SC Categorization: ఏపీలో రాష్ట్రం యూనిట్‌గానే ఎస్సీ వర్గీకరణ అమలు, 2026 తర్వాత జిల్లా యూనిట్‌ చేసే ఛాన్స్‌!

Best Web Hosting Provider In India 2024

SC Categorization: ఏపీలో రాష్ట్రం యూనిట్‌గానే ఎస్సీ వర్గీకరణ అమలు, 2026 తర్వాత జిల్లా యూనిట్‌ చేసే ఛాన్స్‌!

 

SC Categorization: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తాన్ని యూనిట్‌గా అమలు చేయాలని ఏపీ క్యాబినెట్‌ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై మాదిగ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణకు అమోదం లభించడంతో త్వరలో డిఎస్సీ వెలువడనుంది.

 
ఏపీలో ఎస్సీ వర్గీకరణ నివేదికకు క్యాబినెట్ అమోదం
 

SC Categorization: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్‌ నివేదికకు ఏపీ క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం మొత్తం యూనిట్‌గా రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.

 

తాజా నిర్ణయం ప్రకారం ఏపీలో ఏ, బీ, సీ కేటగిరీలుగా రిజర్వేషన్ అమలు చేస్తారు. ఏ క్యాటగిరీలో రెల్లి, ఉపకులాలకు 1%, మాల, ఉపకులాలకు 7.5 శాతం, మాదిగ, ఉపకులాలకు 6.5%. రిజర్వేషన్లకు మంత్రుల సంఘం సిఫారసుల్ని క్యాబినెట్ అమోదం తెలిపింది. క్యాబినెట్‌ నిర్ణయంపై మార్చి 20న అసెంబ్లీలో చర్చించి ఆ తీర్మానాన్నిజాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపుతారు.

2011 లెక్కల ప్రకారమే…

ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని భావించినా 2021 జనాభా లెక్కలు జరగక పోవడంతో 2011 జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ చేపడతారు. తాజా అంచనాలు లేకుండా జిల్లా యూనిట్‌ అమలు చేయడంపై అభ్యంతరాల నేపథ్యంలో రాష్ట్రం మొత్తాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

2026 తర్వాత జిల్లా యూనిట్‌కు అవకాశం..

ఏపీలో కొత్త జిల్లాల్లో ఎస్సీల జనాభాపై కచ్చితమైన సమాచారం లేనందున రాష్ట్రం యూనిట్ గా అమలు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్‌ అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తారు. ఏ- కేటగిరీలో రెల్లి, ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్.. బీ కేటగిరీలో మాదిగ, ఉపకులాలకు 6.5 శాతం.. సీ కేట గిరీలో మాల, ఉపకులాలకు 7.5 శాతం రిజ ర్వేషను ప్రతిపాదిస్తూ రాజీవ్ రంజన్ మిశ్ర నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభు త్వానికి ప్రతిపాదించింది.

 

త్వరలో మెగా డిఎస్సీ…

ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధుల కేటాయింపులో జాప్యం, తదితర అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత రాష్ట్రం యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏక సభ్య కమిషన్ నివేదికపై ఈ నెల 20న అసెంబ్లీలో చర్చించను న్నారు. బేడ, బుడగ జంగాలను రెల్లి కేటగిరీ కింద చేర్చే అంశంపై కూడా అసెంబ్లీలో చర్చి స్తారు.

జిల్లా యూనిట్‌ చేయాలని డిమాండ్..

ఏపీలో ఎస్సీ వర్గీకరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మాల ఉపకులాలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. జిల్లా యూనిట్‌ అమలు చేయాలని కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సూచించారు. రాజీవ్‌రంజన్‌ మిశ్రా నివేదిక, ఆ నివేదికపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికలపై కేబినెట్‌‌లో చర్చించారు.

గత ఏడాది నవంబరు 15న ఏకసభ్య కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం 2 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్‌ సభ్యుడు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా రాష్ట్రంలోని ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. 13 ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ సంఘాలు, మేధావులు, ఉద్యోగుల నుంచి వినతులు తీసుకున్నారు. ఎస్సీల్లోని అన్ని ఉపకులాల నేతలు, ఉద్యోగ సంఘాలతో చర్చించారు. కొన్నిచోట్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు వినతిపత్రాలు అందించారు.

 

గత ఏడాది నవంబరు 7న సచివాలయంలో 23 మంది కూటమి దళిత ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతోపాటు ఎన్నికల హామీపై కూడా వారితో చర్చించారు. జనాభా దామాషా పద్ధతిలో జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ అమలు చేస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు.

కమిషన్‌ నివేదికపై అభ్యంతరాలు..

ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌.. వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా చేపట్టిన ఎస్సీ జనాభా గణనను ప్రాతిపదికగా చేసుకుంది. ఆ సర్వే సమగ్రంగా జరగలేదని ఫిర్యాదులు వచ్చాయి. సర్వేను తిరిగి చేపట్టాలని ఎస్సీ మాల వర్గం డిమాండ్ చేస్తోంది.

కొత్తగా పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ల పరిమితిని పెంచడం, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల సర్వేను పరిగణనలోకి తీసుకోకుండా సమగ్రంగా సర్వే చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో కాకుండా కమిషన్‌ ఉమ్మడి 13 జిల్లాల్లోనే పర్యటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024