Ambati Rambabu : చంద్రబాబు కోసమే పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్, జనసేన టీడీపీకి బీ టీమ్ – అంబటి రాంబాబు

Best Web Hosting Provider In India 2024

Ambati Rambabu : చంద్రబాబు కోసమే పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్, జనసేన టీడీపీకి బీ టీమ్ – అంబటి రాంబాబు

Bandaru Satyaprasad HT Telugu Published Mar 15, 2025 08:12 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Published Mar 15, 2025 08:12 PM IST

Ambati Rambabu : పిఠాపురం జనసేన సభలో పవన్ కల్యాణ్ అసలేం మాట్లాడారో ఆయనకైనా అర్థమైందా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసమే జనసేన స్థాపించారని విమర్శించారు. జనసేన టీడీపీ బీ టీమ్ గా పనిచేస్తుందన్నారు.

చంద్రబాబు కోసమే పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్, జనసేన టీడీపీకి బీ టీమ్ - అంబటి రాంబాబు
చంద్రబాబు కోసమే పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్, జనసేన టీడీపీకి బీ టీమ్ – అంబటి రాంబాబు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Ambati Rambabu : పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్‌ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… “చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్‌ జనసేన స్థాపించారని, పవన్‌ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారు” అంటూ అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు.

అయోమయంగా పిఠాపురం స‌భ‌

“శాస‌న‌స‌భ‌లోకి ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టిసారి ప్రవేశించిన త‌ర్వాత ఈ స‌భ నిర్వహించారు. ప్రజ‌లంతా మీడియా హ‌డావుడి చూసి ఆయ‌న ఏం చెబుతారోన‌ని చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తే, ఆయ‌న ఏం చెప్పద‌లుచుకున్నారో ఆయ‌న‌కైనా అర్థమైందా అనే అనుమానం క‌లిగేలా మాట్లాడారు. 40 ఏళ్ల టీడీపీ ప‌డిపోతుంటే నిల‌బెట్టామ‌ని మాత్రం ఆయ‌న నిజం చెప్పారు. టీడీపీ ప‌డిపోకుండా నిల‌బెట్టడానికి ఏర్పాటు చేసిన పార్టీ జ‌న‌సేన అని మేం మొద‌ట్నుంచి చెబుతూనే ఉన్నాం.

కాపు స‌మాజం మీద అనేక దుశ్చర్యల‌కు పాల్పడిన‌ చంద్రబాబు, కాపుల‌ను నేరుగా చేతుల్లోకి తీసుకోలేక టీడీపీ బీ టీమ్‌గా ప‌నిచేయ‌డానికి ప‌వ‌న్ కల్యాణ్ సార‌థ్యంలో జ‌న‌సేన ఏర్పాటు చేయించారు. కాపుల ఓట్లను త‌న‌వైపు తిప్పుకునే ప్రక్రియ‌లో భాగంగానే ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు మేం మొద‌టి రోజు నుంచి చెబుతూ వ‌స్తున్నాం. చంద్రబాబుకి ఏ ఆప‌ద వ‌చ్చినా కాపు కాయ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుకొస్తారు. కాబ‌ట్టే జ‌న‌సేన పార్టీ మెయింటినెన్స్ బాధ్యత‌ల‌న్నీ చంద్రబాబే చూస్తారు”-మాజీ మంత్రి అంబటి రాంబాబు

‘ఒక‌సారి తెలుగుదేశం పార్టీకి స‌పోర్టు చేయ‌డం, ఇంకో ఎన్నిక‌ల్లో వ్యతిరేక ఓట్లు చీల్చేలా ఇత‌ర పార్టీల‌తో క‌లిసిపోటీ చేయడం.. ఇదంతా చంద్రబాబు ఆదేశాల‌తో చేస్తున్నదే త‌ప్ప.. ఆయ‌న‌కంటూ సొంత విధానాలున్నాయా? 11 ఏళ్లుగా చంద్రబాబు కోసం అవ‌కాశ‌వాద రాజ‌కీయాలే చేశారు కానీ, ఆయ‌న రాష్ట్రం గురించి ఏనాడూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు’ అని విమర్శించారు.

గెలిచిన ఎమ్మెల్యేల్లో జ‌న‌సేన నాయ‌కులు ఎంత‌మంది?

100 శాతం స్ట్రైక్ రేట్ అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబుతున్నారు.. కానీ ఆ సీట్లు సొంతంగా పోటీ చేస్తే రాలేద‌నే విష‌యం ఆయ‌న గుర్తుంచుకోవాలని అంబటి రాంబాబు అన్నారు. నిన్న స‌భ‌లో కూర్చున్న 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీల్లో జ‌న‌సేన నాయ‌కులు ఎంత‌మంది ఉన్నారో చెప్పాక‌, స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. గాలికి కొట్టుకొచ్చిన వాళ్లని పెట్టుకుని ప్రజ‌ల దుర‌దృష్టవ‌శాత్తు గెలిచార‌నే విష‌యం తెలియ‌దా? ఆ అభ్యర్థులంతా చంద్రబాబు పంపినోళ్లు, వైయ‌స్సార్సీపీ వ‌ద్దనుకుని తిర‌స్కరించినోళ్లు కాకుండా జ‌న‌సేన త‌యారు చేసిన నాయ‌కులు ఎంత‌మంది ఉంటారో చెప్పాలన్నారు.

“అధికారంలోకి వ‌చ్చాక సూప‌ర్ సిక్స్ లో ఎన్ని హామీలు అమ‌లు చేశారో ఎందుకు చెప్పలేక‌పోతున్నారు? జ‌య‌కేత‌నం స‌భ‌లో ఎన్నిక‌ల్లో ఇచ్చిన 143 హామీల ఊసెత్తడం లేదు ఎందుకు? రాజ‌కీయాల్లో స‌మృద్ధిగా ధ‌నం సంపాదించుకుని ఆరోగ్యం చెడగొట్టుకున్నాన‌ని చెబుతున్నాడు. పిఠాపురంలో స‌భ పెట్టి అన్ని అబ‌ద్దాలు చెప్పాడు. మొన్నటిదాకా ఆదర్శాలు గురించి చెప్పి ఇప్పుడు డాక్టర్ కాబ‌ట్టి చేగువేరా ఫొటో పెట్టుకున్నాన‌ని చెబుతాడా? మా నాన్న హేతువాది, దీపారాధ‌న‌లో సిగిరెట్ వెలిగించుకునేవాడ‌ని చెప్పిన ఈ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నిన్నటి స‌భ‌లో మాత్రం మా ఇంట్లో నిత్యం రామ నామ స్మర‌ణ వినిపిస్తుంద‌ని జ‌నం చెవుల్లో క్యాబేజీ పూలు పెడుతున్నారు. ఎందుకిలా పూట‌కో మాట చెప్పడం.. త‌న‌ను తాను గొప్పగా ప్రొజెక్టు చేసుకునేందుకు తండ్రిని కించ‌ప‌రిచేలా దిగజార‌డం అవ‌స‌ర‌మా?”- మాజీ మంత్రి అంబటి రాంబాబు

ద‌క్షిణాది మీద ఉత్తరాది వారి పెత్తనం, అహంకారం అని మొన్నటిదాకా అరిచి గ‌గ్గోలు పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ష‌డ‌న్‌గా కాషాయం ధ‌రించి యూట‌ర్న్ తీసుకున్నారని అంబటి విమర్శించారు. గతంలో ఈ పెద్ద మ‌నిషే విప్లవ భావాలతో తుపాకీ ప‌ట్టుకోవాల‌ని చెప్పారన్నారు. ఏదో ఒక నిర్ణయం మీద నిల‌బ‌డ‌కుండా నిత్యం ఎటు గాలికొడితే అటు కొట్టుకుపోవ‌డం త‌ప్ప, ఆయ‌న‌కంటూ ఒక నిర్ణయం మీద నిల‌బ‌డే స‌త్తా లేదని విమర్శించారు.

నాలుగైదు భాష‌ల్లో చ‌దివి త‌న‌కు తానే ద‌క్షిణాది త‌ర‌ఫున ఉత్తరాది నాయ‌కుడిన‌ని ప్రక‌టించుకున్నారన్నారు. కుటుంబ రాజ‌కీయాలు, వార‌స‌త్వ రాజ‌కీయాలు ఏంట‌ని ప్రశ్నించారని, నాయ‌కులు ప్రజ‌ల నుంచి పుట్టాలంటారు.. ఇన్ని మాట‌లు చెప్పి చివ‌రికి వ‌చ్చిన ఒక ఎమ్మెల్సీ ప‌దవిని అన్న నాగబాబుకు ఇచ్చుకున్నారని విమర్శించారు. అవ‌కాశవాద రాజ‌కీయాల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్.. చంద్రబాబునే మించిపోయారని ఎద్దేవా చేశారు.

వ‌ర్మను వాడుకుని వ‌దిలేశారు

“అధికారం ఉంది కాబ‌ట్టి జనం వ‌చ్చార‌ని గుర్తుంచుకోవాలి. అధికారంలో ఎవ‌రున్నా జ‌నం వ‌స్తార‌ని తెలుసుకోవాలి. ప‌వ‌న్ కల్యాణ్ సీఎం అవుతార‌ని ఇన్నాళ్లు కాపులు అనుకున్నారు. ఇప్పుడిప్పుడే చంద్రబాబుకి ఊడిగం చేయ‌డానికి పార్టీ పెట్టార‌ని తెలుసుకుంటున్నారు. న‌న్ను గెలిపించే బాధ్యత నీదేనని సీటు త్యాగం చేయించుకుని గెలిచిన త‌ర్వాత నీవ‌ల్ల గెల‌వ‌లేద‌ని వ‌ర్మను ఎగ‌తాళి చేశారు. అక్కరు గ‌డుపుకుని మోసం చేయ‌డంలో చంద్రబాబునే మించి పోయారు ప‌వ‌న్‌. త‌న‌ను గెలిపించిన వర్మను నీ ఖ‌ర్మ అనేలా విర్రవీగ‌డం మంచిది కాదు. పిఠాపురంలో మొద‌టిసారే గెలిచార‌నే సంగ‌తి కూడా మ‌రిచిపోవ‌ద్దు. చంద్రబాబు, జ‌గ‌న్‌లా వ‌రుస‌గా గెలిచిన చ‌రిత్ర మీకు లేదు. నోరుజారి ఇలాగే మాట్లాడితే ఖ‌ర్మ మీరు అనుభవిస్తారు” -మాజీ మంత్రి అంబటి రాంబాబు

పార్టీ మారినంత మాత్రాన నోరు జారితే ఎలా?

“వైవీ సుబ్బారెడ్డి లేక‌పోతే బాలినేని శ్రీనివాస‌రెడ్డి రాజ‌కీయాల్లో ఇంత‌కాలం నిల‌బ‌డగ‌లిగేవారా? వైఎస్ కుటుంబం ద‌య‌లేక‌పోతే ప‌ద‌వులు వ‌చ్చేవా? ఎక్కడో ఆస్తులు పోగొట్టుకుని వ‌చ్చి, రాజ‌కీయాల్లో పోగొట్టుకున్నాన‌ని చెప్పడం సిగ్గుచేటు. ఆస్తులు ఎక్కడ పోయాయో ఒంగోలు ప్రజ‌లంద‌రికీ తెలుసు. అధికారం ఉన్నంత‌కాలం విజ‌య‌సాయిరెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి పెత్తనం చెలాయించి పార్టీ ఓడిపోవ‌డంతో అన్యాయం జ‌రిగింద‌ని చెప్పుకోవ‌డం సిగ్గుచేటు.

ఇలాంటి బాలినేనిని న‌మ్మి ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాలు చేశాడంటే నాశ‌నం కావ‌డం త‌థ్యం. వైఎస్సార్, జ‌గ‌న్‌ ద‌యాదాక్షిణ్యాల‌తో ఎంపీ అయిన బాల‌శౌరి కూడా వేదిక దొరికింది క‌దా అని రెచ్చిపోవ‌డం త‌గ‌దు. ఆయ‌న జీవితం మొత్తం ప్రజ‌ల‌కు తెలుసు. నాలుగేళ్ల త‌ర్వాత ప‌రిస్థితులు మారతాయ‌ని గుర్తుంచుకుంటే మీకే మంచిది. దుర్మార్గమైన రాజ‌కీయాలు చేస్తే భ‌విష్యత్తులో మీకు నూక‌లు కూడా మిగ‌ల‌వ‌ని గుర్తంచుకోవాలి.

కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగ‌బాబు కూడా జ‌గ‌న్ గురించి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు. ఎవ‌రిదో ద‌యాదాక్షిణ్యాలుంటే త‌ప్ప గెల‌వలేని అన్నద‌మ్ములు.. దిల్లీ కోట‌ను ఢీకొట్టిన జ‌గ‌న్ గురించి మాట్లాడే స్థాయి ఉందేమో ఆత్మవిమ‌ర్శ చేసుకోవాలి. పార్టీ పెట్టిన ప‌దేళ్లలో వైయ‌స్సార్సీపీని అదికారంలోకి తెచ్చాడని చ‌రిత్ర చూసి తెలుసుకోవాలి. వైఎస్ కొడుకు కాక‌పోయుంటే అని జ‌గ‌న్ గురించి మాట్లాడే మంత్రి కందులు దుర్గేష్‌.. అల్లు రామ‌లింగయ్యకి అల్లుడు కాక‌పోయుంటే చిరంజీవి ఏమ‌య్యేవారో, ఆయ‌న కుటుంబం ఎలా ఉండేదో ఊహించుకోవాలని” అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

YsrcpAp PoliticsPawan KalyanJanasenaTdpAndhra Pradesh NewsTrending Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024