Best Web Hosting Provider In India 2024
ఎమ్మెల్యేల మెప్పు కోసం పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు
మాజీ మంత్రి విడదల రజని వార్నింగ్
నరసరావుపేట జైల్లో సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్‌కు పరామర్శ
నరసరావుపేట: రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు గొంతెత్తే స్వాతంత్రం కూడా లేకుండా చేశారంటూ మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసరావుపేట జైలులో రిమాండ్‌లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై ఉక్కుపాదంతో అణిచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే…
పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే తప్పుడు కేసులు
తెలుగుదేశం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు బనాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడుగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న రాకేష్ గాంధీపై కావాలనే తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపారు. భాషా అనే వ్యక్తితో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈనెల 6వ తేదీన ఒక కేసు నమోదు చేయించారు. రాకేష్ గాంధీ తన ఇద్దరు మిత్రులు ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి కోటేశ్వర్ లతో కలిసి తనపై దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని, అసభ్య పదజాలంతో దూషించారంటూ భాష ఫిర్యాదు చేశాడు. చుట్టుపక్కల వారు గమనించడంతో తన ఫోన్ లాక్కుని వారు పరారయ్యారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఏకంగా సెక్షన్ 308 కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు పెడితే కోర్టులు చీవాట్లు పెడుతుండటంతో, రాకేష్ గాంధీపై ఈ సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి, దాని ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు
రాకేష్ గాంధీ అరెస్ట్ విషయంలో పోలీసులు అల్లిన కట్టుకథ ఇలా ఉంటే.. వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాకేష్ బెదిరించినట్టుగా చెబుతున్న ఆరో తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతడు గుంటూరులో ఇంట్లో ఉన్నాడు. దీనికి సీసీ ఫుటేజీ ఆధారాలున్నాయి. అదే వ్యక్తి అదే సమయంలో చిలుకలూరిపేట కళామందిర్ సెంటర్లో ఎలా ఉంటాడో పోలీసులే చెప్పాలి.
చిలకలూరిపేటలో ఉంటే వేధిస్తున్నారనే కారణంతో గత 9 నెలలుగా రాకేష్ గుంటూరులోనే ఉంటున్నాడు. ఘటన జరిగినట్టుగా చెబుతున్న 6వ తేదీతో పాటు అంతకు ముందు రోజు కూడా అతడు గుంటూరులోనే ఉన్నాడు. గుంటూరులో నాతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇదే కేసులో ఉన్న మరో వ్యక్తి ఫణీంద్ర నాగిశెట్టి కూడా ఘటన జరిగిన రోజు, అదే సమయంలో సెలూన్లో హెయిర్ కటింగ్ కోసం వెళ్లాడు. ఇందుకు సీసీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయి. మరో వ్యక్తి దామిశెట్టి కోటేశ్వర్ కూడా ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు.
ఈ ఆధారాలన్నీ చూస్తే కట్టుకథలు అల్లి వైయస్ఆర్సీపీ శ్రేణులను వేధింపులకు గురిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. కేవలం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతో సీఐ ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలను నిజం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆధారాలను కోర్టు ముందుంచడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మెప్పకోసం పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు ద్వారా పోలీసు వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోంది.