Best Web Hosting Provider In India 2024

Allu Arjun Birthday: ఒకే సంవత్సరంలో భారీ సక్సెస్, ఊహించని కష్టాలు
Allu Arjun Birthday: అల్లు అర్జున్ నేడు 43వ పడిలోకి అడుగుపెట్టారు. పుష్ప 2 భారీ సక్సెస్ కావటంతో ఇది మరింత స్పెషల్‍గా ఉంది. అయితే, గత సంవత్సరం అనుకోని కష్టాలను కూడా ఈ ఐకాన్ స్టార్ ఎదుర్కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు (ఏప్రిల్ 8) తన 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుష్ప 2 చిత్రంతో బాక్సాఫీస్‍ను షేక్ చేసిన తర్వాత వచ్చిన బర్త్ డే కావటంతో మరింత ప్రత్యేకంగా ఉంది. అయితే, గత పుట్టిన రోజు నుంచి ఈ బర్త్‌డే మధ్య ఒకే సంవత్సరంలో అల్లు అర్జున్ రకరకాల పరిస్థితులు ఎదుర్కొన్నారు. బంపర్ సక్సెస్‍తో పాటు అనుకోని కష్టాల్లో చిక్కుకున్నారు. ఆ వివరాలు ఇవే..
పుష్ప 2 గ్రాండ్ సక్సెస్
పుష్ప 2: ది రూల్ చిత్రం అంచనాలను అందుకొని భారీ బ్లాక్‍బస్టర్ అయింది. గతేడాది 2024 డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ మూవీ రూ.1,870కోట్ల కలెక్షన్ల మార్క్ దాటింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్ల రికార్డు సాధించింది. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్ల ఇండియన్ సినిమాల జాబితాలో రెండో ప్లేస్‍కు వచ్చింది. హిందీ నెట్ కలెక్షన్లలో కొత్త చరిత్ర సృష్టించింది. ఆ రేంజ్‍లో పుష్ప 2 చిత్రం సక్సెస్ సాధించింది. డైరెక్టర్ సుకుమార్ సీక్వెల్ హైప్‍కు తగ్గట్టు గ్రాండ్ స్కేల్‍లో ఈ మూవీని తెరకెక్కించారు.
పుష్ప 2 మూవీతో భారీ విజయం సాధించారు అల్లు అర్జున్. పాన్ ఇండియా రేంజ్‍లో మరింత క్రేజ్ పెంచేసుకున్నారు. ముఖ్యంగా ఆ చిత్రంలో నట విశ్వరూపం చూపారు. జాతర ఎపిసోడ్, యాక్షన్ సీక్వెన్సుల్లో ఐకాన్ స్టార్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. స్క్రీన్ ప్రెజన్స్, స్వాగ్, స్టైల్‍తో మరోసారి అదరగొట్టారు అల్లు అర్జున్.
తొక్కిసలాట కేసులో జైలుకు..
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా గతేడాది డిసెంబర్ 4న హైదరాబాద్‍లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ షోకు అల్లు అర్జున్ కూడా హాజరవటంతోనే తొక్కిసలాట జరిగిందని ఆయనపై కేసు నమోదైంది. ఓ రోజు జైలులో ఉన్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‍పై బయటికి వచ్చారు. కొన్నాళ్ల తర్వాత రెగ్యులర్ బెయిల్ దక్కింది. ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్‍పై కొందరు ఘాటుగా కూడా విమర్శలు చేశారు. చికిత్స పొందుతున్న బాలుడిని అల్లు అర్జున్ నేరుగా వెళ్లి పరామర్శించారు.
ఇలా ఒక సంవత్సరంలోనే పుష్ప 2తో అదిరిపోయే సక్సెస్ చూసిన అల్లు అర్జున్.. ఊహించిన విధంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన జీవితంలో 42, 43వ పుట్టిన రోజుల మధ్య సంవత్సరం మిశ్రమంగా నడిచింది.
కేక్ కట్ చేసిన అల్లు అర్జున్
43వ పుట్టిన రోజును నేడు కుటుంబంతో కలిసి ఇంట్లోనే జరుపుకున్నారు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ కేక్ కట్ చేసిన ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు ఆయన భార్య స్నేహా రెడ్డి. వారి పిల్లలు అయాన్, అర్హ కూడా సెలెబ్రేషన్లలో ఉన్నారు.
అల్లు అర్జున్ నెక్స్ట్ తమిళ డైరెక్టర్ అట్లీతో మూవీ చేయనున్నారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన ఐకాన్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (ఏప్రిల్ 8) రానుంది. స్పెషల్ వీడియోను మూవీ టీమ్ తీసుకురానుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‍తోనూ ఓ మైథలాజికల్ చిత్రానికి అల్లు అర్జున్ ఓకే చెప్పారు.