల్ తో చేసిన ఆహారాన్ని తినేస్తున్నాం. ఇంట్లో పామాయిల్ ను వాడకపోయినా ఇలా బయట దొరికే పామాయిల్ ఫుడ్ ను తినడం వల్ల గుండెలోని ధమనులు మూసుకుపోయే ఛాన్స్ ఉంది.
గుండె సమస్యలు తెస్తుంది
పామాయిల్ లో దాదాపు 50 శాతం సంతృప్త కొవ్వులు ఉంటాయి. అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్… దీన్నే చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ పెంచుతుంది. పామాయిల్ తరచూ శరీరంలో చేరితే హృదయ సంబంధ వ్యాధులు ప్రమాదం పెరిగే అవకాశం కూడా ఉంది.
పామాయిల్ ఎందుకు వాడతారు?
సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే నూనెలు, ఆహారాలు గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయి. కానీ బేకరీలలో పామాయిల్ తోనే అన్ని రకాల కేకులను, పేస్ట్రీలు వంటివి తయారు చేస్తున్నారు. అలాగే కాలేజీ క్యాంటీన్లో కూడా పామాయిల్ తో వాడే ఆహారాలు అధికంగానే ఉంటున్నాయి. ఇక నూడిల్స్ తయారీలో కూడా పామాయిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తుంది. కాబట్టి పామాయిల్ ను వాడడం వల్ల ఆహారాలు దుకాణాల్లో ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. అందుకే పామాయిల్ ను వాడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది.
కేకులు, నూడుల్స్, పేస్ట్రీలు ఇలా బేకరీ లో దొరికే ఆహారాలను ఎంత తక్కువగా తింటే అంత మంచిది. లేకుంటే కొన్ని రోజుల్లోనే కరోనరీ ధమనులలో ఫలకాలు ఏర్పడి మూసుకుపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఏ నూనెలు వాడాలి?
మనదేశంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆ నూనెలో ఎన్నో ఉన్నాయి. వాటిని వాడడమే ఆరోగ్యకరం. వేరుశనగ నూనె, ఆవాలు నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన శరీరం ఉత్పత్తి చేయలేని కొన్ని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. కాబట్టి ఇలాంటి నూనెలను ఆహారంలో ఉపయోగించడం మంచిది. అయితే ఏ నూనె అయినా కూడా మితంగానే తీసుకోవాలి. అమితంగా తీసుకుంటే అది కొవ్వు ఫలకల రూపంలో శరీరంలో పేరుకు పోతుంది. ఇది బరువు పెరగడంతో పాటు గుండె జబ్బులు వచ్చే సమస్యను కూడా పెంచుతుంది. కాబట్టి నూనె విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం