



Best Web Hosting Provider In India 2024

Jagityala Crime: అక్రమ దందాతో అధికారులకు బెదిరింపులు… ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు..
Jagityala Crime: చేసేది అక్రమ దందా…పైగా అధికారులకు బెదిరింపులు… అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించి అందిన కాడికి దండుకునే ముఠాకు చెందిన ముగ్గురిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

Jagityala Crime: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మెట్ పల్లి మండలాల్లో గత కొంత కాలంగా అక్రమ ఇసుక రవాణాతో పాటు భూమి సెటిల్మెంట్ దందాలు చేస్తూ ఎదిరించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించిన ముగ్గురిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు సెల్ ఫోన్లు, 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మీడియా సమక్షంలో వారిని చూపించి మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మెట్ పల్లి మండలం రాజేశ్వరరావు పేట కు చెందిన రెంజర్ల అజయ్, మెట్ పల్లి కి చెందిన బత్తుల భరత్, జెట్టి లక్ష్మణ్ ముగ్గురు ముఠాగా ఏర్పడి అక్రమ దందాకు తెరలేపారు.
నిందితులు మెట్పల్లిలో అక్రమంగా ఇసుక రవాణా చేయడమే కాకుండా సెటిల్మెంట్ దందాలు చేస్తూ అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేశారు. చెప్పినట్టు ఎవరైన వినకపోతే వారిపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించి అందిన కాడికి దండుకునేవారని పోలీసులు తెలిపారు.
పాపం పండింది ఇలా…
గత నెల ఫిబ్రవరి 12న రేంజర్ల అజయ్.. రాజేశ్వరరావు పేటలో అక్రమంగా మొరం రవాణా చేస్తుండగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీఈఈ లక్కంపల్లి అరుణోదయ కుమార్ అడ్డుకున్నారు. అజయ్ ఈ విషయాన్ని రమేష్ కు ఫోన్ ద్వారా చెప్పగా రమేష్ అక్కడికి చేరుకొని అరుణోదయ కుమార్ ను దూషించాడు.
అక్రమ రవాణాను అడ్డుకున్న అరుణోదయ్ కుమార్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించడంతో అతను అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత అరుణోదయ కుమార్ కు బత్తుల భరత్ ఫోన్ చేసి, కులం పేరుతో దూషించారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించాడు.
కేసు పెట్టకుండా ఉండాలంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడ్డ అరుణోదయకుమార్ ఫోన్ ఫే ద్వారా రెండుసార్లు మొత్తం 1,10,000 రూపాయలు పంపించాడు. 40,000 నగదు ఇచ్చాడు. అయినప్పటికీ, ఇంకా 1,50,000 ఇవ్వాలని అధికారిపై ఒత్తిడి తీసుకురావడంతో, ఉదయ్ కుమార్ ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇబ్రహీంపట్నం శివారులోని గండి హనుమాన్ వద్ద ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఓ విలేకరి అరెస్టు…
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో విలేకరిగా చలామణి అవుతూ అమాయకుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ప్రభుత్వ అధికారులపై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్న గట్టేపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిని మెట్ పల్లి పోలీసులు చేశారు. కళానగర్ కు చెందిన గట్టేపల్లి రాజశేఖర్ గత కొంత కాలంగా ఆర్ ఆర్ న్యూస్ పేరిట విలేకరి ముసుగులో అమాయక ప్రజలు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సిఐ నిరంజన్ రెడ్డి ప్రకటించారు.
ప్రస్తుతం అరెస్ట్ అయిన ముగ్గురితో ఈ విలేకరి అక్రమ దందాలకు పాల్పడమే కాకుండా బ్లాక్ మెయిల్ కు పాల్పడంతో చీటింగ్ కేసు నమోదు చేసి అధికారులను బెదిరించడం పై చట్ట పరంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎవరైనా అక్రమ దందాలకు పాల్పడినా, బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరించినా పోలీసులను ఆశ్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్