




Best Web Hosting Provider In India 2024

MBBS Exam Malpractice : ఎంబీబీఎస్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్, నిర్వహణ లోపంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
MBBS Exam Malpractice : విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వరుసగా రెండోసారి మాల్ ప్రాక్టీస్ ఘటన బయటపడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు స్లిప్పులతో పట్టుబడ్డారు. వారి సమాధాన పత్రాలు, హాల్ టికెట్లు స్వాధీనం చేసుకుని మాల్ ప్రాక్టీస్ కమిటీకి పంపారు.

MBBS Exam Malpractice : ఎంబీబీఎస్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ చోటు చేసుకుంది. విజయవాడ సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వారంలోనే రెండోసారి మాల్‌ప్రాక్టీస్ బయటపడింది. దీంతో పరీక్షల నిర్వహణలో జరిగిన లోపంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే డబ్బులు కూడా చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి.
విజయవాడలోని సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో శనివారం జరిగిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం పార్ట్-1 కమ్యూనిటీ మెడిసిన్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు పట్టుపడ్డారు. వారి హాల్ టిక్కెట్లు, గుర్తింపు కార్డులు, సమాధానాల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని మాల్ ప్రాక్టీస్ కమిటీకి పంపారు. వారు మాల్ ప్రాక్టీస్ కమిటీ ముందు విచారణకు హాజరుకానున్నారు.
సరిగ్గా మూడు రోజుల క్రితమే సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం జనరల్ మెడిసిన్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ చోటు చేసుకుంది. పరీక్షలు రాస్తున్న సమయంలో ముగ్గురు విద్యార్థులు జేబుల్లో స్లిప్పులు ఉన్నాయి. వాటిని గుర్తించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉన్నతాధికారులు హాల్ టికెట్లు, గుర్తింపు కార్డులు, సమాధానాల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని మాల్ ప్రాక్టీస్ కమిటీకి పంపారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు, నిమ్రా మెడికల్ కాలేజీకి చెందిన ఒకరు స్లిప్‌లతో మాల్ ప్రాక్టీస్ చేశారు. ఆ ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కమిటీ ముందు హాజరయ్యారు. ఇంకా ఈ ఘటన మరవకముందే తాజాగా శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
వరుసగా మాల్ ప్రాక్టీస్ ఘటనలు
రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో పరీక్షలు జరుగుతున్నాయి. అయితే విజయవాడలోని సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వరుసగా మాల్‌ప్రాక్టీస్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే పరీక్షలకు ఎగ్జామినర్లు, పరిశీలకులు, ఇన్విజిలేటర్లుగా వైద్యులు కానివారిని నియమించారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. శనివారం జరిగిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు.
సెల్‌ఫోన్‌లు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడంతోనే మాల్ ప్రాక్టీస్ జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పరీక్షల నిర్వహణలో కూడా లోపాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. దీనిపై స్పందించిన రిజిస్ట్రార్ రాధికారెడ్డి మాల్ ప్రాక్టీస్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, ఎగ్జామినర్లకు మెమోలు ఇస్తామని అన్నారు. ఇక నుంచి యూనివర్శటీ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు పంపి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా చూస్తామని అన్నారు. బాధ్యుతలపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే ఇటీవలి పారా మెడికల్ కోర్సుల పరీక్షల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్