






Best Web Hosting Provider In India 2024

Malayalam Thriller: ట్విస్టులంటే ఇలా ఉండాలి.. యూట్యూబ్‌లో తెలుగులోనూ ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ మలయాళం థ్రిల్లర్ చూశారా?
Malayalam Thriller: ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్న మంచి థ్రిల్లర్ మూవీ కావాలా? అయితే యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్న ఈ మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూడండి. దృశ్యం మూవీ గుర్తుందా? ఇది కూడా అలాంటి థ్రిల్లరే.

Malayalam Thriller: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ తీయడంలో మలయాళం ఫిల్మ్ మేకర్స్ అందరి కంటే ఎంతో ముందే ఉంటారు. తెలుగులో వచ్చిన దృశ్యం మూవీ చూసే ఉంటారు కదా. అందులోని ట్విస్టులు మంచి థ్రిల్ పంచుతాయి. అలాంటిదే మరో మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది.
మలయాళం థ్రిల్లర్ హెవెన్
జియోహాట్‌స్టార్ ఓటీటీతోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా అందుబాటులో ఉన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ హెవెన్ (Heaven). స్టార్ నటుడు సూరజ్ వెంజరమూడు లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. 2022లో రిలీజైంది. ఉన్ని గోవింద్‌రాజ్ సినిమాను డైరెక్ట్ చేశాడు. అతనికిది తొలి మూవీ అయినా.. సూపర్ థ్రిల్లర్ అందించాడు.
ఈ సినిమా కొన్ని హత్యల చుట్టూ తిరిగే స్టోరీ. ఐఎండీబీలో 6.5 రేటింగ్ నమోదైంది. థియేటర్లలో రిలీజైనప్పుడే పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. తర్వాత జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ సినిమాను యూట్యూబ్ లోనూ ఫ్రీగా చూసే వీలుండటం విశేషం.
హెవెన్ మూవీ స్టోరీ ఏంటంటే?
హెవెన్ మూవీలో పోలీస్ ఆఫీసర్ పీటర్ కురిషింకల్ పాత్రలో సూరజ్ వెంజరమూడు నటించాడు. ఈ సినిమా మొదట్లోనే కొందరు ఎన్సీసీ క్యాడెట్లు ఓ అడవిలో ఓ కుళ్లిపోయిన మృతదేశాన్ని గుర్తిస్తారు. ఆ హత్యను ఇన్వెస్టిగేట్ చేసే ఓ పోలీస్ అధికారి.. ఆ నేరం చేసింది సీఐ పీటరే అని తన విచారణలో తేలుస్తాడు. అసలు ఆ హత్య ఎందుకు చేస్తాడు? దీనికి కారణం ఏంటన్నది తర్వాత కథలో చూపిస్తారు.
తన కొడుకును చంపిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఆ సీఐ ఆ హత్య చేస్తాడు. అయితే అతని కొడుకు హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఆ హత్య చేసిన వ్యక్తిని కనిపెట్టడానికి ఆ పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలు, అతన్ని హత్య చేసిన తీరు.. వీటిలోనే అసలు ట్విస్టులు ఉంటాయి.
హెవెన్ మూవీ ఎలా ఉందంటే?
మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాంటి సినిమాలను చివరి వరకూ సస్పెన్స్ ను మెయింటేన్ చేయడమే రక్తి కట్టిస్తాయి. అందులో భాగంగా వచ్చే ట్విస్టులే థ్రిల్ ను పంచుతాయి. తర్వాతి సీన్లో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు ఊహలకు అందని విధంగా కథానాన్ని నడిపించాల్సి ఉంటుంది.
అప్పుడే ఇలాంటి సినిమాలు అలరిస్తాయి. ఆ లెక్కన హెవెన్ మూవీలో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. తొలి సినిమా అయినా కూడా డైరెక్టర్ ఉన్ని గోవింద్‌రాజ్ ఈ విషయంలో తడబడలేదు. దృశ్యం మూవీలో ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం హీరో ఎన్నో ఎత్తుగడలు వేస్తాడు. అవే ప్రేక్షకులను చివరి వరకూ సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి.
ఈ హెవెన్ మూవీలో ఆ స్థాయిలో కాకపోయినా.. ఊహించని ట్విస్టులు చాలానే ఉంటాయి. ఓ సాధారణ దొంగతనంగా భావించిన కేసు.. ఓ పేద్ద డైమండ్ స్మగ్లింగ్ రాకెట్ ను ఎలా బయటపెడుతుందో కూడా ఇందులో చూడొచ్చు. మొత్తంగా ఈ హెవెన్ మూవీ ఓ మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా చెప్పొచ్చు. ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే వెంటనే యూట్యూబ్ లో తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ మూవీని చూసేయండి.
సంబంధిత కథనం