The Smile Man Review: సైకో కిల్ల‌ర్ క‌థ‌తో వ‌చ్చిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – ది స్మైల్ మ్యాన్ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

The Smile Man Review: సైకో కిల్ల‌ర్ క‌థ‌తో వ‌చ్చిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – ది స్మైల్ మ్యాన్ ఎలా ఉందంటే?

Nelki Naresh HT Telugu
Published Mar 14, 2025 05:58 AM IST

The Smile Man Review: శ‌ర‌త్‌కుమార్ హీరోగా న‌టించిన త‌మిళ‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ది స్మైల్ మ్యాన్ అదే పేరుతో తెలుగులో డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ సైకో కిల్ల‌ర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

ది స్మైల్ మ్యాన్ రివ్యూ
ది స్మైల్ మ్యాన్ రివ్యూ

The Smile Man Review: కోలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ శ‌ర‌త్‌కుమార్ హీరోగా న‌టించిన ది స్మైల్ మ్యాన్ తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ సైకో కిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీకి శ్యామ్‌, ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ ఎలా ఉందంటే?

పోలీస్ ఆఫీస‌ర్ వ‌ర్సెస్ సైకో కిల్ల‌ర్‌…

చిదంబ‌రం నెడుమార‌న్ (శ‌ర‌త్ కుమార్‌) నిజాయితీ ప‌రుడైన పోలీస్ ఆఫీస‌ర్‌. స్మైల్ మ్యాన్ అనే సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకొనే ప్ర‌య‌త్నంలో తీవ్రంగా గాయ‌ప‌డ‌తాడు. అల్జీమ‌ర్స్ స‌మ‌స్య కార‌ణాల త‌న జ్ఞాప‌క‌శ‌క్తిని మెళ్లిమెళ్లిగా కోల్పోతుంటాడు. చాలా కాలం క్రిత‌మే ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయాడ‌నుకున్న స్మైల్ మ్యాన్ వైజాగ్‌లో మ‌ళ్లీ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంటాడు. ఈ సీరియ‌ల్‌ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోవ‌డానికి అర‌వింద్ అనే పోలీస్ ఆఫీస‌ర్ రంగంలోకి దిగుతాడు.

ఈ కేసును సాల్వ్ చేయ‌డంలో చిదంబ‌రం సాయం కోరుతాడు అర‌వింద్‌. చిదంబ‌రం స‌న్నిహితుల‌నే ఓ సైకో కిల్ల‌ర్ టార్గెట్ చేస్తున్నాడ‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. అస‌లు ఆ సైకో కిల్ల‌ర్ ఎవ‌రు? ప్ర‌భు(క‌లైయార‌స‌న్‌) అనే మార్చురీలో ప‌నిచేసే వ్య‌క్తికి ఈ హ‌త్య‌ల‌కు ఎలాంటి సంబంధం ఉంది? ప్ర‌భు ప్రాణంగా ప్రేమించిన చిత్ర ఏమైంది? అర‌వింద్ తండ్రి వెంక‌టేశం ఎలా చ‌నిపోయాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సైకో కిల్ల‌ర్ ట్రెండ్‌…

భాషాభేదాల‌తో సంబంధం లేకుండా కొన్నాళ్లుగా సైకో కిల్ల‌ర్ సినిమాలు విరివిగా వ‌స్తోన్నాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ అంశాల‌తో కూడిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోండ‌టంతో ఈ కాన్సెప్ట్‌ల‌పై డైరెక్ట‌ర్లు ఎక్కువ‌గా ఆస‌క్తిని చూపుతున్నారు. ఈ ట్రెండ్‌లో వ‌చ్చిన మూవీనే ది స్మైల్ మ్యాన్‌.

ఒకే ఫార్మెట్‌…

సాధార‌ణంగా సైకో కిల్ల‌ర్ మూవీస్ చాలా వ‌ర‌కు ఒకే ఫార్మెట్‌లో సాగుతాయి. ఎలాంటి క్లూస్ లేకుండా ఓ సైకో కిల్ల‌ర్ క్రూరంగా హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం, పోలీస్ ఆఫీస‌ర్ అయిన హీరో త‌న తెలివితేట‌ల‌తో ఆ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోవ‌డం, ఆ కిల్ల‌ర్‌కు భ‌యంక‌ర‌మైన ఫ్లాష్‌బ్యాక్ ఉండ‌టం కామ‌న్‌. ది స్మైల్ మ్యాన్ సినిమా కూడా అదే రెగ్యుల‌ర్ టెంప్లేట్ ఫార్ములాలోనే సాగుతుంది.

అల్జీమ‌ర్స్‌…

అయితే ఇందులో హీరోకు అల్జీమ‌ర్స్ అనే కొత్త పాయింట్‌ను జోడించారు ద‌ర్శ‌క‌ద్వ‌యం. త‌న‌కున్న వ్యాధి కార‌ణంగా జ్ఞాప‌క‌శ‌క్తిని కోల్పోయే హీరో….కిల్ల‌ర్‌ను ఎలా ప‌ట్టుకున్నాడు, కేసును ఎలా సాల్వ్ చేశాడ‌న్న‌ది మ‌ల్టీపుల్ లేయ‌ర్స్‌తో క‌థ‌ను రాసుకున్నాడు. అల్జీమ‌ర్స్ పాయింట్‌ను బాగా వాడుకున్నాడు.

ఓ వైపు సైకో కిల్ల‌ర్ ఎవ‌రు? ఎందుకు హ‌త్య‌లు చేస్తున్నాడు అనే క్యూరియాసిటీని క‌లిగిస్తూనే…మ‌రోవైపు హీరోనే… విల‌నా అనే డౌట్‌ను ఆడియెన్స్‌లో క్రియేట్ చేస్తూ థ్రిల్లింగ్‌ను పంచాడు. హీరో యాక్సిడెంట్ సీన్‌తోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత అల్జీమ‌ర్స్ బారిన ప‌డ‌టం, అర‌వింద్ ఎంట్రీతో ఆరంభ స‌న్నివేశాలు కాస్తంత స్లోగా అనిపిస్తాయి. ఫేక్ ఎన్‌కౌంట‌ర్ల‌కు సంబంధించి వ‌చ్చే సీన్స్ బాగున్నాయి.

ఫ్లాష్‌బ్యాక్ సోసో…

కిల్ల‌ర్ తెలివిగా హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం, అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి చిదంబ‌రం వేసే ఎత్తుల‌ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ రాసుకుంటే బాగుండేది. అర‌వింద్ ఫాద‌ర్‌కు సంబంధించిన ఏదో ట్విస్ట్ ఉంటుంద‌ని ఆడియెన్స్ చివ‌రి వ‌ర‌కు ఎదురుచూసేలా చేశాడు. కానీ ఆ ఫ్లాష్‌బ్యాక్ సోసోగానే అనిపిస్తుంది. కిల్ల‌ర్ ఫ్లాష్‌బ్యాక్ కూడా అంత క‌న్వీన్సింగ్‌గా లేదు.

మ్యూజిక్ డైరెక్టర్ హీరో…

చిదంబ‌రం అనే పోలీస్ పాత్ర‌లో శ‌ర‌త్‌కుమార్ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రీ కొత్త‌గా ఉన్నాయి. త‌న పాత్ర‌కు న్యాయం చేసేందుకు సిన్సియ‌ర్‌గా క‌ష్ట‌ప‌డ్డాడు. సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా క‌లైయార‌స‌న్ ఎంట్రీనే అదిరిపోయింది. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ గ్రాఫ్ త‌గ్గుతూ వ‌చ్చింది. అర‌వింద్‌, సిజా రోజ్ హ‌డావిడి త‌ప్పితే పాత్ర‌లు రాసుకున్న తీరు, యాక్టింగ్ ప‌ర‌మ రొటీన్‌గా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గ‌వాస్క‌ర్ అవినాష్ ఈ మూవీకి మ‌రో హీరోగా నిటిచాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే భ‌య‌పెట్టాడు.

రొటీన్ సైకో కిల్లర్ మూవీ…

ది స్మైల్ మ్యాన్ హీరో క్యారెక్ట‌రైజేష‌న్ మిన‌హా మిగిలిన‌దంతా రొటీన్ సైకో కిల్ల‌ర్ మూవీ. శ‌ర‌త్‌కుమార్ యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు. పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోకుండా చూస్తే న‌చ్చుతుంది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024