


Best Web Hosting Provider In India 2024

నాలుగు లక్షలు తీసుకుని దుబాయ్ ఏజెంట్ మోసం, సిద్దిపేట జిల్లాలో యువరైతు ఆత్మహత్య
దుబాయ్ కి పంపిస్తానని నమ్మించి సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రైతు వద్ద నాలుగు లక్షలు తీసుకుని మోసం చేశాడో ఏజెంట్. అదిగో, ఇదిగో అంటూ తిప్పుకున్నాడే తప్ప దుబాయ్ పంపలేదు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దుబాయ్ కి పంపిస్తానని నమ్మబలికి నాలుగు లక్షలు రూపాయలు తీసుకొని, దుబాయ్ ఏజెంట్ మోసం చేయడంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే… సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్ మండలంలోని తుర్కవాని కుంట గ్రామానికి చెందిన, బోడ శ్రీనివాస్ రెడ్డి (40) కి గ్రామంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తన భార్య, ఇద్దరు కూతుళ్లతో వ్యవసాయం, కూలినాలి చేసుకుంటూ జీవిస్తున్న శ్రీనివాస్ రెడ్డికి, ఇటీవల వ్యవసాయంలో నష్టాలు రావడం వలన అప్పుల పాలయ్యాడు .
అప్పుల భారం నుండి బయటపడాలని
అప్పుల భారం నుండి ఎలాగైనా బయటపడాలని ఆలోచన చేసిన శ్రీనివాస్ రెడ్డి, కొన్ని సంవత్సరాలు దుబాయ్ లో పని చేసి తనకు ఉన్న అప్పులు తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే తనకున్న ఎనిమిది లక్షల అప్పుతో పాటు, మరొక నాలుగు లక్షలు బంధువుల నుండి, స్నేహితుల నుండి అప్పు తెచ్చి సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ కి ఇచ్చాడు. అయితే, ఎన్ని రోజులు తిరిగిన మహబూబ్ శ్రీనివాస్ రెడ్డికి దుబాయ్ కి వెళ్ళడానికి అవకాశం కల్పించకపోవటంతో, తాను మోసపోయానని, తీవ్ర ఆవేదన చెందాడు.
అప్పుల వాళ్ల నుండి ఒత్తిడి పెరగడంతో
తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని, ఎన్నిసార్లు మోర పెట్టుకున్న ఇదిగో అదిగో అని మహబూబ్ పబ్బం గడుపుకుంటూ వస్తున్నాడు. గ్రామంలో, అప్పులు ఇచ్చిన వాళ్లు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో, శ్రీనివాస్ రెడ్డికి ఎటు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో సోమవారం రాత్రి, కుటుంబ సభ్యులందరు గాఢ నిద్రలో ఉన్న సమయంలో, శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ని ఒక గదిలోకి వెళ్లి లోపటి నుండి తాళం పెట్టుకుని, ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. అయితే, శబ్దం విని శ్రీనివాస్ రెడ్డి భార్య తక్షణమే నిద్ర లో నుండి మేల్కొని, ఇరుగు పొరుగుని పిలిచి వారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టింది. తదనంతరం శ్రీనివాస్ రెడ్డిని వెంటనే హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు, పరిశీలించి తాను చనిపోయినట్లు చెప్పటంతో, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
సూసైడ్ నోట్ చూసి కన్నీరు మున్నీరు
శ్రీనివాస్ రెడ్డి జేబులో, కుటుంబ సభ్యులు సూసైడ్ నోట్ ఉండటం చూసి పోలీసులకు తెలిపారు. ఆ సూసైడ్ నోట్ లో తనని దుబాయ్ ఏజెంట్ మహబూబ్ మోసం చేశాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కన్నపేట్ ఎస్సై కి, హుస్నాబాద్ సీఐకి విజ్ఞప్తి చేశాడు. తన భార్య, పిల్లలిద్దరినీ మంచిగా చూసుకోవాలని తన బావమరుదులు, ఇతర బంధువులను కోరారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది, ఎలాగైనా మహబూబ్ ని అరెస్ట్ చేసి, తిరిగి డబ్బులను శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఇప్పించడంతో పాటు, వారిని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న వయసులోనే, తండ్రి చనిపోవడంతో పిల్లలు దిక్కులేని వారయ్యారని గ్రామస్తులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
టాపిక్