






Best Web Hosting Provider In India 2024

AP Finance Secretary: బిల్లులు ఇచ్చే దాకా ఆగాలన్న ఐఏఎస్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న ఏపీ కాంట్రాక్టర్లు..
AP Finance Secretary: “లాభాలు వచ్చినపుడు తిన్నారుగా, బిల్లులు చెల్లించే వరకు ఆగాలంటూ ” ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంట్రాక్టర్లు భగ్గుమన్నారు. ప్రభుత్వ పనుల్ని నిలిపి వేయాలని భావిస్తున్నారు. అధికారుల తీరుపై కాంట్రాక్టర్ల అసోసియేషన్ తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమైంది.

AP Finance Secretary: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు అడిగేందుకు వెళ్లిన కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌కు ఆర్ధిక శాఖలో చేదు అనుభవం ఎదురైంది. కాంట్రాక్టర్లకు సర్ది చెప్పాల్సిన ఫైనాన్స్ సెక్రటరీ పరుషంగా మాట్లాడటంతో కాంట్రాక్టర్లు ఖిన్నులయ్యారు. అధికారులతో తీరుతో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు.
ఏమి జరిగిందంటే…
ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వ్యవహారం కొద్ది నెలలుగా వివాదాస్పదమైంది. ప్రభుత్వం మారినపుడల్లా అంతకు ముందు ప్రభుత్వాల్లో చేసిన బిల్లుల్ని నిలిపి వేసే ధోరణి కొన్నేళ్లుగా సాగుతోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-19, 2019-24 మధ్య కాలంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్లు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు రూ.3500కోట్ల బిల్లులు చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరేడు వేల మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులు చేసినా వారికి బిల్లులు అందలేదు. అదే సమయంలో ప్రభుత్వం పెద్ద సంస్థలకు బిల్లులు మంజూరు చేస్తోంది.
ఈ క్రమంలో సోమవారం పెండింగ్ బిల్లుల విడుదల కోసం కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ తో కొంతమంది కాంట్రాక్టార్లు కలిశారు. తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని, బ్యాంకు రుణాలు ఎన్‌పిఏలుగా మారితే కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతారని వివరించారు.
పనులు ఎవరు చేయమన్నారు..?
కాంట్రాక్టర్ల వినతులపై స్పందించిన ఆర్థిక శాఖ కార్యదర్శి కొందరికి బిల్లులు చెల్లించామని, చాలా వరకు క్లియర్ చేశామని చెబుతూ .. మిమ్మల్ని పనులు ఎవరు చెయమన్నారని, ఎందుకు కాంట్రాక్ట్ వర్క్ చేశారని ప్రశ్నించడంతో కాంట్రాక్టర్లు బిత్తరపోయారు.
ప్రభుత్వ పనులతో గతంలో లాభాలు బాగా తిన్నారని, బిల్లులు చెల్లించడానికి సమయం పడుతుందని మరి కొన్ని నెలలు ఆగలేరా అని అడగడంతో బ్యాంకు రుణాలు తెచ్చి పనులు చేశామని వివరించే ప్రయత్నం చేయడంతో ఈ నెలలో పేమెంట్ చేయలేమని వారితో తేల్చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మరమ్మతులతో పాటు అత్యవసర పనుల్ని ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సుతో చేశామని కాంట్రాక్టర్లు వివరించే ప్రయత్నం చేయగా ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, బిల్లుల కోసం తనను కలవొద్దని ఆర్థిక మంత్రిని అడగాలని సూచించడంతో కాంట్రాక్టర్లు నివ్వెరపోయారు. కాంట్రాక్టర్లను కసురుకుంటూ, ఏవగించుకుంటూ మాట్లాడటంతో తమకు తగిన శాస్తి జరిగిందని వాపోయారు. బిల్లులు ఎప్పడిస్తామో కూడా చెప్పలేమని, బిల్లుల కోసం తన దగ్గరకు రావాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పినట్టు కాంట్రాక్టర్లు వివరించారు.
కాంట్రాక్టర్లంటే చిన్నచూపా..?
కాంట్రాక్టర్లతో ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ వ్యవహరించిన తీరుపై కాంట్రాక్టర్లు రగిలిపోతున్నారు. ప్రభుత్వ పరిస్థితి వివరిస్తే అర్థం చేసుకుంటామని, ఐదేళ్లుగా చెల్లింపులు జరగని కాంట్రాక్టర్లు కూడా ఉన్నారని, గత ఐదేళ్లలో లాభాలు అనుభవించారని దూషించారని కాంట్రాక్టర్లు ఆరోపించారు.
ఆర్థిక శాఖ కార్యదర్శి వ్యాఖ్యలపై ఆర్ అండ్ బి మంత్రి వద్దకు వెళ్లామని ఆయన దగ్గర కూడా తమకు సరైన సమాధానం రాలేదని కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర అసోసియేషన్‌లో 7వేల మంది కాంట్రాక్టర్లు ఉన్నారని వారికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్‌లో బిల్లులు చెల్లించకుండా ఒకే సంస్థకు వేల కోట్లు బిల్లులు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు.
జగన్ కూడా ఇలా చేయలేదు…!
జగన్ ప్రభుత్వ హయంలో ప్రభుత్వ అస్మదీయ కాంట్రాక్టు సంస్థకు ఎప్పుడు రూ. 1500 నుంచి 2వేల కోట్ల బకాయిలు ఉండేవని, అదే సంస్థకు ఇప్పుడు రుపాయి కూడా పెండింగ్ బిల్లులు లేవని కాంట్రాక్టర్లు తెలిపారు. ఆ కంపెనీ మార్చి 1న రిక్వెస్ట్ పెడితే 3న బిఆర్వో 6న పేమెంట్ జరిగిపోయిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా కాంట్రాక్టర్లకు ఎల్వోసి కావాలంటే నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలని ఇలా వారంలో చెల్లింపు సాధ్యమైనపుడు చిన్న కాంట్రాక్టర్లకు ఎందుకు చెల్లించరని ప్రశ్నించారు. రిషికొండలో చేసిన పనులకు కూడా కూటమి ప్రభుత్వం రూ.62 కోట్లు చెల్లించిందని ఆరోపించారు. నాబార్డ్ పేరుతో చేసిన చెల్లింపుల్లో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు.
కాంట్రాక్టర్ల వరుస ఆత్మహత్యలు..
గత ఐదేళ్లలో 50మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ప్రభుత్వం మారిన తర్వాత బిల్లులు అందక 15మంది చనిపోయారని కాంట్రాక్టర్లు ఆరోపించారు. 85ఏళ్ల చరిత్ర ఉన్న కాంట్రాక్టర్ల సంఘాన్ని ఏపీ ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్‌లు చులకనగా చూడటంపై కాంట్రాక్టర్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరును దేశ వ్యాప్తంగా అందరికి తెలిసేలా చేస్తామని కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు హిందుస్తాన్ టైమ్స్‌కు వివరించారు.
తమకు రావాల్సిన డబ్బులు అడిగితే వారి సొంత డబ్బు ఇస్తున్నట్టు బాధపడుతున్నారని, గంటల తరబడి కూర్చోబెడతారని, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి రోజు ప్రజల్ని కలవాలని ముఖ్యమంత్రి చెబుతుంటే ఐదారు గంటలు నిరీక్షిస్తే కానీ ఐఏఎస్‌ల దర్శనాలు దొరకవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై అభిమానంతో పనులు చేస్తే తగిన బుద్ది చెప్పారని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ఎందుకు పాటించరని అడిగితే తనను కలవాల్సిన అవసరం లేదని చెప్పారన్నారు.
పురుగుల్లా చూస్తున్నారు…
అధికారుల్ని బ్రతిమాలాల్సిన అవసరం తమకు లేదని ప్రభుత్వ పనులు చేసి ఇబ్బందులు పడాల్సిన అవసరం కాంట్రాక్టర్లకు లేదన్నారు. కొందరు అధికారులు తీరు అసహ్యకరంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్నంత దారుణమైన పరిస్థితులు కాంట్రాక్టర్లకు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని, ప్రభుత్వంపై ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నా బ్యూరోక్రసీలో మార్పు రావడం లేదని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. తమను మనుషులుగా కూడా చూడటం లేదని ప్రభుత్వ కార్యాలయాల్లో పురుగుల్లా వ్యవహరిస్తున్నారని, కనీస మర్యాద లేకుండా నిలబెట్టి మాట్లాడటం ఏమిటని, ఈ తీరు మారకపోతే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు తాము చేయలేమని నాగమల్లేశ్వరరావు వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్