



Best Web Hosting Provider In India 2024

TG Education and Jobs : పదో తరగతి అయిపోయాక ఏం చేయాలి.. చదువు, ఉద్యోగ అవకాశాలు ఇవిగో!
TG Education and Jobs : ప్రతీ విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. టెన్త్ పాస్ అయితేనే భవిష్యత్తు ఉంటుంది. చదువు, ఉద్యోగం.. దేనికైనా పదో తరగతి కచ్చితంగా పాసై ఉండాలి. మరి టెన్త్ తర్వాత ఏం చేయాలి.. ఏ కోర్సు చదవాలి.. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి.. ఇప్పుడు తెలుసుకుందాం.

భవిష్యత్తులో ముందడుగు వేయాలంటే.. పదో తరగతి అత్యంత కీలకం. పదిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల తెలంగాణలో వార్షిక పరీక్షలు ముగిశాయి. ఇక ఇప్పుడు ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ప్రవేశపరీక్షలు ఏముంటాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనే సందేహాలు విద్యార్థుల్లో ఉంటాయి. చదువు, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఇలా ఉంది.
ఇంటర్..
రెండేళ్ల వ్యవధితో ఇంటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ).. ఇందులో ఉత్తీర్ణులైతే బీటెక్, బీఆర్క్ (జేఈఈ/ఎప్‌సెట్ రాయవచ్చు). బీఎస్సీలో పలు కోర్సులు చేయవచ్చు. బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ).. నీట్ రాసి మెడిసిన్, బీడీఎస్, ఫార్మాడీ, బి.ఫార్మసీ, వ్యవసాయ, ఉద్యాన కోర్సులతో పాటు డిగ్రీ – బీఎస్సీలో చేరవచ్చు. ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్).. బీఎస్సీ (గణితం), బీకాం, బీఏ. ఉత్తీర్ణత పొందాక సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ చేయవచ్చు. సీఈసీ (కామర్స్, ఎకనామిక్స్, కామర్స్).. డిగ్రీలో బీకాం, బీఏ కోర్సులు తీసుకోవచ్చు. ఆ తర్వాత సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ చేయవచ్చు.
పాలిటెక్నిక్..
పాలిటెక్నిక్‌లో కంప్యూటర్ సైన్స్ సివిల్, మెకానికల్, అగ్రికల్చర్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్, సిరామిక్ టెక్నాలజీ, హార్టీకల్చర్, ఎలక్ట్రిక్ ఆటోమొబైల్, యానిమల్ హజ్బెండరీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటాయి. వీటిలో చేరేందుకు ఈ నెల 19లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. www.polycet.sbtet.telangana.gov.in లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఎన్‌టీటీఐ..
డిప్లొమా ఇన్ టూల్ అండ్ మేకింగ్, టెక్నికల్ స్కిల్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్లాంట్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో కూడా జాయిన్ కావొచ్చు. ఇవే కాకుండా.. డీటీపీ, ట్యాలీ, గ్రాఫిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ వంటి సర్టిఫికెట్ కోర్సులు కూడా ఉంటాయి.
ఉద్యోగావకాశాలు..
పదో తరగతి పాసైతే వివిధ కేంద్ర ప్రభుత్వ కొలువులు దక్కించుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కేంద్ర భద్రతా దళాల్లో కానిస్టేబుళ్లు, రైఫిల్ మెన్ వంటి అవకాశాలు ఉంటాయి. రైల్వేశాఖలో గ్రూప్-డీ పోస్టులు, టికెట్ కలెక్టర్, రిజర్వేషన్ క్లర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో చేరవచ్చు. అటవీశాఖలో అసిస్టెంట్ బీట్ అధికారులు, బంగ్లా వాచర్, థానేధార్ వంటి పోస్టుల్లో చేరవచ్చు. రక్షణ శాఖకు సంబంధించి ఆర్మీలో చేరిక, గ్రూప్-5, మల్టీ టాస్కింగ్, ఫైర్‌మెన్, వంటమనిషి, స్టీబార్డ్స్ వంటి జాబ్స్ ఉంటాయి. ఇవే కాకుండా.. పోస్ట్‌మెన్, మెయిల్ గార్డ్స్, బ్యాంకుల్లో అటెండర్ స్థాయి ఉద్యోగాలు సాధించవచ్చు.
ఒకేషనల్ కోర్సులు..
వివిధ కాంబినేషన్లలో సుమారు 29 రకాల వృత్తివిద్యాకోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని పూర్తి చేసి ఎప్‌సెట్ రాసుకోవచ్చు. ఒక బ్రిడ్జి కోర్సు పూర్తిచేసి బీఎస్సీలో చేరవచ్చు. సీఎస్, ఐసీడబ్ల్యూఏలో కూడా చేరవచ్చు. ఇవి పూర్తి చేస్తే పలు ఉద్యోగాలు దక్కించుకోవచ్చు.
ఐటీఐ..
ఐటీఐలో ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్, మోటారు మెకానిజం, వైర్‌మ్యాన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిజం, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, ఫుడ్ ప్రొడక్షన్, వెల్డర్ నేర్చుకోవచ్చు.
పారామెడికల్..
పారామెడికల్‌లో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆస్పీటర్ ఫుడ్ సర్వీసు మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ టెక్నాలజీ, ఫిజియోథెరఫీ, ఏఎన్‌ఎం చేయవచ్చు.
టాపిక్