






Best Web Hosting Provider In India 2024

Pawan Kalyan On Hindi : నేనెప్పుడూ హిందీని వ్యతిరేకించలేదు, నిర్బంధంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించా- పవన్ కల్యాణ్
Pawan Kalyan On Hindi : దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడు నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై డీఎంకే నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో మరోసారి పవన్ కల్యాణ్ స్పందించారు.

Pawan Kalyan On Hindi : దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే వాదనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…జనసేన 12వ ఆవర్భావ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అన్ని భాషలు అవసరమేనంటూ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు డీఎంకే పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
“ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం… రెండూ మన దేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవు. నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే నేను వ్యతిరేకించాను. NEP 2020 స్వయంగా హిందీని అమలు చేయనప్పుడు, దాని విధించడం గురించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు”
“NEP 2020 ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలను (వారి మాతృభాషతో సహా) నేర్చుకునే వెసులుబాటును కలిగి ఉన్నారు. వారు హిందీని అధ్యయనం చేయకూడదనుకుంటే, వారు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలి, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చు.
బహుళ భాషా విధానం విద్యార్థులకు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడం, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి రూపొందించారు. ఈ విధానాన్ని రాజకీయ అజెండాల కోసం తప్పుగా అర్థం చేసుకోవడం, పవన్ కల్యాణ్ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడం అవగాహనా లోపాన్ని ప్రతిబింబిస్తుంది. జనసేన పార్టీ ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక సూత్రానికి కట్టుబడి ఉంది”- పవన్ కల్యాణ్
డీఎంకే నేతల కౌంటర్
హిందీ భాష వద్దు కానీ తమిళ సినిమాలను హిందీలో డబ్ చేసి ఉత్తరాధి రాష్ట్రాల డబ్బులు కావాలా? అంటూ తమిళనాడు జరుగుతున్న హిందీ వివాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై డీఎంకే ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా కౌంటర్ ఇచ్చారు. తమిళనాడు ఎప్పుడూ హిందీ భాషను వ్యతిరేకించలేదని, తాము ప్రజలపై హిందీ లేదా మరే ఇతర భాషను బలవంతంగా రూద్దవద్దని చెబుతున్నామన్నారు. హిందీని బలవంతంగా రుద్దడాన్నే తమిళనాడు సుదీర్ఘ కాలంగా వ్యతిరేకిస్తుందన్నారు. తమిళనాడు భాషా విధానంపై పవన్ కల్యాణ్‌కు సరైన అవగాహన లేనట్లు ఉందన్నారు.
సీనియర్ డీఎంకే నేత టీకేఎస్ ఎలంగోవన్ మాట్లాడుతూ… తమిళనాడు భాషా విధానం చాలా కాలంగా స్థిరంగా ఉందన్నారు. 1938 నుంచే తమిళనాడు హిందీకి వ్యతిరేకంగా పోరాడుతుందని, 1968లో ద్విభాషా విధానం అమలులోకి వచ్చిందన్నారు. అప్పటికి పవన్ కల్యాణ్ పుట్టి ఉండలేదన్నారు. తమిళనాడు భాషా విధానంపై పవన్ కు అవగాహన ఉండకపోవచ్చని ఎలంగోవన్ వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం
టాపిక్