విదేశాల్లో చదువులు వదిలి కూరగాయల బిజినెస్ మొదలు పెట్టిన బ్రదర్స్, రోజుకు రెండు లక్షల సంపాదన

Best Web Hosting Provider In India 2024

విదేశాల్లో చదువులు వదిలి కూరగాయల బిజినెస్ మొదలు పెట్టిన బ్రదర్స్, రోజుకు రెండు లక్షల సంపాదన

Haritha Chappa HT Telugu
Published Mar 16, 2025 05:00 AM IST

ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదువుతూ… వాటిని మధ్యలోనే వదిలి వ్యవసాయం వైపు వచ్చారు. ఏడాదికి ఏడున్నర కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

తమ వ్యవసాయ క్షేత్రంలో ఆయుష్, రిషభ్
తమ వ్యవసాయ క్షేత్రంలో ఆయుష్, రిషభ్ (Instagram)

ఇద్దరు అన్నదమ్ములు

ఒకరు లండన్లో చదువుకుంటుంటే…

మరొకరు దుబాయ్‌లో చదువుతున్నారు

అదే సమయంలో లాక్ డౌన్ పడింది.

ఎలాగోలా ఇంటికి చేరుకున్నారు.

కానీ తిరిగి విదేశాలు వెళ్లకుండా వ్యవసాయంపై దృష్టి పెట్టారు.

16 రకాల కూరగాయలు పండిస్తూ ఇప్పుడు ఏడాదికి ఏడున్నర కోట్లు సంపాదిస్తున్నారు.

ఆ అన్నదమ్ముల పేర్లు ఆయుష్ గుప్తా, రిషభ్ గుప్తా. వీరు ఆగ్రాకు చెందినవారు. వీరి కథ చదివితే ఎంతోమందికి యువతకు స్ఫూర్తివంతంగా ఉంటుంది. బతకాలంటే పెద్ద పెద్ద చదువులు అవసరం లేదని కష్టపడే గుణం ఉంటే చాలని తెలుస్తుంది.

ఆయుష్, రిషభ్ ఇద్దరూ తమ తాత, తల్లిదండ్రులు వ్యవసాయం చేయడాన్ని చూస్తూ పెరిగారు. వారి రక్తంలో కూడా వ్యవసాయంపై ఇష్టం చిన్నప్పటి నుంచే మొదలైంది. వారి తండ్రి పాలీహౌస్ వ్యవసాయం చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ వీరిద్దరికి మాత్రం పాలీహౌస్ వ్యవసాయంపై దృష్టి మళ్లింది. కానీ కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసేందుకు ఒప్పుకోలేదు. ఉన్నత చదువులు చదువుకొని విదేశాలకు వెళ్ళమని ప్రోత్సహించారు. తల్లిదండ్రుల మాట కాదనలేక అన్నదమ్ములు విదేశాలకు వెళ్లారు. కానీ వారి మనసు మాత్రం ఇండియాలో వ్యవసాయం చేయాలనే ఆలోచన దగ్గరే ఆగిపోయింది.

కరోనాతో ఇంటికి చేరారు

కరోనా వల్ల ఎంతోమంది ప్రాణాలు తీసింది. ఆయుష్, రిషబ్ జీవితంలో మాత్రం ఆ కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ టర్నింగ్ పాయింట్ లా మారింది. లాక్ డౌన్ వల్ల ఇద్దరూ ఇండియా చేరుకున్నారు. ఆ తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని వ్యవసాయం చేస్తామని ఇంట్లో వారికి చెప్పారు. వారి తల్లిదండ్రులు అతి కష్టం మీద పిల్లల కోరికను ఒప్పుకున్నారు.

తండ్రి ఎక్కడ కోల్పోయారో అక్కడే తమ అడుగులు వేయడం మొదలుపెట్టారు. తమ తండ్రి పాలీహౌస్ వ్యవసాయం చేయాలని కలల కనడం చూశారు. కానీ అందులో అతను విఫలమయ్యారు. ఇప్పుడు అదే వ్యవసాయంలో వీరు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

పాలీహౌస్ వ్యవసాయం అంటే

ఇది గ్రీన్ హౌస్ వ్యవసాయం. రక్షిత సాగు అని కూడా పిలుస్తారు. లేదా పాలీథిన్, పాలీ కార్బోనేటువంటి పారదర్శక పదార్ధంతో నిర్మించిన పాలీహౌస్ లోపల పంటలను పండిస్తారు. ఆ లోపల వాతావరణం నియంత్రణలో ఉంటుంది. కొంతమేరకు సూర్య రశ్మి చొచ్చుకుపోయేలా ఇవి చేస్తాయి. లోపల కొంత వేడిని బంధిస్తాయి.

2020 చివరి నాటికి ఇద్దరు తమ పొలం ఏర్పాటును ప్రారంభించారు. పాలీహౌస్ నిర్మించడానికి ప్రభుత్వం నుంచి 40 శాతం వరకు సబ్సిడీ కూడా వచ్చింది. మొదట దోసకాయలు పండించారు. నాలుగు నెలల్లోనే తొలి సాగు చేతికి వచ్చింది. దీంతో వారిపై వారికి నమ్మకం పెరిగింది.

సేంద్రీయ పద్ధతిలో

ఆ తర్వాత ఒక్కొక్కటిగా మిగతా కూరగాయలను కూడా ప్రయోగాత్మకంగా పండించడం మొదలుపెట్టారు. వారు వేసిన ప్రతి పంట చక్కగా పండి చేతికి రావడం మొదలుపెట్టింది. అలా వాటిని అమ్ముతూ సాగును పెంచసాగారు. అన్ని రకాల కూరగాయలను ఇందులో వేస్తారు. దోసకాయ, టమాటాలు, బంగాళదుంపలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల కూరగాయలు వారి ఎకరం పాలీహౌస్ లో పెరుగుతాయి.

పుట్టగొడుగుల పెంపకం

మరో రెండు ఎకరాల్లో పుట్టగొడుగులను పెంచడం మొదలుపెట్టారు. పుట్టగొడుగుల సాగును 2022లో మొదలుపెట్టారు. పుట్టగొడుగులు పెంచడం మొదలుపెట్టాకే వారికి లాభాలు మరింతగా రావడం మొదలయ్యాయి.

ప్రస్తుతం నెలకు దాదాపు 40 టన్నుల పుట్టగొడుగులను వీరు అమ్ముతున్నారు. వాటిని ఆగ్,రా ఢిల్లీలోని అనేక వ్యాపారులకు సరఫరా చేస్తారు. పుట్టగొడుగులతో పాటు 16 రకాల కూరగాయలను కూడా సేంద్రియ పద్ధతిలో పండించి అమ్మడం మొదలుపెట్టారు. దీంతో వారికి అధిక ధరతో కూరగాయలు, పుట్టగొడుగులు అమ్ముడుపోవడం మొదలుపెట్టాయి. అలా ఈ సోదరులు ఇద్దరూ కలిసి ప్రస్తుతం రోజుకు రెండు లక్షలు సంపాదిస్తున్నారు. అలా ఏడాదికి ఏడున్నర కోట్ రూపాయల టర్నోవర్ ను సాధించారు. విదేశాల్లో ఉన్నా కూడా వీరు ఇంత విజయాన్ని సాధించలేకపోయావారేమో.

ఇప్పుడు ఈ సోదరుల తల్లిదండ్రులు వీరిని చూసి ఎంతో సంతోషిస్తున్నారు. తాను ఎక్కడ ఆగిపోయానో తన కొడుకులు అక్కడే మొదలుపెట్టి విజయాన్ని అందుకోవడం ఆ తండ్రికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడాలని ఎంతోమంది కోరుకుంటారు. తిరిగి స్వదేశానికి రావడం చిన్నతనంగా భావిస్తారు. కానీ ఈ ఇద్దరు అన్నదమ్ముల ఆలోచన వేరు. ఉన్న ఊర్లోనే విజయం సాధించాలన్నది వీరి లక్ష్యం. అది పాతికేళ్ల వయసులోనే వీరిద్దరూ దాన్ని సాధించారు. పాలీ హౌస్ వ్యవసాయం 2020లో మొదలుపెట్టే నాటికి అన్నయ్య ఆయుష్ వయసు 22 ఏళ్లు కాగా, రిషభ్ వయసు 20 ఏళ్లే.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024