Pakistan train hijack: పాక్ మొండితనం వల్ల 214 మంది బందీలను చంపేశాం; బలూచ్ మిలిటెంట్ల సంచలన ప్రకటన

Best Web Hosting Provider In India 2024


Pakistan train hijack: పాక్ మొండితనం వల్ల 214 మంది బందీలను చంపేశాం; బలూచ్ మిలిటెంట్ల సంచలన ప్రకటన

Sudarshan V HT Telugu
Published Mar 15, 2025 03:23 PM IST

Pakistan train hijack: పాకిస్తాన్ మొండి పట్టుదల కారణంగా పలువురు సైనికులు సహా మొత్తం 214 మంది బందీలను హతమార్చామని బలూచ్ మిలిటెంట్లు సంచలన ప్రకటన చేశారు. బందీలను విడిచిపెట్టాలంటే తమ సంస్థకు చెందిన యుద్ధ ఖైదీలను విడుదల చేయాలన్న తమ డిమాండ్ ను పాక్ పెడచెవిన పెట్టిందని ఆరోపించారు.

బందీలను చంపేశాం
బందీలను చంపేశాం (AP)

Pakistan train hijack: 214 మంది బందీలను చంపేశామని బలూచిస్తాన్ లో పాకిస్తాన్ రైలు హైజాక్ కు తామే బాధ్యులమని ప్రకటించిన వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇందుకు పాక్ మొండి పట్టుదలే కారణమని ఆరోపించింది. హైజాక్ చేసిన ట్రైన్ నుంచి 214 మందిని తప్పించి, వారిని తమతో పాటు తీసుకువెళ్లి, హతమార్చామని వెల్లడించింది.

సమయం ఇచ్చాం..

పాక్ బలగాలకు తాము 48 గంటల సమయం ఇచ్చామని, దానిని వారు పట్టించుకోలేదని, ఫలితంగా 214 మంది బందీలు మరణించారని బీఎల్ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యానికి 48 గంటల అల్టిమేటం ఇచ్చిందని, తమ సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు పాక్ సైన్యానికి ఇదే చివరి అవకాశమని చెప్పామని పేర్కొన్నారు. ‘‘అయితే పాకిస్తాన్ తన సంప్రదాయ మొండితనాన్ని, సైనిక అహంకారాన్ని ప్రదర్శిస్తూ మా డిమాండ్లను పట్టించుకోలేదు. చర్చలకు దూరంగా ఉండటమే కాకుండా క్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోలేదు. ఈ మొండివైఖరి ఫలితంగానే 214 మంది బందీలను చంపేశాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పాకిస్తాన్ మొండివైఖరి

తాము ఎల్లప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు లోబడే నడుచుకుంటున్నామని, అయితే పాకిస్తాన్ మొండివైఖరి వల్ల తాము కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని వారు అన్నారు. మంగళవారం బీఎల్ఏ ఉగ్రవాదులు రైల్వే ట్రాక్ ను పేల్చివేసి జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేశారు. అందులోని ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. దాంతో, ఆపరేషన్ కమాండో ప్రారంభించి, ఆ బలూచ్ తీవ్రవాదులను హతమార్చామని, బందీలను కాపాడామని పాక్ సైన్యం ప్రకటించింది.

బలూచ్ వాదనకు ఆధారాల్లేవు..

తమ వాదనను బలపరిచే ఆధారాలను బలూచ్ తీవ్రవాదులు వెల్లడించలేదు. మరోవైపు, సైనికులు 33 మంది ఉగ్రవాదులను హతమార్చారని, 354 మంది బందీలను రక్షించారని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు. ఇతర ఏ ఇతర బందీలను బీఎల్ఏ బందీలుగా తీసుకున్నట్లు ఆధారాలు లేవని ఆయన చెప్పారు. బీఎల్ఏ అతిశయోక్తి ఆరోపణలు చేస్తోందని పాక్ అధికారులు ఆరోపించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ దాడిలో 23 మంది సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు సహా మొత్తం 31 మంది మరణించారు. తిరుగుబాటుదారులకు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఇస్తున్నాయని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ఆరోపించారు, ఈ వాదనను రెండు దేశాలు ఖండించాయి.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link