Best Web Hosting Provider In India 2024

Guntur Crime: గుంటూరు జిల్లాలో ఘోరం… ఇన్‌స్టా గ్రామ్ ప్రేమ.. ఆపై పెళ్లి..గుంటూరులో వరంగల్ అమ్మాయి అనుమానాస్పద మృతి
Guntur Crime: గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రాంలో యువతని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. గంజాయికి బానిసై ఆరు నెలలు తిరగకుండానే కట్నం కోసం చిత్ర హింసలు పెట్టడంతో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
Guntur Crime: తెలంగాణకు చెందిన యువతితో గుంటూరుకు చెందిన యువకుడికి ఇన్‌స్టాలో పరిచయం, ప్రేమ పెళ్లికి దారి తీసింది. యువతి అదృశ్యంపై పోలీస్ కేసు నమోదు అయ్యాక యువతి అచూకీ కోసం గాలిస్తే గుంటూరు యువకుడితో ప్రేమ పెళ్లి వెలుగు చూసింది. కూతురు సంతోషం కోసం దానిని ఒప్పుకున్న కన్నవారికి చివరికి కన్నీళ్లు తప్పలేదు.
గుంటూరులోని ద్వారకానగర్ ఏడో లైన్లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన గీతిక (19)కు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ చేయటం అలవాటు. అందులో భాగంగానే గీతిక ఎప్పటికప్పుడు రీల్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసేది.
ఇన్‌స్టా గ్రామ్‌లో యువతికి వలేసి..
గుంటూరు జిల్లా ద్వారకానగర్ ఏడో లైన్‌కు చెందిన సాయి మణికంఠ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. సాయి మణికంఠ ఇన్‌స్టాగ్రాంలో వరంగల్‌కు చెందిన గీతికను ఫాలో అయ్యాడు. ఆ రకంగా ఆమె రీల్స్ చూస్తూ పరిచయం చేసుకున్నాడు.
అలా పరిచయం ప్రేమగా మారింది. మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. సాయిమణికంఠ మాటలు నమ్మి గీతిక, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చేసింది. గీతిక అదృశ్యం కావడంతోపై అప్పట్లో ఆమె తల్లిదండ్రులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2024 సెప్టెంబర్ 17న గుంటూరులో సాయిమణికంఠను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి గీతిక అత్తవారింటిలోనే ఉంటోంది. పెళ్లి తరువాత కొంతకాలం వైవాహిక జీవితం బాగానే సాగింది. సాయిమణికంఠ బాధ్యతాయుతంగా వ్యవహరించేటట్లు నటించేవాడు. కాని కొంతకాలానికే సాయి నిజస్వరూపం గీతికకు తెలిసింది.
మద్యానికి బానిసై వేధింపులు..
గంజాయి, మద్యానికి బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. కట్నం కోసం నిరంతరం చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 14 (శుక్రవారం) గీతిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త వేధింపులను గురించి చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయింది. ఇంటికి వచ్చేస్తానని వాపోయింది.
అదే రోజు రాత్రి నుంచే గీతిక మొబైల్ ఫోన్ పని చేయటం లేదు. ఈనెల 15 (శనివారం) సాయిమణికంఠ, గీతిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. స్థానికంగా కూడా ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ప్రచారం చేశాడు. దీంతో గీతిక కుటుంబ సభ్యులు, బంధువులు గుంటూరు చేరుకున్నారు.
తన కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్య అని, హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరిస్తున్నారని ఆందోళన చేపట్టారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ కుమార్తెను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని ఆరునెలలకే హతమార్చాడని గీతిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
యువతి తల్లిదండ్రుల ఆందోళన..
సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం పరిశీలించిన తరువాత మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గుంటూరు దక్షిణ డీఎస్పీ భానోదయ, గుంటూరు పశ్చిమ తాహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎస్ఐ నాగరాజు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు వరంగల్‌కు తరలించారు. మృతురాలి తండ్రి జగదీశ్వరచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్నం, హత్య కేసులను నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం భార్యను భర్తే హత్య చేసినట్లు వెల్లడి అయింది. అయితే భర్త సాయిమణికంఠ మాత్రం ఆత్మహత్యగా చిత్రీకరించాడు. దీనిపై డీఎస్పీ భానోదయ మాట్లాడుతూ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోందని అన్నారు. దర్యాప్తు పూర్తి అయిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.