





Best Web Hosting Provider In India 2024

జనరిక్ మందులకు బ్రాండెడ్ మందులకు తేడా ఏమిటి? జనరిక్ మెడిసిన్ అంత తక్కువ ధరకు ఎందుకు లభిస్తుంది?
జనరిక్ మందుల షాపులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిల్లో కొనే వారి సంఖ్య తక్కువ. సాధారణంగా బ్రాండెడ్ మందులు ఎక్కువగా వాడతారు. ఇంతకీ జనరిక్ మందులు అంటే ఏంటో మీకు తెలుసా?

ఒక వైద్యుడు జనరిక్ మందులను వాడమని ప్రజలకు సూచించడం ప్రారంభిస్తే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరోగ్య ఖర్చును 70 శాతం వరకు తగ్గించవచ్చు. ఇది మేము చెబుతున్నది కాదు… ఎన్నో సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. ఎందుకంటే మన దేశంలో జనరిక్ మందుల వినియోగ శాతం కేవలం 10 నుంచి 12 శాతమే ఉంది. వైద్యులే వీటిని సూచించేందుకు ముందుకు రావడం లేదు.
బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. బ్రాండెడ్ మందులు ధర 100 రూపాయలు ఉంటే జనరిక్ మందులు ధర కేవలం పది రూపాయలు ఉంటుంది. జనరిక్ మందులు పేద ప్రజలకు వరం లాంటివి.
బ్రాండెడ్ మందులు అంటే
ఒక టాబ్లెట్‌ను లేదా సిరప్‌ను కనిపెట్టడానికి ఎన్నో ఫార్మా కంపెనీలు పరిశోధనలు చేస్తాయి. కొన్ని ఏళ్లపాటు ట్రయల్స్ నిర్వహిస్తాయి. ఆ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే వాటిని ఒక ధర నిర్ణయించి మార్కెట్లోకి విడుదల చేస్తాయి. ఆ ఫార్మా కంపెనీ పేరు మీదే ఈ మందుల అమ్మకాలు జరుగుతాయి. అంటే ఆ ఫార్మా కంపెనీ అనేది ఒక బ్రాండ్. ఆ ఫార్మా కంపెనీ నుంచి వచ్చేవన్నీ బ్రాండెడ్ మందులు. ఆ ఫార్మా కంపెనీకి ఆ మందు పై దాదాపు 20 ఏళ్ల పాటు పేటెంట్ హక్కు ఉంటుంది. ఆ మందు తయారు చేసిన ఫార్ములాను ఆ ఫార్మా కంపెనీ ఎవరికీ చెప్పదు. పైగా తయారు చేసే అనుమతి కూడా ఉండదు. ఎందుకంటే ఆ మందు తయారీకి తమ ఎంతో ఖర్చు పెట్టామని… ఆ ఖర్చులు మొత్తం రాబట్టుకొంటామని, అందుకు తానే ఆ మందును అమ్ముతామని ఆ ఫార్మా కంపెనీ భావన. అదే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ఆ ఫార్మా కంపెనీకి పేటెంట్ హక్కును ఇస్తాయి.
జనరిక్ మందులు అంటే
ఫార్మా కంపెనీలో తయారుచేసిన మందులు 20 ఏళ్ల తర్వాత పేటెంట్ హక్కును కోల్పోతాయి. అంటే ఆ మందును అదే ఫార్ములాతో ఎవరైనా తయారు చేయవచ్చు. వాటికి ఎలాంటి బ్రాండ్ ఉండదు. సాధారణ ఫార్మా సంస్థలు కూడా అదే ఫార్ములాతో మందులు తక్కువ రేటుకే తయారు చేస్తాయి. ఆ మందులే జనరిక్ మందులు. ఇవి బ్రాండెడ్ మందుల్లాగే పనిచేస్తాయి. కాకపోతే వీటి ధర తక్కువగా ఉంటుంది. వీటిని కేవలం జనరిక్ మందుల షాపుల్లో మాత్రమే అమ్ముతారు.
జనరిక్ మందులు అద్భుతంగా పనిచేస్తాయి
చాలామంది బ్రాండెడ్ మందులు వాడితేనే రోగాలు తగ్గుతాయని అనుకుంటారు. నిజానికి జనరిక్ మందులు వాడినా కూడా రోగాలు తగ్గుతాయి. ఎందుకంటే ఈ రెండు మందులు కూడా ఒకే ఫార్ములాతో తయారుచేస్తారు. అయితే ఫార్మా సంస్థలు ఎక్కువ ఖర్చు పెట్టి వైద్యులకు, ఆసుపత్రులకు తగిన పారితోషికాలు ఇస్తూ తమ మందులను సూచించమని కోరుతారు. అందుకే వైద్యులు, ఆసుపత్రుల్లో కూడా బ్రాండెడ్ మందులే లభిస్తూ ఉంటాయి. జనరిక్ మందులు కావాలంటే జనరిక్ మందుల షాపులు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుని వెళ్లి కొనాలి. బ్రాండెడ్ లో మీరు పది రూపాయలకు కొన్ని ఒక టాబ్లెట్ జనరిక్ లో కేవలం రూపాయికే వస్తుంది. అంటే ఎంతగా బ్రాండెడ్ మందులు ధర ఎక్కువో అర్థం చేసుకోండి. కాబట్టి జనరిక్ మందుల షాపుల్లో మెడిసిన్ పనిచేయదనే అపోహను వదలండి. తక్కువ ఖర్చుతో జనరిక్ మందులు వాడుతూ రోగాలను తగ్గించుకోండి.
జనరిక్ మందుల షాపులు ఎక్కడపడితే అక్కడ ఉండవు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో కొంతమంది మాత్రమే జనరిక్ మందులు షాపులను ఏర్పాటు చేస్తున్నారు. అవి ఎక్కడున్నాయో తెలుసుకుని వెళ్లి కొనుక్కుంటే మీకు అది తక్కువ ధరకే ఆరోగ్యం తగ్గుతుంది.
సంబంధిత కథనం
టాపిక్