

Best Web Hosting Provider In India 2024

Visakhapatnam : విశాఖపట్నంలో దారుణం.. యోగా పేరుతో విద్యార్థినులపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
Visakhapatnam : విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. యోగా పేరుతో విద్యార్థినులపై ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లావిద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంఈవో చెప్పారు.

గాజువాక 65వ వార్డులోని ఒక కాలనీలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో విద్యార్థినులకు ఉపాధ్యాయుడు యోగా శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ఇచ్చే క్రమంలో బాలికలకు యోగాసన, శీర్షాసనాలు నేర్పిస్తూ అసభ్యకరంగా, అనుచితంగా వ్యవహరిస్తున్నాడు. ఉపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తనపై విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. తమను యోగా టీచర్ క్లాస్ సమయంలో తాకడం వంటివి చేస్తున్నాడని, తమకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు.
ఫిర్యాదు చేసినా..
విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలలో జరుగుతున్న ఈ వ్యహారాన్ని కమిటీ పెద్దలకు దృష్టికి తీసుకెళ్లారు. పెద్దలతో కలిసి పాఠశాలకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం సదురు ఉపాధ్యాయుడిని మందలించారు. అయినా ఆయన ప్రవర్తలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, పెద్దలు మండల విద్యా శాఖ అధికారి (ఎంఈవో) శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎంఈవో విచారణ జరిపారు. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అసలు యోగా టీచర్ కాదు..
ఆ ఉపాధ్యాయుడి తీరుపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అక్కడ పని చేసే ఇతర టీచర్లు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు తాను విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించలేదంటూ ఉపాధ్యాయుడు ఎంఈవోకి వివరణ ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు. దీనిపై స్పందించి ఎంఈవో శ్రీనివాస్.. విద్యార్థినులు, మహిళా పోలీసు, తల్లిదండ్రులతో మాట్లాడి ఉపాధ్యాయుడి తీరుపై జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో) దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అసలు ఆయన యోగా టీచర్ కాదని, అలా వ్యవహరించడం తప్పేనని అన్నారు. డీఈవో ఆదేశాలతో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
బాలిక కిడ్నాప్..
బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ.. విజయనగరం పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు ఇచ్చారు. పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. మన్యం పార్వతీపురం జిల్లా కొమరాడ మండలానికి చెందిన బాలిక.. బస్సు కోసం నిరీక్షిస్తుండగా అదే గ్రామానికి చెందిన కె. రామారావు బైక్కుపై ఆమెను తీసుకెళ్లాడు. ఆమెను దూరంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికను ఆమె ఇంటి వద్ద దింపేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి.. రామారావును అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.13 వేల జరిమానా విధించింది.
యువకుడికి శిక్ష..
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో యువకుడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఖజానారావు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన ఎం.రవి.. మూడున్నరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 2024 అక్టోబర్ 27న గంట్యాడ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి.. రవిని అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడు రవికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్