





Best Web Hosting Provider In India 2024

Arjun S/O Vyjayanthi Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూ అండ్ రేటింగ్.. కల్యాణ్ రామ్, విజయశాంతి మూవీ ఎలా ఉందంటే?
Arjun Son Of Vyjayanthi Movie Review In Telugu And Rating: అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఇవాళ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో నేటి అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: అర్జున్ సన్నాఫ్ వైజయంతి
నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, బబ్లూ పృథ్వీరాజ్, శ్రీరామ్, చరణ్ రాజ్ తదితరులు
రచన: హరికృష్ణ బండారి, ప్రదీప్ చిల్కూరి, శ్రీకాంత్ విస్సా
దర్శకత్వం: ప్రదీప్ చిల్కూరి
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: సి రామ్ ప్రసాద్
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు, ముప్పా వెంకట చౌదరి, కల్యాణ్ రామ్ (సహా-నిర్మాత)
విడుదల తేది: ఏప్రిల్ 18, 2025
Arjun Son Of Vyjayanthi Movie Review In Telugu: నందమూరి కల్యాణ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్ర పోషించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ సహా నిర్మాతగా, సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా సంయుక్తంగా నిర్మించారు.
కల్యాణ్ రామ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో బాలీవుడ్ పాపులర్ యాక్టర్స్ అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్ యాక్ట్ చేశారు. ఇవాళ (ఏప్రిల్ 18) థియేటర్లలో చాలా గ్రాండ్‌గా సూర్య సన్నాఫ్ వైజయంతి సినిమా విడుదలైంది. కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో నేటి అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
మాజీ ఐపీఎస్అధికారిణి వైజయంతి (విజయశాంతి) కుమారుడు అయిన అర్జున్ (నందమూరి కల్యాణ్ రామ్) విశాఖపట్నంలో గ్యాంగ్‌స్టర్‌గా అందరినీ శాసిస్తూ చక్రం తిప్పుతుంటాడు. కొడుకుపై అసహ్యంతో అర్జున్‌కు దూరంగా ఉంటుంది వైజయంతి. కానీ, అర్జున్ మాత్రం తల్లితో కలిసి ఉండేందుకు తహతహలాడుతుంటాడు. మరోవైపు వైజాగ్‌లో డ్రగ్స్ మాఫియా రన్ చేస్తున్న మహంకాళికి ఎదురు వెళ్తాడు.
ఈ క్రమంలో అర్జున్ ఎదుర్కున్న పరిస్థితులు ఏంటీ? అర్జున్‌ను తల్లి వైజయంతి ఎందుకు దూరం పెట్టింది? ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు? తల్లిని అర్జున్ కలిశాడా? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీని చూడాల్సిందే.
విశ్లేషణ:
అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఒక కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని ప్రచార చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. వీటికి మదర్ సెంటిమెంట్ యాడ్ చేసి తెరకెక్కించారు డైరెక్టర్ ప్రదీప్ చిల్కూరి. ఇప్పటివరకు ప్రయోగాత్మక సినిమాలతో అలరించిన కల్యాణ్ రామ్‌కు మాస్ ఇమేజ్ పెంచే ప్రయత్నంగా ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
అయితే, ఇలాంటి స్టోరీతో ఇదివరకు ఎన్నో సినిమాలు తెలుగులో, ఇతర ఇండస్ట్రీలోను వచ్చాయి. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్‌గా కొడుకు, అతన్ని ఇంట్లో వాళ్లు చీదరించుకోవడం, చివరికి కుమారుడి గొప్పతనం తెలిసి దగ్గరకు తీసుకోవడం అనేది రొటీన్ ఫార్ములానే. అయితే, కథలో కొత్తదనం లేకున్నా టేకింగ్ ఎంగేజింగ్‌గా ఉండాలి. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
తల్లికొడుకుల మధ్య డ్రామా
నందమూరి అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా కల్యాణ్ రామ్ మాస్ యాక్షన్‌ను చూపించారు. అలాంటి సీన్లతోనే కథను రాసుకున్నారు. ఇక వైజయంతి లాంటి పవర్‌ఫుల్ లేడి ఆఫీసర్ కొడుకు ప్రజల కోసం తల్లికే ఎదురు తిరిగే పరిస్థితి రావడం, అక్కడ తల్లీకొడుకుల మధ్య నడిచే డ్రామా బాగానే వర్కౌట్ అయింది.
సినిమా ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, వారి క్యారెక్టర్స్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గానే ఉంది. వైజయంతి కోణంలో తన కుమారుడి గురించి, ఎదురైన పరిస్థితుల గురించి ఒక్కొక్క విషయాన్ని చెబుతూ వెళతారు. అయితే, సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథ ఎటు కదలకుండా ఉంటుంది.
షాక్ ఇచ్చే క్లైమాక్స్
తల్లీకొడుకులు కలవడం అనే క్లైమాక్స్ ఆల్రెడీ ఊహించిన ప్రేక్షకుడుకి మధ్యలో వచ్చే నాటకీయత అంతా బోరింగ్‌గానే ఉంటుంది. క్లైమాక్స్ ఇదివరకే ఊహించిన ఆడియెన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని ఒక షాక్ ఫ్యాక్టర్‌తో రాసుకున్నారు డైరెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఈ సినిమాలో అదే క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయింది.
ఎమోషనల్‌గా తల్లి-కొడుకుల మధ్య బంధాన్ని మరింత చాటేలా క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఇలా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా, సెకండ్ హాఫ్ బోరింగ్‌గా సాగిన క్లైమాక్స్‌కు వచ్చేసరికి కట్టిపడేస్తుంది. చివరి 20 నిమిషాలు ఆసక్తికరంగా మలిచడంతో మంచి ఫీలింగ్‌తోనే థియేటర్ నుంచి బయటకు వస్తారు ప్రేక్షకులు.
కొంత ప్లస్-కాస్తా మైనస్
ఇక కొన్నిచోట్ల చాలా వరకు లాజిక్స్ కూడా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా లిబర్టీలో భాగంగా అది పక్కన పెట్టాల్సిందే. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టెంప్లేట్‌లో కథను నడిపించడం సినిమాకు కొంత ప్లస్, మరికొంత మైనస్ కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఇక సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ, అజనీష్ లోక్‌నాథ్ బీజీఎమ్ చాలా వరకు వర్కౌట్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక నందమూరి కల్యాణ్ రామ్ ఎప్పటిలాగే తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. మాస్, యాక్షన్ సీన్స్‌తోపాటు ఎమోషనల్ సన్నివేశాల్లో ఒదిగిపోయాడు.
ఫైనల్‌గా చెప్పాలంటే
డైలాగ్ డెలివరీ బాగుంది. కల్యాణ్ రామ్ తర్వాత విజయశాంతి తనదైన స్టైల్‌లో ఇరగదీశారు. ఆమెతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి. సాయి మంజ్రేకర్ గ్లామర్‌గా కనిపించింది. ఇతర యాక్టర్స్ అంతా బాగానే అలరించారు. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ కథ, ఆకట్టుకునే యాక్షన్, ఎమోషనల్ సీన్స్, షాకింగ్ క్లైమాక్స్ ట్విస్ట్‌తో ఓసారి లుక్కేసే మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి.
రేటింగ్: 2.75/5
సంబంధిత కథనం