


Best Web Hosting Provider In India 2024
US work visa : వర్క్ వీసాపై యూఎస్‌లో కొత్త బిల్లు- 3లక్షల మంది భారతీయుల్లో ఆందోళన!
US work visa : వర్క్ ఆథారైజేషన్ ప్రోగ్రామ్ అయిన ఓపీటీని తొలగించే ఉద్దేశంతో అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఇది 3లక్షలకుపైగా మంది భారతీయలను ప్రభావితం చేయనుంది!

అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు అంతర్జాతీయ విద్యార్థుల్లో, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) కోర్సులు అభ్యసిస్తున్న వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్ల వరకు దేశంలో ఉండటానికి అనుమతించే వర్క్ ఆథరైజేషన్ ప్రోగ్రామ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపిటి) ని నిలిపివేసే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చారు.
వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి, దీర్ఘకాలిక ఉపాధి వీసాలకు మారడానికి ఓపిటిపై ఆధారపడే అమెరికాలోని లక్షలాది మంది భారతీయ విద్యార్థుల కెరీర్ అవకాశాలను ఈ కొత్త బిల్లు దెబ్బతీస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో చదువు కోసం అమెరికాకు వెళుతున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం 2023-2024 విద్యా సంవత్సరంలో అక్కడ ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులే ( 3,31,602 మంది) టాప్! ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 23 శాతం ఎక్కువ.
97,556 మంది విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో ఉన్నారు. ఇది 41 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది.
ఓపీటీని రద్దు చేసేందుకు గతంలో చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో వలస వ్యతిరేక విధానాలు విస్తృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బిల్లు రావడం గమనార్హం.
భారీ బహిష్కరణలు, కఠినమైన వీసా నియంత్రణలు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వాగ్దానాల్లో కీలక భాగంగా ఉన్నాయి. ఇది ఇప్పటికే ఉన్న ఎఫ్ -1, ఎం -1 వీసా హోల్డర్లలో అశాంతికి దారితీస్తుంది.
వీరిలో చాలా మంది ఇప్పుడు తమ హోదాను హెచ్ -1బి వీసాగా మార్చడానికి సహాయపడే ఉద్యోగాల కోసం అత్యవసరంగా దరఖాస్తు చేసుకుంటున్నారని నివేదిక తెలిపింది.
ఓపీటీ భవిష్యత్తు గురించి నిపుణులు ఏమంటున్నారు?
గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏడాది పాటు అమెరికాలో ఉద్యోగాలు పొందేందుకు ఓపీటీ అవకాశం కల్పిస్తుందని, స్టెమ్ గ్రాడ్యుయేట్ అయి అర్హత కలిగిన యూఎస్ ఎంప్లాయర్‌తో కలిసి పనిచేస్తుంటే మరో రెండేళ్లు పొడిగించవచ్చని ఇమ్మిగ్రేషన్ లా క్వెస్ట్ ఫౌండర్ పూర్వీ ఛోథానీ పేర్కొన్నారు.
“కాగా తాజా బిల్లు ఆమోదం పొందితే మరో వర్క్ వీసాకు మారే అవకాశం లేకుండానే ఓపీటీ హఠాత్తుగా ముగుస్తుంది. విద్యార్థులు వెంటనే అమెరికాను వీడాల్సి రావచ్చు,” అని ఛోథానీ తెలిపారు. ఓపీటీ హోదా ఉన్న విద్యార్థులు లాటరీ ద్వారా హెచ్-1బీ వీసా పొందే ప్రక్రియను వేగవంతం చేయాలని, లేదా మరొక దేశాల్లో అవకాశాలు వెత్తుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు కూడా యూకే తరహాలోని వ్యవస్థకు సిద్ధపడాల్సి ఉంటుంది. విద్యార్థులు వారి చదువులు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి.
ఈ పూర్తి వ్యవహారంలో విద్యార్థుల ఆర్థిక పరిస్థితిపై ఛోథానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీటీ లేకుండా, విద్యార్థులు పెద్ద మొత్తంలో విద్యార్థి రుణాలను తిరిగి చెల్లించడంలో సహాయపడే యూఎస్ స్థాయి జీతాలను కోల్పోయే అవకాశం ఉందన్నారు.
పలు నివేదికల ప్రకారం, చాలా మంది భారతీయ విద్యార్థులు తమ వేసవి ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. ఇళ్లకు వెళితే, మళ్లీ అమెరికాలోకి తిరిగి రానిస్తారా? లేదా? అని భయపడుతున్నారు.
కార్నెల్, కొలంబియా, యేల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు కూడా విదేశీ విద్యార్థులు విరామ సమయంలో స్వదేశానికి వెళ్లవద్దని అనధికారికంగా సూచించాయి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link