





Best Web Hosting Provider In India 2024

Monday Motivation: ఏడుసార్లు కిందపడినా ఎనిమిదో సారి లేచి నిలబడండి, ఓటమి తర్వాత గెలుపు కచ్చితంగా ఉంటుంది
Monday Motivation: జపాన్ లో బాగా చెప్పుకునే సామెత ‘నానా కరోబి, యా ఓకి ’ అంటే ‘ఏడు సార్లు పడండి ఎనిమిదో సారి నిలబడండి’ అని. ఓటమి ఎదురైనా పట్టు విడవొద్దని, ఆశ వదులుకోవద్దని చెప్పడమే దీని ఉద్దేశం.

జపాన్లో స్ఫూర్తివంతమైన వాక్యాలలో ఎక్కువగా ‘నానా కరోబి, యా ఓకి ’ అని చెప్పుకుంటారు. నువ్వు ఏడుసార్లు పడినా పర్లేదు, ఎనిమిదో సారి కచ్చితంగా నిలబడు అని అంటారు. అంటే ఎన్ని సార్లు ఓటమి ఎదురైనా తలవంచక ప్రయత్నించమని అర్థం. ఆశను వదులుకోకుండా ప్రయత్నం చేయడం వల్ల ఓటమి వెనకే ఏదో రోజు విజయం కూడా వస్తుంది.
పూచిక పుల్లలా తీసి పడేసినా
నీకు ఓటమి ఎదురైన ప్రతిసారి ఈ ప్రపంచం నీకు కనీసం విలువ ఇవ్వదు, పూచిక పుల్లలా చూడవచ్చు. నిన్ను మనిషిగా లెక్కించకపోవచ్చు. పడిన ప్రతిసారి పకపకా నవ్వచ్చు. వీడు ఎందుకు పనికిరాడు అనవచ్చు. అయినా మిమ్మల్ని మీరే సమర్థించుకోవాలి. మీకు మీరే స్ఫూర్తినిచ్చుకోవాలి. అతి కష్టం మీద మీరే లేవాలి. మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. నిలదొక్కుకోవాలి. అందరూ ఆశ్చర్య పోయేలా, ప్రపంచం దిమ్మతిరిగేలా గెలిచి చూపించాలి. అప్పుడే మీరు నిజమైన విజేత. ఏడుసార్లు పడినప్పుడు పకపక నవ్వినోళ్లే ఎనిమిదో సారి మిమ్మల్ని విజేతగా పొగుడుతాయి. ఆ పరిస్థితి మీకు మీరే కల్పించుకోవాలి.
మీరు ఓడితే ఎవరో నవ్వారని తెగ బాధపడుతూ కుంగిపోతే మీరు కనీసం కుర్చీలోంచి కూడా లేచి నిలబడలేరు. మీ శరీరం, మనసు అంత నీరసంగా మారిపోతాయి. అదే ఓటమినే మెట్లుగా మార్చుకుంటే ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఒక్కో ఓటమిలో ఒక్కో అనుభవాన్ని మూటగట్టుకుంటూ ఒక్కో తప్పును తెలుసుకుంటూ వెళతారు. వాటిని సరిదిద్దుకుంటూ వెళితే ఎనిమిదో సారి కచ్చితంగా మీరు విజేతగా నిలుస్తారు.
ఈ ప్రపంచంలో ప్రతి అద్భుతమైన ఆవిష్కరణ వెనక ఎన్నో ఓటమిలు ఉన్నాయి. ఆ శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు పరాజయం పాలయ్యారు. అయినా సరే ఆ ఓటమితోనే ప్రయాణం చేసి తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. చివరికి అద్భుతమైన ఆవిష్కరణలకు నాంది పలికారు. వారు మొదటి ఓటమితోనే వదిలేసి ఉంటే మన చుట్టూ ఇన్ని అద్భుతమైన వస్తువులు ఉండేవి కాదేమో. మీరు వాడే పెన్ను దగ్గర నుంచి విమానాల వరకు అన్ని ఆవిష్కరణల వెనుక ఎంతోమంది కృషి ఉంది. ఆ కృషిలో మొదట ఎదురైనది ఓటమే.
అంతెందుకు ఒక్క మందు తయారు చేయడానికి ఏళ్ల సమయం పడుతుంది. ఆరోగ్య శాస్త్రవేత్తలకు మొదటి రోజే మొదటి ప్రయత్నంలోనే విజయం దక్కదు. ఎన్నో ప్రయత్నాల తర్వాతే ప్రయోగంలో కొంత సఫలత కనిపిస్తుంది. అలా ట్రయల్స్ చేస్తూ చేస్తూ చివరికి ఒక అద్భుతమైన వ్యాక్సిన్ లేదా మందులను తయారు చేస్తారు. అందుకోసం వారు కొన్ని ఏళ్లపాటు వైఫల్యాలను అనుభవిస్తూనే ఉంటారు. మొదటి వైఫల్యానికి శాస్త్రవేత్తలంతా మూల కూర్చుంటే మనకి రోగాల నుండి రక్షణ దొరికేది కాదు. ఎన్నో రోగాలకు వ్యాక్సిన్లు ఉండేవి కాదు.
చెడ్డ ప్రపంచం
ప్రపంచం అంతా సూర్య కాంతితో ఇంద్రధనస్సు రంగులతో అందంగా ఉండదు. నీచమైన, దుష్ట మనుషులు అనుభవాలు ఎన్నో ఎదురవుతాయి. అవి ఎంత కఠినంగా ఉన్నా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ రావాలి. మీ అనుమతి లేనిదే అవి మిమ్మల్ని కిందకు లాగలేవు. మీరు ఎప్పుడైతే మానసికంగా, శారీరకంగా నీరసించిపోతారో. అప్పుడు అవి మిమ్మల్ని మోకాళ్ళపై కూర్చోబెడతాయి. మీరు ఆ అవకాశం ఇవ్వకుండా జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతున్నా కూడా నిలబడేందుకు ప్రయత్నించండి. ధైర్యంగా ముందుకే సాగండి. మీరు ఎప్పటికైనా విజేతగా నిలుస్తారు.
విజేతగా నిలవాలి అనుకున్న వ్యక్తి ఎదురు దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉండాలి. ఏం జరిగినా విజయం సాధించేవరకు ప్రయాణం ఆపకూడదు.
సంబంధిత కథనం