




Best Web Hosting Provider In India 2024

Mohanlal: క్షమాపణలు చెప్పిన మోహన్‌లాల్.. సినిమాకు 17 కట్స్.. ఏంటీ వివాదం!
L2 Empuraan – Mohanlal: ఎల్2: ఎంపురాన్ సినిమాపై విమర్శలు తీవ్రమవుతుండటంతో మోహన్‌లాల్ స్పందించారు. క్షమాపణలు చెప్పారు. అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సీన్లను కట్ చేస్తున్నట్టు తెలిపారు.

ఎల్2: ఎంపురాన్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. మలయాళ సీనియర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత వారం మార్చి 27న విడుదలైంది. లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ వచ్చింది. పృథ్విరాజ్ కూడా ఓ లీడ్ రోల్ చేశారు. అయితే, ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ఎంపురాన్పై వివాదం రేగింది. తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో మోహన్‌లాల్ నేడు (మార్చి 30) స్పందించారు. అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఏమైందంటే..
వివాదం ఇదే!
ఎల్2: ఎంపురాన్ మూవీలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సీన్లు ఉన్నాయి. ఈ అల్లర్లలో తప్పు ఒకే వర్గానిది అన్నట్టుగా మేకర్స్ చూపించారు. మతాన్ని ఉపయోగించుకొని రాజకీయాల్లో ఎదిగారనేలా ఈ మూవీలో విలన్ పాత్రను డైరెక్టర్ చూపించారు. ఈ అంశాలపై కొన్ని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ దుష్ప్రచారం కోసం ఈ సినిమా తీశారా అంటూ విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. సమాజంలో సామరస్యానికి భంగం కలిగేలా ఈ చిత్రం ఉందంటూ కొందరు ఆగ్రహించారు. ఈ వివాదం క్రమంగా తీవ్రమైంది.
క్షమాపణలు చెబుతూ..
ఎల్2: ఎంపురాన్ చిత్రంపై విమర్శలు వస్తుండటంతో మోహన్‌లాల్ స్పందించారు. ఈ చిత్రం ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమాణపలు అంటూ నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాంటి విషయాలను ఈ చిత్రం నుంచి తొలగిస్తామని తెలిపారు.
రాజకీయ అంశాలకు, ఏ సిద్ధాంతానికి, ఏ మతానికి వ్యతిరేకంగా సినిమాలో విషయాలు ఉండకకుండా చూసుకోవాల్సిన బాధ్యత నటుడిగా తనదేనని మోహన్‌లాల్ తెలిపారు. “లూసిఫర్ ఫ్రాంచైజీలో రెండో పార్టుగా వచ్చిన ఎంపురాన్ చిత్రం రూపకల్పనలో కొన్ని రాజకీయ, సామాజిక అంశాలు ఉన్నాయని నాకు తెలుసు. వీటివల్ల నేను ప్రేమించే చాలా మందికి బాధ కలిగింది” అని మోహన్‌లాల్ పేర్కొన్నారు.
“ఏ రాజకీయ కార్యక్రమాలకు, సిద్ధాంతాలకు, మతాలకు వ్యతిరేకంగా నా సినిమా ఉండకూడదని చూసుకోవాల్సిన బాధ్యత నటుడిగా నాదే. అందుకే నాకు ఇష్టమైన వారికి కలిగిన బాధ పట్ల నేను, ఎంపురాన్ టీమ్ క్షమాపణలు చెబుతున్నాం. ఈ చిత్రంలో పని చేసి అందరిపై ఈ బాధ్యత ఉందని గుర్తించాం. అలాంటి అంశాలను ఈ చిత్రం నుంచి తొలగించాలని నిర్ణయించాం” అని మోహన్‌లాల్ పోస్ట్ చేశారు. “మీ ప్రేమ, నమ్మకమే నాకు బలాలు. వాటి కంటే మోహన్‌లాల్ గొప్ప కాదని నేను అనుకుంటా” అని రాసుకొచ్చారు.
17 కట్స్!
ఎంపురాన్ చిత్రంలో ఉన్న గుజరాత్ అల్లర్ల సీన్లలో 17 కట్స్ చేసేందుకు మూవీ టీమ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో విలన్ పేరును కూడా మార్చాలని నిర్ణయించారు. ఎడి్ చేసిన ఈ వెర్షన్ మరో రెండు రోజుల్లోనే థియేటర్లలో ప్రదర్శితం కానుందని తెలుస్తోంది.
ఎల్2: ఎంపురాన్ సినిమా రెండు రోజుల్లోనే రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటింది. అత్యంత వేగంగా ఆ మార్క్ దాటిన మలయాళ మూవీగా రికార్డు సృష్టించింది. అయితే, మిక్స్డ్ టాక్ రావటంతో వసూళ్లలో డ్రాప్ కనిపించింది. మలయాళం ఇండస్ట్రీ నుంచి అత్యంత ఖరీదైన చిత్రంగా ఎంపురాన్ వచ్చింది.
సంబంధిత కథనం