




Best Web Hosting Provider In India 2024

Bad Sleeping Time: ఈ టైంలో నిద్రపోయే వారిలో డిప్రెషన్ రిస్క్ డబుల్ అవుతుందట!
Bad Sleeping Time: సరైన టైం తెలియక నిద్రపోవడం వల్ల ప్రతి ఐదుగురిలో ఒకరు డిప్రెషన్‌కు గురవుతున్నారట. నిద్ర ఆరోగ్యానికి మంచిదే కానీ, కొన్ని ప్రత్యేక సమయాల్లో అది ప్రమాదకరంగా మారుతుందట. నిద్రపోకూడని సమయాలేంటో తెలుసుకుందామా..?

మనలో చాలా మందికి నిద్ర సమస్యలుంటాయి. నిద్ర పట్టడం అదృష్టంగా ఫీలయ్యేవారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. అయితే ఎంతో మందికి ఒత్తిడి, ఆలోచనలు, పీడకలలు, కెఫైన్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ప్రస్తుత జీవన శైలి కారణంగా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు చాలా మందిలో కామన్‌గా మారిపోయి ఉండొచ్చు. కానీ, ఇది మానసిక ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాలు చూపిస్తుందట. ప్రత్యేకించి నిద్ర మధ్యలో మెలకువ వచ్చిన తర్వాత మరోసారి నిద్రపట్టక ఇబ్బందిపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని యూకేలోని సర్రే యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో తేలింది.
పరిశోధనల ప్రకారం..
17 నుంచి 28 మధ్య 646 మంది విద్యార్థులపై ఈ రీసెర్చ్ జరిపారు. వారి ఆరోగ్యం, అలవాట్లు, వ్యక్తిగత విషయాలు, డిప్రెషన్ లక్షణాలు, నిద్రపోవడానికి పట్టే సమయాలను నమోదు చేసుకున్నారు.
నిద్రపట్టే వేగం కూడా ముఖ్యమే..
కొందరు శరీరతత్వాన్ని బట్టి నిద్రపోయినట్లు అర్థమవుతుంది. దానిని బట్టే నిద్రపోయే వేగం, నిద్రలేచే వేగం కూడా ఆధారపడి ఉంటాయట. వాటి అనుగుణంగా చూస్తే.. కొందరు అలా మంచం మీద వాలారో లేదో ఇలా నిద్రలోకి జారుకుంటారు. ఉదయాన్నే త్వరగా మేలుకుంటారు. మరికొందరు కాస్త ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే కాస్త ఆలస్యంగా అంటే 6 నుంచి 7 గంటల లోపు లేచిపోతారు. మరి కొందరు కొన్ని గంటలు పాటు కష్టపడితేనే గానీ, నిద్రపోలేరు. ఉదయాన్నే త్వరగా లేవలేరు. ఈ సర్వేలో తేలిన దాని ప్రకారం, 15 నుంచి 25 శాతం మంది త్వరగా పడుకుని ఉదయాన్నే త్వరగా లేచేవారు ఉంటే, 50 నుంచి 60 శాతం మంది కాస్త ఆలస్యంగా నిద్రపోయి, కొద్దిగా లేటుగా లేచే అలవాటున్న వారున్నారు. మిగిలిన 10 నుంచి 20 శాతం మంది మాత్రం గంటల పాటు కష్టపడి అర్థరాత్రి దాటాక నిద్రపోయి.. ఉదయం లేటుగా లేచే వాళ్లున్నారు.
నిద్రా సమయాన్ని బట్టి డిప్రెషన్ లెవల్ మారుతుందా?
ఈ స్టడీలో ఉదయాన్నే లేచే వాళ్లు, లేదా కాస్త ఆలస్యంగా లేచే వాళ్లలో ఒత్తిడి స్థాయిలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయట. రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రించే వారిలోనే డిప్రెషన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తెలిందట. ఇలా ఆలస్యంగా అర్థ రాత్రి వరకూ నిద్రపోలేని వారు.. పనిమీద ఎక్కువగా ధ్యాస ఉంచలేరట. ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉంచుకోలేరట, ఆల్కహాల్ కూడా తెగ తాగేస్తారట. మొత్తం మీద వీరు డిప్రెషర్ లోకి త్వరగా వెళతారని స్టడీలు చెబుతున్నాయి. కాబట్టి, నిద్రా సమయం అనేది డిప్రెషన్ రిస్క్‌ను పెంచుతుందని స్పష్టమైంది. అంతేకాకుండా ఆలస్యంగా నిద్రించేవారిలో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా ఉంటుందట.
ఏ సమయంలో పడుకుంటే డిప్రెషన్ డబుల్ అవుతుందంటే..?
నిద్రపోయే సమయం రాత్రి 12 గంటల నుంచి 2గంటల మధ్యలో ఉంటే వారు డిప్రెషన్ కు ఎక్కువగా గురవుతారు. వారి కంటే తక్కువగా రాత్రి 10 నుంచి 11గంటల మధ్యలో నిద్రించేవారిలో డిప్రెషన్ కాస్త తక్కువ ఉంటుంది. అంతకంటే ముందే నిద్రించి, ఉదయం 6 నుంచి 7గంటల మధ్యలోనే నిద్రలేచే వారిలో డిప్రెషన్ చాలా చాలా తక్కువగా ఉంటుందట.
ఆలస్యంగా నిద్రపోతే డిప్రెషన్, అల్జీమర్స్ వస్తాయా?
వాస్తవానికి ఆలస్యంగా నిద్రించే వారిలో నిద్రలో క్వాలిటీ, ఏ విషయంపైనా ఫోకస్ లేకపోవడం, ఎమోషన్స్ సరిగా బయటపెట్టలేకపోవడం, మద్యం తీసుకోవడం వంటివి ఉంటాయట. వీటి వల్లనే వారిలో అల్జీమర్స్, డిప్రెషన్ జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఇక లేటెందుకు, మీ నిద్రా సమయాన్ని ఇప్పుడే మార్చుకోండి. జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం