




Best Web Hosting Provider In India 2024

Karimnagar Collector : ఆటో నడిపిన కరీంనగర్ కలెక్టర్, మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం
Karimnagar Collector : కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆటో నడిపారు. కలెక్టర్ ఆటో నడిపి శిక్షణను ప్రారంభించి డ్రైవింగ్ అంటే తనకు భయమని తెలిపారు. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కింద పడడంతో రెండు పళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. డ్రైవింగ్ శిక్షణ కోసం తాను పడ్డ కష్టాన్ని వివరించారు.

Karimnagar Collector : కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆటో నడిపారు. కలెక్టర్ ఆటో నడిపితే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జెండా చూపి మహిళలకు ఆటో డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించారు. కలెక్టర్ ఆటో నడిపితే ఆ ఆటోలో ఎమ్మెల్యే ప్యాసింజర్ గా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోవో సొసైటీ సహకారంతో 20 మంది మహిళలకు ఆటో డ్రైవింగ్ శిక్షణను కలెక్టర్ పమెలా సత్పతి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. కలెక్టర్ ఆటో నడిపి శిక్షణను ప్రారంభించి డ్రైవింగ్ అంటే తనకు భయమని తెలిపారు. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కింద పడడంతో రెండు పళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. డ్రైవింగ్ శిక్షణ కోసం తాను పడ్డ కష్టాన్ని వివరించారు. అలాంటి ఇబ్బంది ఎవరికి రాకూడదని ప్రభుత్వమే మహిళలకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.
మహిళ ఆటో డ్రైవర్లు నిర్దిష్ట గమ్యాన్ని సురక్షితంగా చేరుస్తారని తెలిపారు. ప్రజా రవాణాను మహిళలే ఎక్కువగా ఉపయోగిస్తారని, ఆ రవాణా సాధనాలను నడిపించేవారు కూడా మహిళలే అయి ఉండాలన్నారు. కరీంనగర్ లో ప్రవేశపెట్టిన డ్రైవింగ్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని దేశంలోనే ఆదర్శంగా కరీంనగర్ మహిళలు నిలువాలని ఆకాంక్షించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఐకెపి ద్వారా ధాన్యం కొనుగోలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, పెట్రోల్ బంకుల మంజూరు వంటివి అందులో భాగమని కలెక్టర్ తెలిపారు.
పైసా ఖర్చు లేకుండా మహిళలకు ఆటోలు
మహిళలకు ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి, ఆటో కొనుగోలుకు పెట్టుబడి సాయం చేసి ఉపాధి మార్గాన్ని చూపిస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఆటోలకు ఆర్థిక సహాయం అందించి పైసా ఖర్చు లేకుండా నడుపుకుని, తద్వారా రోజు వారి ఆదాయం సంపాదించవచ్చన్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ కోటీశ్వరులు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పంగా చెప్పారు. ఇందులో భాగంగానే స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో క్యాంటీన్ల నిర్వహణ, ఆర్టీసీ అద్దె బస్సుల కొనుగోలు, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటివి ప్రభుత్వం చేస్తున్నదన్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను ఆటోల్లో తీసుకెళ్లడం ద్వారా మహిళలు నికర ఆదాయం పొందవచ్చని సూచించారు. జీవన ప్రమాణానికి, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా సంపాదించడం అవసరమైన ఈ రోజుల్లో స్వయం ఉపాధి మహిళలకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు.
మొబైల్, టీవీ, మోటార్ రంగంలో మహిళలకు శిక్షణ
మహిళలు విభిన్న రంగాల్లో రాణించాలని ఉద్దేశంతో డ్రైవింగ్ లో శిక్షణ ప్రారంభించామని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణి తెలిపారు. ఆటో డ్రైవింగ్ శిక్షణ ద్వారా ఇప్పటికే హైదరాబాదులో చాలామంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మొబైల్, టీవీ, మోటార్ రంగంలోనూ మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఇంతకుముందు మహిళలకు బ్యూటీషియన్, టైలరింగ్ వంటి వాటిల్లో మాత్రమే శిక్షణ ఇచ్చే వారమని, ఇంకా నుంచి అన్ని రంగాల్లో మగవారితో సమానంగా మహిళలు రాణించేలా శిక్షణ ఇస్తామని తెలిపారు. మహిళా కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మహిళా ప్రాంగణంలో వివిధ రంగాల్లో శిక్షణలు పొందిన పలువురు మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, మోవో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జైభారతి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, ప్రాంగణం మేనేజర్ సుధారాణి, సీఐ శ్రీలత, జిఎం సుభద్ర పాల్గొన్నారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్