Pawan Tour: విశాఖలో పవన్ పర్యటనతో ట్రాఫిక్ జామ్‌.. జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు దూరమైన విద్యార్థులు

Best Web Hosting Provider In India 2024

Pawan Tour: విశాఖలో పవన్ పర్యటనతో ట్రాఫిక్ జామ్‌.. జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు దూరమైన విద్యార్థులు

 

Pawan Tour: ఉత్తరాంధ్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చేపట్టిన అడవిబాట కార్యక్రమం సందర్భంగా విశాఖలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి పలువురు విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు హాజరు కాలేక పోయారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరలేకపోయారు.

 
అడవిబాటలో పవన్‌ కళ్యాణ్‌కు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

Pawan Tour: విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలతో పలువురు విద్యార్థులు సకాలంలో జేఈఈ మెయిన్స్‌ పరీక్షా కేంద్రాలకు చేరలేకపోయారు. సోమవారం ఉదయం నుంచే రోడ్లపై రద్దీ, ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా భారీ సంఖ్యలో విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు రాయలేకపోయారు.

 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కోసం ఎన్ఏడీ నుంచి పెందుర్తి వరకు వాహనాలను నిలిపివేయడంతో జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. పరీక్షా కేంద్రాలకు చేరడానికి రెండు నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు విద్యార్థులకు ఆలస్యం కావడంతో నిర్వా హరులు పరీక్షలు రాసేందుకు అనుమతించలేదు. ఈ పరిణామంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ను ఆపలేదని.. బీఆర్‌‌టీఎస్‌ మధ్య రోడ్డులో పవన్ కాన్వాయ్‌లో వెళ్లారని.. మిగిలిన సర్వీస్ రోడ్లపై ఇతర వాహనాలు యధావిధిగా ముందుకు సాగాయని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్ని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అడవిబాట కోసం వచ్చి..

అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పర్యటించారు. దీంతో సోమవారం ఉదయం ఎన్ఏడీ కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వరకు ఉదయం నుంచి పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ప్రత్యేక విమానంలో ఉదయం 8.15 గంటలకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. పవన్ రాకకోసం ఉదయం 6.30 నుంచే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు.

పవన్ కాన్వాయ్ కోసం బీఆర్టీఎస్ మధ్య రోడ్డులో ఇతర వాహనాలను పూర్తిగా నిలిపివేయగా ఎడమ, కుడి మార్గాల్లో రద్దీ ఏర్పడింది. ఉదయం 7.30 నుంచి ట్రాఫిక్ నిలిపివేసినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు.

 

దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ కఠినంగా నియంత్రించడం, భారీ జనసేన కార్యకర్తలు తరలి రావడంతో బీఆర్‌టీఎస్‌ సర్వీస్ రోడ్డుపై రద్దీ పెరిగి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పవన్‌ వెళ్లేందుకు వేపగుంట నుంచి పెందుర్తి మార్గంలో అన్ని వైపులా వాహనాలను ఆపేశారు. దీంతో విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

విచారణ జరపాలన్న పవన్ కళ్యాణ్‌

పరీక్షా కేంద్రాలకు జేఈఈ విద్యార్థులు చేరుకోలేక పోవడంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. పెందుర్తి ప్రాంతంలో జెఈఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు రాయలేకపోవడానికి డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవాలపై విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు? పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా? లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు స్పష్టం చేశారు.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024