





Best Web Hosting Provider In India 2024

DIY Organic Holi Colours at Home: కెమికల్స్ లేని హెలీ రంగులు కావాలా? ఇదిగోండి ఇలా ఈజీగా ఇంట్లోనే మీరే తయారు చేసుకోండి!
DIY Organice Holi Colours at Home:హోలీ వస్తుందనే సంతోషం కన్నా రంగులతో చర్మం, కురులు దెబ్బతింటాయనే భయం మీలో ఎక్కువగా ఉందా? చింతించకండి..! ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా రంగులను తయారు చేసుకోవచ్చు. వీటికోసం మీరు డబ్బు కూడా ఖర్చు చేయనక్కర్లేదు. నాచురల్ హోలీ కలర్స్ రెడీ చేయడం ఎలాగో చూసేద్దాం.

హోలీ అంటేనే రంగుల పండుగ. ఈ రోజున కుటుంబ సభ్యులు, స్నేహితులు ముఖ్యంగా బావా మరదల్లు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు. వాస్తవానికి ఇలా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం చాలా సంతోషాన్నిస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ రంగులు చర్మాన్ని, కురులను దెబ్బతీసే ప్రమాదముంది. ఎందుకంటే మీరు తెచ్చుకునే రంగులో రకరకాల రసాయనాలు, హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మం, కురులతో పాటు మొత్తం శరీరానికి హాని కలిగించే ప్రమాదముంది.
మరేం చేయాలి..? హోలీ ఆడకూడదా ఏంటీ.. అంటారా? నిస్సందేహంగా ఆడచ్చు. కాకపోతే హానికరమైన రంగులతో కాకుండా ఆర్గానిక్ హోం మేడ్ కలర్స్‌తో. సహజమైన రంగులతో పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు. వీటిని మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా వంటింట్లో ఎప్పుడూ ఉండే కూరగాయలతో. ఇవి మీ పిల్లల చర్మాన్ని, మీ చర్మాన్ని, కురులను చక్కగా కాపాడతాయి. మీ హోలీని మరింత అందంగా ఆకర్షణీయంగా మారుస్తాయి. సహజమైన హోలీ రంగులను ఎలా తయారు చేయచ్చో తెలుసుకుందాం రండి.
గులాబీ రంగు( Pink Colour):
హోలీ రంగుల్లో పిల్లలతో పాటు పెద్దలు మొదట ఎంచుకునే రంగు గులాబీ. ఇది అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. గులాబీ రంగును ఇంట్లోనే తయారు చేయడం కోసం..
- ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో రెండు కప్పుల వరకూ బీట్‌రూట్ తురుమును వేసుకోండి.
- తరువాత దీంట్లో ఒక కప్పు నీరు పోయండి. ఇప్పడు ఈ రెండింటీనీ రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలపండి.
- తర్వాత ఈ నీటిని గట్టిగా పిండుతూ స్ట్రేనర్ సహాయంతో వడకట్టి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దాంట్లో బియ్యం పిండి లేదా కార్న్ ఫోర్ల్ లేదా మనం రోజూ ఉపయోగించే టాల్కమ్ పౌడర్(ఫేస్ పౌడర్)ను మూడు కప్పుల వరకూ తీసుకొండి.
- దీంట్లో మనం వడకట్టి పక్కకు పెట్టుకున్న బీట్ రూట్ వాటర్ పోసి రెండు చేతులతో బాగా కలపండి. వుండలు లేకుండా పిండి పొడిగా మారేంత వరకూ రెండు చేతులతో బాగా రబ్ చేస్తూ కలపండి. హోలీ రంగు మంచి సువాసనతో కావాలంటే ఈ పిండిలో రెండు స్పూన్ల వరకూ రోజ్ వాటర్ పోసి మిక్స్ చేసుకోండి.
- పిండి అంతా రంగు మారిన తర్వాత మీకు సమయం ఉంటే దీన్ని ఎండలో ఒకటి లేదా రెండు రోజుల పాటు ఆరబెట్టండి. లేదంటే ఓవెన్లో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు హీట్ చేయండి. ఒవెన్ లేని వారు ఒక కడాయిలో వేసి కూడా వేడి చేయచ్చు.
- వేడి చేసి తీసిన తర్వాత మరోసారి చేతులతో చక్కగా కలిపారంటే సహజసిద్ధమైన, సువాసనభరితమైన గులాబీ రంగు సిద్ధమైనట్టే.
పసుపు రంగు( Yellow colour):
- పసుపు రంగు తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం రెండు కప్పుల వరకూ నీటిని తీసుకుని బాగా మరిగించాలి.
- నీరు మరుగుతున్న సమయంలో దీంట్లో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకూ పసుపు వేయండి. పసుపుకు బదులుగా మీరు ఎల్లో ఫుడ్ కలర్ కూడా ఉపయోగించవచ్చు. పసుపు అయితే చర్మానికి మరీ మంచిది.
- నీరు రంగు మారిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో నీటిని పోయండి.
- నీరు చల్లారిన తర్వాత దాంట్లో బియ్యం పిండి లేదా కార్న్ ఫ్లోర్ లేదా టాల్కమ్ పౌడర్ వేసి బాగా కలపండి. (చల్లారిన నీటిలో మాత్రమే వీటిని వేసి కలపాలి).కావాలంటే దీంట్లో రోజ్ వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి.
- ఇప్పుడు దీన్ని ఎండలో ఒకటి లేదా రెండు రోజుల పాటు ఆరబెట్టండి. లేదంటే ఓవెన్లో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు హీట్ చేయండి. ఒవెన్ లేని వారు ఒక కడాయిలో వేసి కూడా వేడి చేయచ్చు.
- వేడి చేసి తీసిన తర్వాత మరోసారి చేతులతో చక్కగా కలిపారంటే ఆర్గానిక్ ఎల్లో కలర్ రెడీ అయినట్టే.
ఆకుపచ్చ రంగు(Green colour):
హోలీ పండుగ కోసం ఆకుపచ్చ రంగు తయారు చేయడం కోసం మీరు పాలకూర, కొత్తిమీర కలిపి తీసుకోవాలి. లేదంటే వేపాకును తీసుకోవాలి. వేపాకు అయితే మీ చర్మానికి మరింత మేలు కలుగుతుంది.
- ముందుగా మీరు తీసుకున్న వేపాకు లేదా పాలకూర, కొత్తిమీరలను తీసుకుని మీక్సీ జార్‌లో వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తటి పేస్టులా తయారు చేసుకోవాలి.
- తరువాత స్ట్రైనర్ సహాయంతో ఈ నీటిని వడకట్టి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో రెండు కప్పుల బియ్యం పిండి లేదా కార్న్ ఫ్లోర్ లేదా టాల్కమ్ పౌడర్ తీసుకోండి.
- దీంట్లో మనం వడకట్టి పక్కకు పెట్టుకున్న వేపాకు నీటిని వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా రెండు చేతులతో బాగా రబ్ చేస్తూ కలపండి.
- పిండి అంతా పచ్చ రంగులోకి మారిన తర్వాత వీలుంటే ఎండలో ఒకటి లేదా రెండు రోజుల పాటు ఆరబెట్టండి. లేదంటే ఓవెన్లో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేడి చేయండి. తరువాత మరోసారి బాగా కలిపండి.
- అంతే నాచురల్ గ్రీన్ కలర్ రెడీ అయినట్టే.
నీలి రంగు(Blue Colour):
- బ్లూ కలర్ లేకుండా హోలీ పండుగ అసంపూర్ణమనే చెప్పాలి. ఈ రంగు తయారు చేయడానికి మీరు బ్లూ కలర్ ఫుడ్ కలర్ తీసుకోవాలి.
- ఈ కలర్‌ను బియ్యం పిండి లేదా కార్న్ ఫ్లోర్ లేదా టాల్కమ్ పౌడర్ లో వేసి బాగా కలపండి.
- తరువాత ఎండలో ఆరబెట్టి ఉపయోగించుకోండి. సమయం లేకుంటే ఓవెన్లె వేడి చేసుకున్నా ఆకర్షణీయమైన నీలి రంగు సిద్దమైపోతుంది.
నారింజ రంగు(orange colour):
- పిల్లలతో పాటు పెద్దలు ఎంతో ఇష్టపడే నారింజ రంగు హెలీ కలర్ ను సిద్ధం చేయడం కోసం.. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో రెండు కప్పుల వరకూ క్యారెట్ తురుమును వేసుకోండి.
- తరువాత దీంట్లో ఒక కప్పు నీరు పోయండి. ఇప్పడు ఈ రెండింటీనీ రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలపండి.
- తర్వాత ఈ నీటిని గట్టిగా పిండుతూ స్ట్రేనర్ సహాయంతో వడకట్టి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దాంట్లో బియ్యం పిండి లేదా కార్న్ ఫోర్ల్ లేదా మనం రోజూ ఉపయోగించే టాల్కమ్ పౌడర్(ఫేస్ పౌడర్)ను మూడు కప్పుల వరకూ తీసుకొండి.
- దీంట్లో మనం వడకట్టి పక్కకు పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ పోసి రెండు చేతులతో బాగా కలపండి. వుండలు లేకుండా పిండి పొడిగా మారేంత వరకూ రెండు చేతులతో బాగా రబ్ చేస్తూ కలపండి. మంచి సువాసన కోసం దీంట్లో రెండు స్పూన్ల వరకూ రోజ్ వాటర్ పోసి మిక్స్ చేసుకోండి.
- పిండి అంతా రంగు మారిన తర్వాత ఎండలో ఒకటి లేదా రెండు రోజుల పాటు ఆరబెట్టండి. లేదంటే ఓవెన్లో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు హీట్ చేయండి.
- వేడి చేసి తీసిన తర్వాత చేతులతో చక్కగా కలిపారంటే అట్రాక్టివ్ ఆరెంజ్ కలర్ రెడీ అయినట్టే.
ఎరుపు రంగు( Red Colour):
- ఎరుపు రంగు లేకుండా హిందువుల పండులే ఉండవు. అలాంటిది రంగుల పండుగ హోలీకి రెడ్ కలర్ లేకపోతే ఎలా. దీని కోసం మీరు ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా నీరు పోయండి.
- ఇందులో కాస్త పసుపు, నిమ్మరసం వేసి కలపండి. ఈ రెండింటి కలయితో నీరు అంతా ఎరుపు రంగులోకి మారుతుంది.
- ఇప్పుడు ఈ నీటిని బియ్యం పిండి లేదా కార్న్ ఫోర్ల్ లేదా టాల్కమ్ పౌడర్(ఫేస్ పౌడర్)లో వేసి బాగా కలపండి.
- తరువాత ఎండలో పెట్టడమో లేక ఓవెన్లో వేడి చేయడమే చేశారంటే శుభానికి చిహ్నమైన ఎరుపు రంగు రెడీ అయిపోతుంది.
అంతే ఎలాంటి ఖర్చూ లేకుండా ఇంట్లో ఎప్పుడూ ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో హోలీ రంగులు తయారైనట్టే. వీటిని చిన్నపిల్లల నుంచీ పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం హోలీ వచ్చేస్తుంది కదా. వెళ్లి రంగులను సిద్దం చేసుకుని ఎండలో పెట్టుకునే పనిలో పడండి. హోలీని హ్యాపీగా, సేఫ్‌గా జరుపుకోండి.
సంబంధిత కథనం