

Best Web Hosting Provider In India 2024

Warangal CP : ఛార్జ్ తీసుకున్న పోలీస్ బాస్, వరంగల్ సీపీ ముందు సవాళ్లెన్నో!
Warangal CP : వరంగల్ నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్ పరిధిలో గత కొద్దిరోజులుగా దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లతో క్రైమ్ కంట్రోల్ తప్పుతుండగా..కొత్త పోలీస్ బాస్ కు సవాళ్లు స్వాగతం పలుతున్నాయి.

Warangal CP : వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన అంబర్ కిశోర్ ఝా రామగుండం కమిషనరేట్ కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో సీపీగా సన్ ప్రీత్ సింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం ఉదయం వరంగల్ కమిషనరేట్ కు చేరుకున్న ఆయనకు ఇక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం కమిషనరేట్ ఆఫీస్ లో సీపీగా సన్ ప్రీత్ సింగ్ ఛార్జ్ తీసుకున్నారు. కాగా వరంగల్ కమిషనరేట్ లో కొద్దిరోజులుగా దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లతో క్రైమ్ కంట్రోల్ తప్పుతుండగా.. నిఘా లోపం, కొంతమంది పోలీస్ సిబ్బంది వ్యవహార శైలితో డిపార్ట్మెంట్ పేరు దెబ్బతింటోంది. ఇలా వివిధ రకాల సవాళ్లు సీపీ ముందు ఉండగా.. వీటన్నింటినీ చక్కదిద్దడంలో ఆయన ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారోననే చర్చనడుస్తోంది.
పెరుగుతున్న క్రైమ్
వరంగల్ నగరంలో కొద్దిరోజులుగా మర్డర్లు కామనైపోయాయి. 2024 డిసెంబర్ 3న రాజా మోహన్ అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ను అప్పు ఇవ్వలేదన్న కారణంతో ములుగు జిల్లాకు చెందిన జక్కుల శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. సిటీ నడిమధ్యలోనే ఈ హత్య జరగగా.. ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం రేపింది. ఆ తరువాత కూడా నగరంలో దారుణాలు అలాగే కంటిన్యూ అయ్యాయి. ఫిబ్రవరి 20న కాజీపేటలో ప్రైవేటు క్లీనిక్ నిర్వహిస్తున్న సుమంత్ రెడ్డి అనే డాక్టర్ ను అతడి భార్య, మరో ఇద్దరు వ్యక్తులు ప్లాన్ చేసి హతమార్చారు.
ఇక సిటీలో కొన్ని ఏరియాలు క్రైమ్ కు అడ్డాగా మారాయి. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోట, లేబర్ కాలనీ, భట్టుపల్లి క్రాస్, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ ఏరియాలు, ఆరెపల్లి, దేవన్నపేట, వంగపహడ్, రింగ్ రోడ్డు శివారు తదితర ప్రాంతాలు నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఆయా ప్రాంతాలు క్రైమ్ కు కేరాఫ్ గా నిలుస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
దొంగతనాలతో జనం బెంబేలు
నార్త్, సౌత్ ఇండియాకు సెంటర్ పాయింట్ గా ఉన్న వరంగల్ నగరాన్ని అంతర్రాష్ట్ర ముఠాలు తరచూ టార్గెట్ చేస్తున్నాయి. దీంతో నగరవాసులు ఇళ్లకు తాళం వేసి వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ చోరీ ఘటనలో దాదాపు రూ.13 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని దుండగులు కొల్లగొట్టగా.. అందులో కేవలం రూ.3 కోట్లు విలువైన బంగారాన్ని మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. మిగతా రూ.10 కోట్ల బంగారం ఎక్కడుందో, అందులో ప్రధాన నిందితులను కూడా ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. అదే కాకుండా నగర శివారు ప్రాంతాల్లో తరచూ ఇదే తీరుగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇందులో చాలా కేసులను పోలీసులు ఛేదించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆగని గంజాయి రవాణా
ఆంధ్రా ఒడిశా బార్డర్ నుంచి నిత్యం రైలు మార్గాల్లో గంజాయి వరంగల్ నగరానికి చేరుతూనే ఉంది. గంజాయిని పట్టుకునేందుకు యాంటీ నార్కొటిక్ బ్యూరో పని చేస్తున్నా.. అందులో సరిపడా సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. ఇక స్థానిక పోలీసులు అడపా దడపా పట్టుకుంటున్నా.. గంజాయి ఇప్పటికే గ్రామస్థాయిలోకి వెళ్లిపోయింది. దానిని పూర్తిగా నివారించేందుకు సప్లై సిస్టంను నిర్వీర్యం చేయాల్సి ఉండగా.. అది పోలీసులకు కష్టతరమైన పనిగా మారింది.
మందుబాబుల ఆగడాలు
వరంగల్ నగరంలో 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉంటోంది. దీంతో మందుబాబులు అర్ధరాత్రి వరకు ఫుల్లుగా తాగి రోడ్లకు మీదకు వచ్చి గొడవలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కేయూ పీఎస్ పరిధి గుండ్ల సింగారం, నిరూప్ నగర్ తండా బెల్టషాపులకు అడ్డాగా మారాయి. వాటితో పాటు గోపాలపూర్, కోమటిపల్లి, హసన్ పర్తి పరిధిలోని హసన్ పర్తి, పెగడపల్లి, చింతగట్టు, మునిపల్లి, ఎల్లాపూర్, దేవన్నపేట, మిల్స్ కాలనీ పరిధి కరీమాబాద్, ఏసీ రెడ్డినగర్, వెస్ట్ ఫోర్ట్ ఏరియా, శాకరాసికుంట, ఎస్ఆర్ఆర్ తోట, సుబేదారి పీఎస్ లో వడ్డేపల్లి, ఎన్జీవోస్ కాలనీ, మైత్రీనగర్, ఇంతేజార్ గంజ్ పరిధి ఎంహెచ్ నగర్, లేబర్ కాలనీ, ఏనుమాముల పరిధి ఆరెపల్లి, పైడిపల్లి, వంగపహాడ్, మట్వాడా పరిధి దేశాయిపేట, హనుమకొండ పీఎస్ పరిధి పెద్దమ్మగడ్డ, శ్రీనివాసకాలనీ, పోచమ్మకుంట తదితర ప్రాంతాల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా నడుస్తోంది. అయినా పోలీస్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మార్క్ చూపిస్తారా..?
వరంగల్ కొత్త సీపీగా సన్ ప్రీత్ సింగ్ సోమవారం మధ్యాహ్నం బాధ్యతలు తీసుకున్నారు. 2011 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది. 2012లో ములుగు ఏఎస్పీగా పనిచేసిన ఆయన ఆ తరువాత వరంగల్ రూరల్ ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో జిల్లాపై పట్టు సాధించారు. ఆ తరువాత ఎల్బీ నగర్ డీసీపీగా, సూర్యాపేట జిల్లా ఎస్పీగా పని చేశారు. కాగా వరంగల్ జిల్లాతో అనుబంధం ఉన్న ఆయన ఏ మేరకు తన మార్క్ చూపిస్తారో చూడాలి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్