





Best Web Hosting Provider In India 2024

కంచ గచ్చిబౌలిలో చెట్లు నరికివేతపై సుప్రీం కోర్టు ఆగ్రహం, పర్యావరణ ఉల్లంఘన తేలితే చర్యలు తప్పవని హెచ్చరిక..
SC on HCU Lands: కంచగచ్చబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ భూములైనా అనుమతి లేకుండా చెట్లు నరకడాన్ని అనుమతించేది లేదని జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దని, పునరుద్ధరణ ఎలా చేస్తారో చెప్పాలన్నారు.
SC on HCU Lands: అభివృద్ధి పేరుతో అడవుల్ని నరికి వేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కంచ గచ్చబౌలి భూముల్లోచెట్లు నరికి వేతపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. హెచ్‌సీయూ పరిధిలో ఉన్న భూములు ప్రభుత్వానివేనని అవి అటవీ భూములు కాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు సుమోటో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఏప్రిల్ 16లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో ఆదేశించింది. కంచ గచ్చిబౌలిలో ఉన్న భూములు ప్రభుత్వానివేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం తరపున సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు.
గురువారం జరిగిన విచారణలో ప్రభుత్వ తీరుపై జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణం విషయంలో రాజీ పడేది లేదని, ప్రైవేట్ ఫారెస్ట్ భూముల్లో చెట్లు నరికినా తీవ్రంగానే స్పందిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అభివృద్ధి పేరుతో అడవుల్ని నరకడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది.
సమర్ధించుకోవడంపై ఆగ్రహం..
కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రభుత్వ భూములైనా చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారో లేదో తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఏపీఐఐసీ ద్వారా భూముల తాకట్టు వ్యవహారంతో తమకు సంబంధం లేదు. ప్రభుత్వ భూముల్లోనైనా అభివృద్ధి చేసుకోవాలంటే తగిన అనుమతులు తీసుకోవాలని పర్యావరణ మదింపు జరగాలన్నారు.
సిటీలలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాల్సిందేనని దానికి మినహాయింపు లేదని, చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన జరిగితే బాధ్యులైన అధికారులను జైళ్లకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు. 1996లో సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. మే 15కు కేసు విచారణ వాయిదా పడింది.అప్పటి వరకు స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం ప్రకటించింది.
సుప్రీం కోర్టు జోక్యంతో అనూహ్య మలుపు..
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏప్రిల్ 3వ తేదీన సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. అంతకు ముందు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ సుప్రీం కోర్టు ధర్మాసానానికి నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వాన్ని అఫిడవిట్ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఉదయం సుప్రీం కోర్టులో అటవీ పర్యావరణ అంశాలకు సంబంధించిన గోదా వర్మన్ తిరుమల్ పాడ్ కేసులో సుప్రీం కోర్టుకు విచారణలో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ అడ్వకేట్ పరమేశ్వరన్.. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై పత్రికల్లో వస్తున్న కథనాలను జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.
పర్యావరణ విధ్వంసం, చెట్ల తొలగింపును కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సాయంత్రం మూడున్నరలోగా ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సాయంత్రానికి నివేదిక సుప్రీం కోర్టుకు చేరింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన ఫోటోలు, చెట్ల నరికివేతపై విద్యార్థుల ఆందోళనలు, చెట్ల నరికివేత ఫోటోలను పరిశీలించిన ధర్మాసనం తక్షణం చెట్లు నరకడాన్ని ఆపాలని ఆదేశించింది. ఒక్క చెట్టు నరికినా పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం హెచ్చరించింది.
తెలంగాణ ప్రభుత్వ కోర్టు ధిక్కరణ…
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవహారం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ కోర్టుకు వివరించారు. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదిక ధర్మాసనం ముందుకు వచ్చిన సమయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
అటవీ హక్కుల చట్టం 1980కు చేసిన సవరణల్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు 30రోజుల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మార్చి 4 సుప్రీం కోర్టు ఆదేశించింది. తెలంగాణలో మాత్రం కమిటీ ఏర్పాటు కాలేదని కమిటీ ఏర్పాటయ్యాక ఆర్నెల్లలో గోదావర్మన్ కేసును అనుసరించి అటవీ ప్రాంతాలను గుర్తించాల్సి ఉంటుందని కమిటీ ఏర్పాటు చేయక ముందే చెట్ల నరికివేత కుట్రలో భాగమని గోపాల్ శంకర్ నారాయణన్ పేర్కొన్నారు.
అది ప్రభుత్వ భూమేనంటోన్న సర్కారు..
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని ఇటీవల టీజీఐఐసీకి ప్రభుత్వం అప్పగించగా.. అక్కడ అభి వృద్ధి పనులకు ఆ సంస్థ శ్రీకారం చుట్టడంతో విద్యార్థులు ఆందోళనలు ప్రారంభించారు. 1975లో సెంట్రల్ యూనివర్శిటీకి కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ భూ యాజమాన్య హక్కులు వర్సిటీకి బదిలీ చేయలేదు.
రెవెన్యూ, అటవీ రికార్డుల ప్రకారం.. సర్వే నంబరు 25లోని భూమిని ఏనాడూ అటవీ భూమిగా వర్గీకరించలేదని ఆ భూమి ఎప్పుడూ యూనివర్శిటీలో అంత ర్భాగం కాదని ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఉన్న వివాదంపై హైకోర్టు తీర్పు అనంతరం.. ప్రభుత్వం ఆ భూమిని టీజీఐ ఐసీ అభ్యర్థన మేరకు ఆ సంస్థకు కేటాయించినట్టు పేర్కొంటోంది. ఈ వాదనను విద్యార్ధులతో పాటు విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యా దులు కూడా చేశారు. దీంతో కేంద్ర అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. గురు వారం సుప్రీంకోర్టు కూడా ఈ భూముల్లో చెట్ల నరి కివేత సహా అన్ని పనులను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది.
యూనివర్శిటీ పరిధిలోనే భూమి…
సెంట్రల్ యూనివర్శిటీ భూమి ఏర్పాటై ఐదు దశాబ్దాలు గడుస్తోంది. ఇప్పటికీ భూమిని ఆ విశ్వవిద్యాలయం పేరుతో బదలాయించలేదు. ప్రస్తుతం కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.
యూనివర్శిటీ ప్రారంభమైనప్పుడు 1975 లో సుమారు 2300 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం భూమి కేటాయించడంతో యూనివర్సిటీ పేరుతో రిజిస్ట్రేషన్ లేకపోయినా ఎలాంటి సమస్య ఉండదని భావించారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఆ తర్వాత కాల క్రమేణా విశ్వవిద్యాలయం చుట్టూ ఎనిమిది కిలోమీటర్ల మేర ప్రహరీ కూడా నిర్మించారు. వివాదాస్పద 400 ఎకరాలతో పాటు విశ్వవిద్యాలయం ఉన్న మొత్తం భూములన్నీ ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. 2004 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ ఉత్త ర్వుల మేరకు 534 ఎకరాల 24 కుంటలు శేరిలింగంపల్లి మండల కార్యాలయ అధికారికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి బదలాయింపు జరిగినట్లు రికార్డు చేశారు. ఇందులో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సంతకం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్