





Best Web Hosting Provider In India 2024

ఒకే చెట్టుకు 350 రకాల మామిడి పండ్లు, ఇది ఎలా సాధ్యం? ఈ రైతు ఎలా చేశాడో తెలుసుకోండి
మామిడిపండ్ల సీజన్ వచ్చేసింది. వేసవిలో మామిడి చెట్లకు ఆకుపచ్చని మామిడిపండ్లు వేలాడుతూ ఉంటాయి. అయితే ఒకే చెట్టుకు 300 రకాల మామిడి పండ్లను పండించాడు ఒక రైతు.

అతను ఒక రైతు.
ఏమీ చదువుకోలేదు.
అలా అని ధనవంతుడు కాదు.
చిన్నప్పటి నుంచి ఆయనకు తెలిసిందల్లా వ్యవసాయమే.
ఆ వ్యవసాయమే ఆయనను శాస్త్రవేత్తగా మార్చింది.
ఏ చదువు లేకపోయినా కూడా పరిశోధనలు చేయవచ్చని నిరూపించారు ఈ రైతు.
ఇతని కష్టానికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది.
ఇతడిని ‘ఇండియన్ మ్యాంగో మ్యాన్’ అని పిలుస్తారు.
పేరు కలిముల్లా ఖాన్. ఈయన ఒకే మామిడి చెట్టుకు 350 కన్నా ఎక్కువ రకాల మామిడిపండ్లను పండించాడు. ఇలా చేయడం అంత సులువు కాదు.
సాధారణంగా మన చుట్టూ ఉన్న మామిడి చెట్లను గమనించండి. బంగినపల్లి మామిడి చెట్టుకు బంగినపల్లి మామిడిపండ్లే కాస్తాయి. మహా అయితే అంటుకట్టడం వల్ల ఒక వేరే రకం పండును కూడా కాయించవచ్చు. కానీ 350 రకాల మామిడిపండ్లను ఒకే చెట్టుకు కాయించడం సులభమైన పని కాదు. అది సాధ్యం చేసి చూపించారు కలీముల్లా.
కన్న కూతురిలాంటి చెట్టు
ఒకే ఒక్క మామిడి చెట్టు దానిపై 350 రకాల మామిడి పండ్లు. ఆ చెట్టు అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ. కన్నా కూతురిని పెంచినట్టు దాన్ని పెంచుకుంటూ వచ్చారు. అతని కష్టం వృధా పోకుండా ఆ చెట్టు 350 రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేసింది. మన దేశంలోనే అద్భుతమైన మామిడి చెట్టుగా పేరుపొందింది. దాని సృష్టికర్త అయిన కలీముల్లా ఖాన్ కు కూడా ఎంతో పేరును తెచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ చెట్టు గురించి చర్చలు జరిగాయి.
కలీముల్లాది ఉత్తరప్రదేశ్లోని మలిమాబాద్ ప్రాంతం. అతడు చిన్నప్పటినుంచి మామిడి తోటలో తిరుగుతూనే తన రోజులు గడిపాడు. అతనికి తెలిసిందల్లా కష్టపడి పని చేయడమే. ఏడవ తరగతిలోనే పాఠశాలను విడిచిపెట్టాడు. అతని తాత మరణించిన తర్వాత మామిడి తోటను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మామిడి చెట్ల మధ్య తన జీవితాన్ని గడిపాడు. చదువుపై ఆసక్తి లేదు కానీ మామిడి చెట్లను సరికొత్తగా పెంచడంలో మాత్రం ఆసక్తి ఉంది.
పునాది ఇలా…
1957లో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒకే చెట్టుకు ఏడు రకాల మామిడి పండ్లు కాయించాలని అనుకున్నాడు. ఏడు రకాల చెట్లను అంటు కట్టడం ద్వారా ఒక మొక్కను పెంచగలిగాడు. కానీ ప్రకృతి ప్రళయానికి ఆ సంవత్సరం భారీ వరదలు వచ్చి ఆ మామిడి చెట్టు కొట్టుకుపోయింది. కానీ అతనికి ఒక అనుభవాన్ని మాత్రం మిగిల్చి వెళ్ళింది.
ఎదురుదెబ్బలు ఎప్పుడూ మనిషికి విజయానికి బాటలు వేసే అనుభవాన్ని ఇస్తుంది. అంటుకట్టడంపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా 1987 నాటికి 22 ఎకరాల విశాలమైన భూమిలో రకరకాల మామిడి చెట్లను పెంచడం మొదలుపెట్టాడు. అవన్నీ కూడా అంటుకట్టినవే. ఒక చెట్టుపై మొదట్నించి అంటుకట్టే ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆ చెట్టును కలీముల్లా ఖాన్ తాత వేశారు. ఆ చెట్టుకు అప్పుడప్పుడు అంటుకడుతూ ఉండే వాడు కలీముల్లా ఖాన్. మొదట ఆ చెట్టు నాలుగైదు రకాల మామిడి పండ్లు కాసేవి. ఆ తరువాత ఆ సంఖ్య పదికి పెరిగింది. అలా ఏటా కొత్త అంటు కడుతూ ఆ చెట్టుకు 350 రకాల పండ్లు కాసేలా అంటుకట్టాడు. ఇప్పుడు ఆ చెట్టు వయస్సు 125 సంవత్సరాలు.
అంటు కట్టడం ఎలా?
అంటు కట్టడం అనేది అంత సులువైన పని కాదు. దానికి ఓపిక ఎంతో అవసరం. వివిధ రకాల మామిడి కొమ్మలను ఒకే వేరు కాండంతో కలిపి కట్టి పెంచే సాంకేతికత. ఇది ఒక అద్భుతమైన మొక్కలకు సృష్టికారకంగా ఉంటుంది. కలిముల్లా మాట్లాడుతూ అంటుకట్టడం అనేది ఒక కళ అని చెబుతారు.
ప్రస్తుతం ఒకే చెట్టుకు 350 రకాల మామిడిపండ్లు కాస్తున్నా… వాటిలో ఆల్ఫోన్సో, లాంగ్, కేసర్ వంటి వాటితో పాటు ఈయన స్వయంగా కనిపెట్టిన హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతో తీపిగా ఉండేవే.
సెలెబ్రిటీల పేర్లు
అంటు కట్టడం ద్వారా తాను కనిపెట్టిన మామిడిపండ్లకు సెలబ్రిటీల పేర్లు కూడా పెట్టారు. ఒక రకం మామిడిపండుకు సచిన్ టెండుల్కర్ అని, ఇంకో రకం మామిడిపండుకు ఐశ్వర్య రాయ్ అని… ఇలా ఎన్నో పేర్లను పెట్టారు. ఇక పొడవైన తోతాపూరి మామిడికాయ అమితాబచ్చన్ అనే పేరును పెట్టారు. నారింజ రంగులోకి మారే పండుకి నరేంద్ర మోడీ అని పేరు పెట్టారు.
ప్రస్తుతం కలీముల్లాకు 84 ఏళ్లు. ఇతనికి సాయంగా అతని కొడుకు చదువు ఇంటర్ తోనే ఆపేసి మామిడి తోట పనిలోనే పడ్డారు. ప్రస్తుతం వీరు 22 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలను పెంచుతున్నారు. వారికి ఈ పని కష్టంగానే ఉంది. కానీ తెగుళ్ల బారిన పడకుండా కాపాడుకోవడం, సరైన మొత్తంలో నీరు అందేలా చూడడం, వాతావరణాన్ని బట్టి వాటికి రక్షణ కల్పించడం వంటివి మీరు చేయాలి. మామిడి కాయలు, మామిడిపంట వర్షం మీద ఆధారపడి ఉంటుంది.
వర్షం తక్కువగా ఉన్నప్పుడు మామిడిపండ్ల సైజు చిన్నవిగా కాస్తాయి. అదే అధిక మొత్తంలో నీరు అందితే మామిడికాయల పై మామిడికాయల సైజు పెద్దగా వస్తుంది. అయితే మామిడిపండ్లపై ఫంగస్ కూడా దాడి చేస్తూ ఉంటుంది. వాటన్నింటిని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వీరిదే.
ఒకే చెట్టుకు 350 రకాల పండ్లను పండించిన విషయం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దాంతో ఈ చెట్టును చూసేందుకు ఇరాన్, దుబాయ్ నుండి కూడా రైతులు వస్తూ ఉంటారని కలీముల్లా చెబుతున్నారు. కొన్ని మామిడి పండ్లు చూసేందుకు యాపిల్ పండ్లలా కూడా కనిపిస్తాయి.
మామిడి పండ్లు మనిషితో పాటు వేల సంవత్సరాలుగా ఆహారంలో భాగంగా ఉన్నాయి. అది సంస్కృతిలో, సాంప్రదాయంలో కూడా భాగమైపోయింది.
సంబంధిత కథనం