



Best Web Hosting Provider In India 2024
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గందరగోళం.. మళ్లీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలన్న కేంద్రం!
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ గ్రామీణ ప్రాంత అర్హుల జాబితాపై కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. తాము రూపొందించిన యాప్‌తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మళ్లీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని చెప్పింది. కేంద్ర నిబంధనల మేరకే సర్వే చేశామని.. ఆమోదించాలని మన ప్రభుత్వం కోరింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం సుమారు 30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది. 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించింది. ఆ జాబితా సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణనలోకి తీసుకోబోమని కేంద్రం మెలిక పెట్టింది.
మళ్లీ సర్వే చేసి..
తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్లీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని.. కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డైలమాలో పడింది. మళ్లీ అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్‌తో సర్వే చేయటం ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు. దీంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. ఏం చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు.
ఇళ్ల నిర్మాణం ప్రారంభం..
ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందితే.. లబ్ధిదారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళం నెలకొంది. వచ్చే నాలుగేళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి సంబంధించి వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి రాబట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది.
కేంద్రం కండీషన్లు..
అయితే.. ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తున్నామనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. అటు ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదని, కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అనర్హులకు ఇళ్లు మంజూరు చేసినట్టు తేలితే.. నిధులు ఇవ్వబోమని కండీషన్లు పెట్టింది. షరతులకు అంగీకరించిన ప్రభుత్వం.. అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది.
కారణాలు ఏంటి..
ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులపై సర్వే చేశారు. కానీ.. అందులో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేవీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని.. ఇళ్లను మంజూరు చేసేనాటికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కోరినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
ఆశలపై నీళ్లు..
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ రూ.73 వేలు ఉంది. ఈ నిధులన్నా పొందుదామంటే కేంద్రం పెట్టిన మెలిక.. తెలంగాణ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి సాయం అందని నేపథ్యంలో.. మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది. ఇది పెద్ద భారంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి కేంద్రం పెట్టిన మెలిక.. ఇళ్ల ఆశలపై నీళ్లు చల్లింది.
టాపిక్