




Best Web Hosting Provider In India 2024

Warangal Crime : అమ్మాయిలను ట్రాప్ చేసి.. వ్యభిచార కూపిలోకి లాగి..! దంపతుల చీకటి దందా బట్టబయలు
వరంగల్ నగర పరిధిలో మరోసారి వ్యభిచార దందా వ్యవహారం బట్టబయలైంది. అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార రొంపిలోకి దింపి దందా నిర్వహిస్తున్న భార్య భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ వీరు జైలుకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు.

వరంగల్ నగరంలో వ్యభిచార దందా ఆగడం లేదు. ఓ వైపు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా, వ్యభిచార గృహ నిర్వాహకులు అదంతా ఏమీ పట్టించుకోకుండా మళ్లీ అదే బాగోతం నడిపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, బాలికలను ట్రాప్ చేసి గలీజ్ దందా సాగిస్తున్నారు.
ఇటీవల వరంగల్ నగర శివారులోని దామెర మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన ఓ మహిళ తల్లిదండ్రులు లేని మైనర్ బాలికను ట్రాప్ చేసి వ్యభిచార రొంపిలోకి దింపగా.. నగరంలో చాలామంది ఇదే బిజినెస్ నడిస్తున్నారు. ఇలా దందా సాగిస్తున్న ఇద్దరు దంపతులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. వారి నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు, రూ.1500 నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ మామునూరు పీఎస్ పరిధి గవిచర్ల రోడ్డు సమీపంలోని రాజీవ్, సునీత అనే దంపతులు కొంతకాలంగా వ్యభిచార గృహం నడిపిస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు.
దంపతుల అరెస్ట్….
కొంత కాలంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న రాజీవ్, సునీత దంపతుల వ్యవహారం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలిసింది. దీంతో శనివారం రాత్రి ఓ అమ్మాయిని తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తుండగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు రాజీవ్, సునీత దంపతులను అరెస్ట్ చేయగా.. విటుడు వరంగల్ ఫోర్ట్ లోని కాశీకుంటకు చెందిన మేకల రాము పరారయ్యాడు. కాగా బాధితురాలిని వ్యభిచార గృహం నుంచి విడిపించి, రాజీవ్, సునీత దంపతులను తదుపరి విచారణ నిమిత్తం మామునూరు పోలీసులకు అప్పగించారు.
గతంలో డిగ్రీ స్టూడెంట్ ను తీసుకొచ్చి..
రాజీవ్, సునీత దంపతులు వ్యభిచార దందా మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. చుట్టుపక్కల ఉండే నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, స్టూడెంట్లను ట్రాప్ చేసి, వ్యభిచార కూపంలోని దింపుతున్నారు. కాగా రాజీవ్, సునీత దంపతులు గతంలో కూడా పోలీసులకు పట్టుబడ్డారు.
గతేడాది అక్టోబర్ 29న కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ డిగ్రీ స్టూడెంట్ కు డబ్బు ఆశ చూపి వరంగల్ కు తీసుకొచ్చారు. ఇక్కడ వ్యభిచారం నిర్వహించేందుకు ప్లాన్ చేయగా.. టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి, వారిని పట్టుకున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు చెందిన డిగ్రీ స్టూడెంట్ ను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. రాజీవ్, సునీత దంపతులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
కాగా కొద్దిరోజులు జైలుకు వెళ్లి వచ్చిన రాజీవ్, సునీత దంపతులు మళ్లీ అదే సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పోలీసులు వారిని మళ్లీ అరెస్ట్ చేశారు. ఇదిలాఉంటే నిరుపేద కుటుంబాలకు డబ్బు ఆశ చూపి వ్యభిచార గృహాలు నడిపిస్తున్న వారిపై స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
దీంతోనే పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా మళ్లీ అదే సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అమ్మాయిలు, కాలేజీ స్టూడెంట్స్ ను వ్యభిచార రొంపిలోకి దింపి, వారి జీవితాలు నాశనం చేస్తున్న గ్యాంగ్ లపై ఫోకస్ పెట్టాలని, పీడీ యాక్టులు పెట్టి మరోసారి ఈ దందా సాగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
టాపిక్