




Best Web Hosting Provider In India 2024

Rashmika Mandanna: రష్మిక గురించి నేను అలా అనలేదు: కర్ణాటక ఎమ్మెల్యే వివరణ
Rashmika Mandanna: రష్మిక మందన్నాకు గుణపాఠం చెప్పాల్సిందే అని గతంలో కామెంట్ చేసిన కర్ణాటక ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ ఇప్పుడు మాట మార్చారు. తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇవ్వడం గమనార్హం.

Rashmika Mandanna: రష్మిక మందన్నా గురించి కర్ణాటక ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపడంతో ఆయన దిగి వచ్చారు. తన వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటో చెప్పుకొచ్చారు. రష్మికకు గుణపాఠం చెప్పాలంటే ఆమెపై దాడి చేయడమని కాదని, జీవిత పాఠాలు చెప్పాలని తాను అన్నట్లు రవి కుమార్ అన్నారు.
నేను అలా అనలేదు: రవి కుమార్ గౌడ
తాను పుట్టిన పెరిగిన కర్ణాటక రాష్ట్రాన్ని రష్మిక మందన్నా పట్టించుకోవడం లేదని మండిపడుతూ ఈ మధ్యే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ.. ఆమెకు గుణపాఠం చెబుతానని అన్నారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ముఖ్యంగా కొడవ కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఈ ఎమ్మెల్యే దిగి వచ్చారు. తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదంటూ ఏఎన్ఐతో మాట్లాడిన ఆయన వివరణ ఇచ్చారు.
“ఆమెకు గుణపాఠం చెప్పాలని నేను అన్నానంటే అది జీవిత పాఠాలు చెప్పాలని తప్ప.. ఆమెపై దాడి చేయడం అని కాదు. మీరు కూర్చొన్న కొమ్మనే నరుక్కోవద్దు అని నేను అన్నాను. మా రాష్ట్ర కార్యక్రమానికి రష్మికను ఆహ్వానిస్తే ఆమె రాలేదు. ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగారు. ఆ రాష్ట్రానికి మద్దతుగా నిలబడండి అని అన్నాను” అని రవికుమార్ గౌడ అన్నారు.
రష్మికను వ్యక్తిగతంగా విమర్మించాలన్నది తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. “రష్మిక మందన్నా సినిమా కూడా నేను చూశాను. నేను నా మాటలకు కట్టుబడి ఉన్నాను. మా రాష్ట్రం, మా భూమి, మా కన్నడ భాషను కచ్చితంగా గౌరవించాల్సిందే” అని మరోసారి రవికుమార్ తేల్చి చెప్పారు.
అసలు ఏం జరిగిందంటే?
కర్ణాటకలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్ కు రావాల్సిందిగా రష్మికను ఆహ్వానించినా.. ఆమె నిరాకరించిందంటూ ఎమ్మెల్యే రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కర్ణాటక ఎక్కడుందో నాకు తెలియదు.. నాకు టైమ్ లేదు అని రష్మిక అన్నట్లుగా కూడా ఆయన చెప్పారు. ఈ సందర్భంగానే రవికుమార్ మాట్లాడుతూ.. రష్మికకు గుణపాఠం చెప్పాల్సిందే అని పిలుపునిచ్చారు.
దీంతో రష్మిక సభ్యురాలిగా ఉన్న కొడవ నేషనల్ కౌన్సిల్ ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆమెకు వేధింపులు జరిగే ప్రమాదం ఉందని, భద్రత కల్పించాలని కూడా కోరింది. ఎంతో కష్టపడి తమ కొడవ తెగకు చెందిన రష్మిక ఈ స్థాయికి వచ్చిందని, అలాంటి వ్యక్తిని బెదిరించడం సరికాదని కౌన్సిల్ అధ్యక్షుడు నాచప్ప అన్నారు.
ఈ వివాదం మెల్లగా ముదురుతుండటంతో ఎమ్మెల్యే రవికుమార్ గౌడ ఇప్పుడిలా వివరణ ఇచ్చారు. మరి ఇంతటితో దీనికి ముగింపు పడుతుందా లేదా చూడాలి. మరోవైపు యానిమల్, పుష్ప 2తో రెండు వరుస పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ అందుకున్న రష్మిక.. ఈ మధ్యే ఛావాలో మరో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. సికందర్ లో సల్మాన్ ఖాన్ తో నటిస్తోంది. ఆ తర్వాత ధనుష్, నాగార్జునలతో కుబేరలోనూ కనిపించనుంది.
సంబంధిత కథనం