Wednesday Motivation: చీమ ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంతో సమానం, వాటి నుంచి మనిషి ఈ లక్షణాలన్నీ నేర్చుకోవాలి

Best Web Hosting Provider In India 2024

Wednesday Motivation: చీమ ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంతో సమానం, వాటి నుంచి మనిషి ఈ లక్షణాలన్నీ నేర్చుకోవాలి

Haritha Chappa HT Telugu
Published Mar 12, 2025 05:30 AM IST

Wednesday Motivation: ప్రపంచంలో చులకనగా చూసే జీవుల్లో చీమ ఒకటి. కానీ ప్రకృతి చీమకు ఎంతో శక్తిని ఇచ్చింది. చీమను మనం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా చెప్పుకోవచ్చు.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Istock)

చీమలు చాలా చిన్నగా ఉంటాయి. వాటిని చూసి మనం నేర్చుకునేదేంటి? అని ఎంతోమంది అనుకుంటారు. నిజానికి చీమను మించిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు మరొకరు లేరు. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు చీమ నుంచి మనం పరిష్కారాన్ని నేర్చుకోవచ్చు. టీం వర్క్ గా, ఒంటరిగా, నాయకుడిగా ఎలా జీవించాలో చీమలు తమ నడవడికతోనే నేర్పిస్తాయి.

ఒకే లక్ష్యంతో ముందుకు

చీమలన్నీ కలిసి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసమే ప్రయాణం సాగిస్తాయి. వాటి లక్ష్యం ఆహారాన్ని సేకరించడం. అవి తమ కోసం తాము సేకరించుకోవు. మొత్తం తమ బృందం కోసం సేకరిస్తాయి. ఆ ప్రయాణంలో ఒక్క చీమ కూడా సమయాన్ని వృధా చేయదు. ఒకదాని వెంట ఒకటి ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాయి. చలికాలంలో పుట్ట నుంచి బయటికి వచ్చి ఆహారాన్ని వెతకలేవు. కాబట్టి వేసవికాలంలోనే చలికాలానికి కావలసిన ఆహారాన్ని కూడా సేకరించి పెట్టుకుంటాయి. అవన్నీ కూడా ఎవరి ఆహారాలు దాచుకోకుండా అంత ఆహారాన్ని ఒకే చోట దాచిపెడతాయి. అలాగే బృందంగానే తింటాయి .

ఒకే మాట ఒకే బాట

చీమల నుంచి మనం నాయకత్వ లక్షణాలను కూడా నేర్చుకోవాలి. ఐకమత్యమే మహాబలం అన్నది చీమ చెప్పకనే చెబుతోంది. నాయకుడు చెప్పిన ఒకే ఒక్క మాటకి ఆ బృందమంతా కలిసే ఉంటుంది. అతడు పెట్టిన నియమ నిబంధనలతోనే పాటిస్తుంది. అన్ని ఒకేలాగా చీమల నాయకుడి మాటను వింటాయి.

టైం మేనేజ్మెంట్ అంటే సమయపాలన పాటించడంలో చీమలను మించిన జీవి లేదు. వాటికి క్రమశిక్షణ చాలా ఎక్కువ. సొంత పనులను చేసుకోవు. అన్ని చీమలు బృందంగా కలిసి వెళ్లి కలిసి వస్తాయి. నాయకుడు చెప్పిన పనిని లక్ష్యాన్ని త్వరగా చేరుకునేందుకే అన్నీ కలిసి అడుగులు వేస్తాయి.

బరువు బాధ్యతలు మోస్తూ

ఆహార అన్వేషణ అయినా, ఇంటి నిర్మాణం అయినా కూడా చీమలు కలిసికట్టుగానే పనిచేస్తాయి. ఒక పుట్ట నిర్మించేందుకు ఎన్నో చీమలు కష్టపడతాయి. ఆ పుట్టలో ఉన్న తన ప్రాంతంతోపాటు ఇతరుల ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా, పటిష్టంగా ఉండేలా ప్రతి చీమా కష్టపడుతుంది. చీమకు సోమరితనం తెలియదు. శరీరాన్ని దాచుకోకుండా శక్తివంచన లేకుండా పనిచేస్తాయి. తమ కన్నా అనేక రెట్లు ఎక్కువ బరువున్న వస్తువులను మోస్తూ బాధ్యతలను నిర్వర్తిస్తాయి.

చీమలకు అడ్డదిడ్డంగా నడవడం తెలియదు. ఒక పద్ధతిలోనే ఒకదాని వెనక ఒకటి క్యూ లైన్ లోనే వెళ్తాయి. అలాగే మనుషులకు అడ్డుగా కూడా జీవించేందుకు ఇష్టపడవు. ఇంట్లో గోడ వారనుంచి ప్రయాణాన్ని సాగిస్తాయి. ఇంట్లో ఏదో ఒక మూలే తమ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఇతరులకు ఆటంకం కలిగించడం, ఇతరుల జీవితాల్లో హానికరంగా మారడం కూడా చీమలు చేయవు. అంతేకాదు అవి వాతావరణాన్ని బట్టి తమ అలవాట్లను మార్చుకుంటాయి. జీవిత శైలిని కూడా మార్చుకుంటాయి. ఈ ప్రకృతిలో ఎంతో క్రమశిక్షణగా, బుద్ధిగా జీవించేవి చీమలే. చీమలకున్న గుణాలు మనుషులకు ఉంటే ఈ ప్రపంచం ఒక అందమైన ప్రదేశంగా మారిపోతుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024