


Best Web Hosting Provider In India 2024
Bhadrachalam QR Code : భద్రాచలం వెళ్తున్నారా.. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు!
Bhadrachalam QR Code : దక్షిణ అయోధ్య భద్రాచలం.. సీతారాముల కల్యాణానికి ముస్తాబైంది. ఈ వేడుకను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. వేరే ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ వినూత్నంగా ఆలోచించింది.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ముస్తాబైంది. ఈ నెల 6, 7వ తేదీల్లో శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం జరగనుంది. వీటిని తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు భద్రాచలం వస్తున్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా పోలీసు, సమాచార శాఖ ఆధ్వర్యంలో ఓ క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు.
సౌకర్యాలన్నీ తెలుసుకోవచ్చు..
ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. భద్రాచలంలో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు అన్ని తెలుసుకోవచ్చు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన దర్శనం, వసతి, ప్రసాదాల కౌంటర్లు, తలంబ్రాల కౌంటర్లు, వాష్ రూమ్స్, ఉచిత వైద్య శిబిరం.. ఇలా అన్ని విషయాలు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తెలుస్తాయి. భక్తులు ఇబ్బందులు పడకుండా ఈ క్యూఆర్ కోడ్‌ను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
జగత్ కల్యాణం..
భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కల్యాణాన్ని ‘జగత్ కల్యాణం’గా అభివర్ణిస్తారు. ఈ వేడుకలో ఉపయోగించే ‘కోటి గోటి తలంబ్రాల’కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ తలంబ్రాల కోసం ఉపయోగించే బియ్యాన్ని గోటితో ఒలిచి తయారుచేస్తారు, దీనికి దాదాపు మూడు నెలల సమయం పడుతుంది.
చీరాల భక్తులు..
బాపట్ల జిల్లాలోని చీరాల ప్రాంత భక్తులు ఈ తలంబ్రాలను తయారుచేస్తారు. పసుపు, ముత్యాలు, ధాన్యం కలగలిపిన ఈ తలంబ్రాలు శుభానికి, స్వచ్ఛమైన మనస్సుకు, ధనధాన్యాలకు ప్రతీకగా భావిస్తారు. గోటి తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యం అని భక్తులు విశ్వసిస్తారు. ఈ కల్యాణోత్సవం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయంకు ప్రతి సంవత్సరం పంపిస్తారు.
స్పెషల్ సర్వీసులు..
భక్తుల సౌకర్యార్థం, ఈ తలంబ్రాలను ఆన్‌లైన్ ద్వారా కూడా పొందవచ్చు. అందుకు ఆలయ అధికారులు, పోస్టల్ శాఖ, ఆర్టీసీ సమన్వయంతో పనిచేస్తున్నాయి. రూ.60 చెల్లించి ముత్యాల తలంబ్రాలను పొందవచ్చు. అటు భద్రాచలం వెళ్లే భక్తుల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి స్పెషల్ ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ నుంచి స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్