



Best Web Hosting Provider In India 2024
Telangana Assembly : కేసీఆర్‌తో ఎపుడైనా చర్చకు సిద్ధం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉగ్రరూపం!
Telangana Assembly : శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌తో ఎపుడైనా చర్చకు సిద్ధం అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఏ రోజు వస్తే ఆరోజు కృష్ణా జలాలపై చర్చ పెడదామని చెప్పారు. ఒక భావోద్వేగంతో తెలంగాణను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.
కేసీఆర్ 100 సంవత్సరాల బతకాలి.. ఆయన ప్రతిపక్షంలో అక్కడ అలాగే ఉండాలి.. తాము అధికారపక్షంలో ఇక్కడ ఇలాగే ఉంటాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలే తప్పు చేశారని బీఅర్ఎస్ నేతలు అంటున్నారు.. ప్రజలను తప్పు పట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. మీ స్టేచర్ పైన ఉన్న ఆలోచన తెలంగాణ ఫ్యూచర్ పైన లేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ మారమార్చురీలో ఉందని మాట్లాడానన్న రేవంత్.. కేసీఆర్‌ను అనేంత కుంచిత బుద్ది తనకు లేదని స్పష్టం చేశారు. రైతు సమస్యలపై కేసీఆర్‌తో ఎపుడైనా చర్చకు సిద్ధమని చెప్పారు.
మహిళల కోసం..
‘తెలంగాణలో మహిళలు నన్ను ఇంటిబిడ్డగా చూసుకున్నారు. ఆడ బిడ్డలకు స్వేచ్ఛ కల్పించాలని ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. 5000 స్కూల్స్‌ను బీఆర్ఎస్ మూసివేసింది. స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చాం. 1000 ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలకు ఇచ్చాం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చాము. బతుకమ్మ చీరల పేరుతో దోపిడీ చేశారని వాటిని రద్దు చేశాం. రేవంతన్నా అని ఆడబిడ్డలు నన్ను ఒక అన్నలా చూస్తున్నారు’ అని సీఎం వ్యాఖ్యానించారు.
నాపై కోపం ఉండొచ్చు..
‘అన్ని యూనివర్సిటీ వీసీ నియామకాల లిస్టు తీద్దాం.. మేం సామాజిక న్యాయం చేసింది నిజమో కాదో చూద్దాం. వాళ్ల విలాసవంతమైన జీవితాలకు భంగం కలిగించానని వాళ్లకు నాపై కోపం ఉండొచ్చు. కానీ కుల దురహంకారం ప్రదర్శించడం న్యాయమా.. గవర్నర్, స్పీకర్‌లను గౌరవించరు, ఏకవచనంతో సంభోదిస్తున్నారు. పైగా సమర్థించుకుంటూ ధర్నాలు చేస్తున్నారు.. ఇదెక్కడి న్యాయం’ అని రేవంత్ ప్రశ్నించారు.
వాళ్ల అజ్ఞానం..
‘భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మనం వ్యవస్థలను నడుపుతున్నాం. 2022 బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారు. మహిళా గవర్నర్‌ను అవమానించేలా వ్యవహరించారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత వ్యవస్థలను సంస్థలను గౌరవించుకుంటూ ముందుకు వెళుతున్నాం. సీనియర్లమని, పదేళ్లు మంత్రులుగా చేసినమని చెప్పుకునేవాళ్లు గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టారు. వాళ్లు వారి అజ్ఞానాన్నే తమ విజ్ఞానమని అనుకుంటున్నారు’ అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.
మహిళను అవమానించారు..
‘మంత్రివర్గం ఆమోదం పొందిన అంశాలనే గవర్నర్ తమ ప్రసంగంలో వినిపించారు. ఎలక్షన్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రభుత్వంలో అమలు చేస్తున్నాం. మేం అమలు చేసే వాటినే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచాం. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఉండదు. పదేళ్లు పాలించినవారు మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారా.. వాళ్లకు గవర్నర్ పై గౌరవం లేకనే మహిళను అవమానించారు’ అని రేవంత్ విమర్శించారు.
ఘనత మాదే..
‘పదేళ్ల విధ్వంసం, నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజలు మార్పును కోరుకున్నారు. అందుకే ప్రజల ఆశీర్వాదంతో మేం ఇక్కడ ఉన్నాం. తెలంగాణ ప్రజలు 70 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమే గతంలో తెలంగాణలో పోరాటాలు జరిగాయి. భూమి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. రైతులకు రూ.20624 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. రైతులు ఆత్మగౌరవంతో బ్రతికేలా చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఎన్నికలను అడ్డు పెట్టుకుని ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొడితే.. మేం అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో రూ. 7625 కోట్లు రైతు బంధు రైతుల ఖాతాల్లో వేసింది మా ప్రభుత్వం’ అని సీఎం వివరించారు.
కేసీఆర్.. సిద్ధమా..
‘మా ప్రశ్నలకు సంధానం ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ సభ నుంచి వెళ్లిపోయారు. 15 నెలల్లో కేసీఆర్ సభకు కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని ప్రజలను వారి కర్మకు వదిలేసిన నాయకుడు కేసీఆర్. ఎస్ఎల్‌బీసీ, డిండి పూర్తి చేసి ఉంటే నల్లగొండ కష్టాలు తీరేవి కదా. కేసీఆర్ ఏ రోజు వస్తే ఆరోజు కృష్ణా జలాలపై చర్చ పెడదాం. లెక్కలతో సహా నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మాది తప్పయితే బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెపదానికి సిద్ధం. ఈ సవాలుకు కేసీఆర్ సిద్ధమా చెప్పాలి’ అని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.
కేసీఆర్ సూచనలు ఇవ్వాలి..
‘కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు.. దావత్‌లు ఇచ్చే దోస్తులు.. వీళ్లేనా బీఆర్ఎస్‌కు కావాల్సింది. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి వారికి పట్టదా.. నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పుకుంటున్నవాళ్లు పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలను భర్తీ చేయలేదు. దేశ చరిత్రలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వానిది. వాళ్ల హయాంలో 22.9 శాతం ఉన్న నిరుద్యోగ సమస్యను.. 18.1 శాతానికి తగ్గించిన చరిత్ర మాది. కేసీఆర్ సభలో ఉండి వారి అనుభవంతో సూచనలు ఇస్తే అభ్యంతరం లేదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
టాపిక్