




Best Web Hosting Provider In India 2024

Maoist Story : ఆవేశంతో అడవిబాట, 40 ఏళ్ల తర్వాత స్వస్థలానికి- ఓ మావోయిస్టు విషాద గాథ
Maoist Story : భర్త అడుగుజాడల్లో అడవిబాట పట్టింది. మావోయిస్టుగా 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపింది. ప్రతికూల పరిస్థితులలో అనారోగ్యం పాలై అడవిబాట వీడి జనజీవన స్రవంతిలోకి చేరింది. అయితే కడుపును పుట్టిన బిడ్డను సైతం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఆమె ఉంది.

Maoist Story : ఆవేశంలో అడవిబాట పట్టింది. భర్త అడుగుజాడల్లో నడిచింది. నక్సల్ బరి ఉద్యమం సాగించింది. ఓ బిడ్డకు తల్లైనప్పటికీ నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి కడుపున పుట్టిన బిడ్డను బంధువులకు అప్పగించి మావోయిస్ట్ గా 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపింది. ప్రతికూల పరిస్థితుల నేపద్యంలో అనారోగ్యం పాలై అడవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలిసి స్వస్థలానికి చేరింది. కడుపున పుట్టిన బిడ్డను గుండెలకు అతుక్కుని కన్నీటి పర్యంతమయ్యారు. బంధుమిత్రులంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ అరుదైన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన దళిత వర్గానికి చెందిన పసుల రాంరెడ్డి నక్సల్ బరి ఉద్యమంతో 1971లో పీపుల్స్ వార్ లో చేరారు. కొంతకాలానికి అరెస్ట్ అయి జైల్ పాలయ్యారు. జైల్ నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన రాంరెడ్డి కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన వసంతను బాల్య వివాహం చేసుకున్నారు. వారికి ఓ బిడ్డ జన్మించగా భవాని పేరు పెట్టారు. పసిపాపను రాంరెడ్డి సోదరుడు ముంబయిలో ఉండే సాయిబాబాకు అప్పగించి భార్యభర్తలు ఇద్దరు 1985లో పీపుల్స్ వార్ లో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
అప్పటి నుంచి ఇంటి ముఖం చూడలేదు. తమకు ఓ పాప ఉందనే ఆలోచన కూడా రాలేదు. బంధువులు సైతం వారిని మరిచిపోయారు. అలాంటి తరుణంలో 2001లో ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో రాంరెడ్డి మృతి చెందాడు. అ సమయంలో పాపను పెంచి పెద్దచేసిన పెద్దనాన్న సాయిబాబా తాను మీ తండ్రిని కాను అసలు తండ్రీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన రాంరెడ్డి అని తెలిపాడు. భౌతికంగా లేని నాన్న గురించి చెప్పిన పెద్దనాన్న తల్లి వసంత అజ్ఞాతంలో ఎక్కడుందో తెలియదన్నాడు. తల్లి కోసం భవాని ఆరా తీసిన అడ్రస్ దొరక్క ఏ ఎన్ కౌంటర్ లో చనిపోయిందోనని భావించింది.
భర్త మృతితో దండకారణ్యానికి వసంత…
భర్త రాంరెడ్డి ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవడంతో వసంత అలియాస్ శాంతక్క అలియాస్ మమతక్క అలియాస్ గంబాల అలియాస్ బత్తులే పేరు మార్చుకుని దండకారణ్యంకు వెళ్ళిపోయింది. మావోయిస్ట్ లో కీలక పాత్ర పోషిస్తూ నార్త్ బస్తర్ డివిజన్ కేఎంఎస్ ఇన్ ఛార్జీగా కొనసాగారు. పోలీస్ బలగాల నిర్బందంతో ప్రతికూల పరిస్థితులలో అనారోగ్యం పాలై వసంత అలియాస్ శాంతక్క అలియాస్ గంబాల ఈ సంవత్సరం 2025 జనవరి 31న లో చత్తీష్ గడ్ లోని నార్త్ బస్తర్ కంకేర్ జిల్లా ఎస్పీ కృష్ణ ఎదుట లొంగిపోయారు. అప్పటికే అమె పేరిట 8 లక్షల రివార్డు ఉంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వసంత స్వస్థలం గురించి ఆరా తీసిన పోలీసులు జగిత్యాల జిల్లా కోరుట్ల స్వస్థలం అని తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
వసంత కూతురు భవానికి వివాహం అయి హన్మకొండ జిల్లా పరకాలలో అత్తగారి ఇంటివద్ద ఉంటుంది. తల్లి వసంత గురించి తెలియడంతో వెంటనే భవాని గత నెల మార్చి 10న చత్తీస్ గడ్ లోని కాంకేర్ జిల్లాకు వెళ్ళి పోలీస్ అధికారులను కలిసి అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసి బావోద్వేగానికి గురయ్యారు. తల్లి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో పోలీసులు బంధువులు చెప్పిన వివరాల ప్రకారం వసంతను అక్కున చేర్చుకుని బోరున విలపించింది. తల్లిని తమకు అప్పగించాలని పోలీసులను వేడుకుంది.
బిడ్డకు తల్లిని అప్పగించిన పోలీసులు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరఖాస్తు చేసుకుంటే అప్పగిస్తామని కాంకెర్ జిల్లా ఎస్పీ కృష్ణ తెలుపడంతో భవాని తల్లిని అప్పగించాలని దరఖాస్తు చేసుకుంది. భవాని విజ్ఞప్తిని పరిశీలించిన చత్తీస్ గడ్ పోలీస్ యంత్రాంగం అనారోగ్యంతో ఉన్న వసంతను బిడ్డకు అప్పగించేందుకు అంగీకరించింది. దీంతో బిడ్డ భవానికి సమాచారం అందించడంతో తల్లికోసం బిడ్డ చత్తీస్ గడ్ వెళ్లగా ఈనెల 11న కాంకేర్ ఎస్పీ కృష్ణ, వసంతను బిడ్డ భవానికి అప్పగించారు. బిడ్డ చెంతకు చేరిన వసంతకు వైద్య పరీక్షలు చేసి కాస్త కోలుకున్నాక స్వస్థలం కోరుట్లకు తీసుకొచ్చారు.
40 ఏళ్ల తర్వాత సొంతింటికి చేరిన వసంత
భర్తతో అడవిబాట పట్టి 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపిన వసంత స్వస్థలం కోరుట్లకు చేరుకోవడంతో బంధుమిత్రులతోపాటు స్థానికులు పెద్దఎత్తున వసంత ఇంటికి చేరారు. చిన్నప్పుడు వెళ్ళిపోయిన వసంతను చూసి బావోద్వేగానికి గురై గుండెలకు హత్తుక్కుని కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న వసంతను సోదరుడు అక్కచెల్లెళ్ళు యారళ్ళు వారి పిల్లలు కలిసి ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇంతకాలం అడ్రస్ లేని జీవితం గడిపిన వసంతకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లేక ప్రభుత్వం ప్రకటించిన రివార్డు సైతం రాలేకపోయింది. గుర్తింపు కార్డు ఆధార్ తీసుకుని బ్యాంక్ అకౌంట్ తీసి పంపిస్తే రివార్డు అమౌంట్ అకౌంట్ లో జమ చేస్తామని కాంకేర్ జిల్లా పోలీస్ అధికారి తెలిపారని బిడ్డ భవానితోపాటు బంధువులు తెలిపారు. ప్రస్తుతం వసంత ఇళ్ళు శిధిలావస్థలో ఉండడంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
తల్లికి అండగా బిడ్డ
పసిప్రాయంలో తనను వదిలి మావోయిస్ట్ గా అజ్ఞాత జీవితం గడిపిన తల్లి అనారోగ్యంతో అడవిబాట వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తల్లికి అండగా ఉంటానని బిడ్డ భవాని తెలిపారు. భర్త రాజు, ఇద్దరు కుమారులు ఉన్నారని తమతో పాటే తన తల్లిని ఉంచుకుంటానని చెప్పారు. ఇంతకాలం తల్లిదండ్రులు లేరని బావించిన తనకు దేవుడే తల్లిని చూపించాడని బావోద్వేగంతో తెలిపారు. కాంకెర్ ఎస్పీ కృష్ణ ఏపీకి చెందిన తెలుగువారు కావడంతో వసంత స్వస్థలం గురించి ఆరాతీసి తమకు అప్పగించేలా కృషి చేశారని ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటామని భవాని తెలిపారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన రివార్డు త్వరగా ఇచ్చి చేయుత అందించాలని విజ్ఞప్తి చేశారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్