



Best Web Hosting Provider In India 2024

Amaravati Land Allotment : అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులు పాత విధానం మేరకే- మంత్రుల కమిటీ ప్రకటన
Amaravati Land Allotment : ఏపీ రాజధాని అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 131 మందికి భూములు కేటాయించగా…వీటిలో 31 సంస్థలకు కేటాయింపులను కొనసాగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Amaravati Land Allotment : రాజధాని అమరావతి భూకేటాయింపులపై గత విధానమే కొనసాగిస్తామని మంత్రులు కమిటీ స్పష్టం చేసింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్ సోమవారం భేటీ అయ్యారు. అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో మంత్రుల కమిటీ చర్చించింది. ఈ సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 131 మందికి భూములు కేటాయించామని, వాటిలో 31 సంస్థలకు కేటాయింపులను కొనసాగుతాయన్నారు. 2 కంపెనీలకు గతంలో కేటాయించిన విధంగా కాకుండా వేరే చోట స్థలం కేటాయించినట్లు చెప్పారు. 16 సంస్థలకు స్థలంతో పాటు పరిధిని మార్చామని మంత్రి తెలిపారు.
“ఏపీ రాజధాని అమరావతే అని ఎన్నికలకు ముందు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చెప్పింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిపై దృష్టి పెట్టాం. 2014-19లో రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు దాదాపు 34 వేల ఎకరాలు ఇచ్చారు. అప్పట్లో రాజధాని నిర్మాణానికి రూ.43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచాం. రాజధాని పరిధిలో రహదారులు కూడా చేపట్టాం. సుమారు రూ.9 వేల కోట్ల వ్యయంతో పనులు చేపట్టాం. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కక్ష సాధింపుతో మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడింది” – మంత్రి నారాయణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 నెలలు కష్టపడి న్యాయపరమైన చిక్కులను పరిష్కరించామని మంత్రి నారాయణ అన్నారు. రూ.48 వేల కోట్లకు టెండర్లు పిలిచామని, వాటిని ఓపెన్ చేశామన్నారు. రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఒప్పందాల మేరకు ఆయా సంస్థలు పనులు ప్రారంభిస్తాయని మంత్రి తెలిపారు.
ఖజానాపై భారం పడకుండా – మంత్రి పయ్యావుల
అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్టు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాజధానికి గరిష్టంగా నిధులను సీఆర్డీఏ సమకూర్చుకునేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మేరకు మద్దతు ఉంటుందన్నారు. అది కూడా బయట సంస్థల ద్వారా రుణ సదుపాయం రూపంలో నిధులను సమకూర్చి ఇస్తున్నామన్నారు.
అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు… భవిష్యత్తులో అభివృద్ధి చెందిన అనంతరం భూములను అమ్మేసి అప్పులన్నీ కట్టే విధంగా ఈ ప్రాజెక్టును రూపొదించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. అమరావతి కట్టాలంటే రూ.లక్షల కోట్లు కావాలని మాజీ సీఎం జగన్ అనేవారని, కూటమి ప్రభుత్వం రూ.లక్షల కోట్లు ఖర్చు చేయడంలేదన్నారు. సీఆర్డీఏ ద్వారా నిధుల సమీకరించి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
అమరావతి రుణాలపై కేంద్రం స్పష్టత
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. రాజధానికి రుణాలు సమకూర్చేందుకు తగిన సహకారాలు అందిస్తుందని తెలిపింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణాలు రాష్ట్ర అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను ఏపీ అప్పుల పరిమితిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు వెల్లడించింది. లోక్సభలో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
సంబంధిత కథనం
టాపిక్