



Best Web Hosting Provider In India 2024

Adilabad Sirichelma Shivalayam : ఈ శివయ్యకు ఎదురుగా రెండు నందులు..! ‘సిరిచెల్మ’ ఆలయ చరిత్ర తెలుసుకోండి
Sirichelime Shivalayam in Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిరిచెల్మ గ్రామంలోని శివాలయంలో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. శివుడు పార్వతీ సమేతంగా ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శివలింగం పైభాగంలో కొంత లోనికి వెళ్లినట్లు(సొట్టలుపడ్డ) కనిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్రములో అతి ప్రాచీన దేవాలయాలలో సిరిచల్మా మల్లికార్జున శివాలయము ఒకటి. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చాడ మండల కేంద్రానికి 15 కి. మీ. దూరములో ఉంటుంది. గ్రామానికి దక్షిణం వైపున ఉన్న చెరువులో తూర్పుముఖముగా నిర్మించబడినది. ఉత్తరాయణంలోని పాల్గుణ మాసంలో సూర్యకిరణాలు 17 దర్వాజలు, నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగంపై పడడం ఈ ఆలయం ప్రత్యేకత . ఈ దేవాలయంలోని శివలింగంపై సొట్టపడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ శివలింగం ముందు చిన్న రెండు నంది విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి కండ్లు తెరచి… మరోకటి కండ్లు మూసి ఉంటాయి.
రాష్ట్ర కూటుల కాలంలో నిర్మాణం….
ప్రదాన దేవాలయ ద్వారం 8వ శతాబ్దంలో పరిపాలించిన రాష్ట్ర కుటుల కాలంలో నిర్మించబడింది. ద్వారంపైన గజలక్ష్మి శిల్పంతో పాటు ఇరువైపులా కళశాలు చెక్కబడి ఉన్నాయి. మండపంలో గౌతమ బుద్ధుడు, మాతంగుడు, భక్త హన్మన్, గణపతి, విగ్రహాలున్నాయి. మండపానికి మూడు వైపులా గర్భగుడులు ఉన్నాయి.
స్వయంభువుగా శివలింగం…!
గతంలో ఇక్కడి ప్రాంతంలో పిట్టవ్వ, నిమ్మవ్వ అనే వైశ్య యువతులు అప్పాలు, గారెలు అమ్ముతూ జీవించే వారు. ఒక్కరోజు వారి వద్దకు ఆనాథ బాలుడు వచ్చి ఆశ్రమం కావాలని వారిని ఒప్పిస్తాడు. వారి దూడలకు కాపారిగా ఆశ్రయం పొందుతాడు. అప్పట్లో తీవ్ర కరువు రావటంతో ప్రజల తీవ్ర బాధలను ఎదుర్కొంటారు. వారి ఇబ్బందులను చూడలేకపోయిన ఆ బాలుడు… తట్ట, పారచేత పట్టుకొని చెరువును తవ్వి నెత్తిపై మట్టిని మోస్తు చెరువుకట్టను నిర్మిస్తాడు. నిర్మాణం తర్వాత ఓ రోజు ఆ బాలుడు అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత నిమ్మవ్వ, పిట్టవ్వలకు కలలోకి వచ్చి చెరువు మధ్యలో తానే స్వయంభూ శివలింగంగా అవతరించినట్లు చెబుతాడు. మరుసటి రోజు చెరువులోకి వెళ్లిచూడగా సొట్టపోయిన శివలింగం దర్శనమిచ్చినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ ఆలయంలో విశేషమైన వాస్తు శిల్పకళ ఉంది. రాష్ట్ర కుటులు, చాళిక్యులు, కాకతీయుల కాలంలో నిర్మించినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలో జైన, బౌద్ధ మత ఆనవాళ్లతో పాటు వైష్ణవ, శైవ మతాలకు చెందిన విగ్రహాలు ఉన్నాయి. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న ఈ దేవాలయాన్ని ఆధునీకరించి… పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఆర్కియాలజిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కటుకం మురళి ప్రభుత్వాన్ని కోరారు.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్