మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం; రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలవబోతున్నారా?

Best Web Hosting Provider In India 2024


మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం; రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలవబోతున్నారా?

Sudarshan V HT Telugu

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న ఠాక్రే కజిన్స్.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలవబోతున్నారా? అన్న ప్రశ్న రాష్ట రాజకీయ వర్గాల్లో ఇటీవల తరచుగా వినిపిస్తోంది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందుకు కారణమయ్యాయి.

శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే

2005లో రాజకీయ విబేధాలతో విడిపోయిన ఠాక్రే కుటుంబం చివరకు తమ విభేదాలను పక్కన పెట్టనున్నారా? రాజకీయంగా ఠాక్రే కుటుంబానికి మునపటి ప్రజాదరణ సంపాదించడానికి ఒక్కటవబోతున్నారా? వారి మెగా రీయూనియన్ గురించి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

మరాఠీ అస్తిత్వానికి, సంస్కృతికి ముప్పు పొంచి ఉందన్న వాదనల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ థాక్రే ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వేరు వేరు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఇటీవలి రోజులలో వివిధ సందర్భాల్లో మాట్లాడిన శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే తమ ఉమ్మడి లక్ష్యాన్ని వెల్లడించారు. తమ విబేధాల కన్నా మహారాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని వారు స్పష్టం చేశారు. అందుకోసం తమ మధ్య విబేధాలను పక్కన పెట్టడానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు.

మా గొడవలు చిన్నవి: రాజ్ ఠాక్రే

నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ తో ఇటీవల పాడ్ కాస్ట్ లో రాజ్ ఠాక్రే తన ఉద్దేశాన్ని వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి పనిచేయడంపై మాట్లాడారు. తనకు, ఉద్ధవ్ కు మధ్య ఉన్న విబేధాల కన్నా మహారాష్ట్ర ప్రయోజనాలే పెద్దవని ఆయన అన్నారు. ‘‘ఉద్ధవ్, నాకు మధ్య వివాదాలు, గొడవలు చిన్నవి. మహారాష్ట్ర అన్నింటికంటే చాలా పెద్దది. ఈ విభేదాలు మహారాష్ట్ర, మరాఠీ ప్రజల మనుగడకు అడ్డంకిగా రుజువవుతున్నాయి. కలిసి రావడం కష్టమేమీ కాదు. అది సంకల్పానికి సంబంధించిన విషయం. రాజకీయ పార్టీలకు అతీతంగా మరాఠీ ప్రజలంతా ఏకమై ఒకే పార్టీని ఏర్పాటు చేయాలి’ అని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ఇలాంటి విషయాలకు తన అహాన్ని అడ్డు రానివ్వను అన్నారు.

వివాదాలను పక్కన పెట్టడానికి సిద్ధమే: ఉద్ధవ్ ఠాక్రేరాజ్ థాక్రేతో సయోధ్య విషయంలో ఉద్ధవ్ ఠాక్రే షరతులతో కూడిన వైఖరిని కనబర్చారు. ‘‘చిన్నచిన్న వివాదాలను పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మరాఠీ ప్రజలందరూ ఏకం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఒక షరతు ఉంది. పరిశ్రమలను గుజరాత్ కు తరలిస్తున్నారని పార్లమెంటులో ఎత్తిచూపినప్పుడు, అప్పుడు మనం ఐక్యంగా ఉంటే, మహారాష్ట్ర కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్లం. ఒక రోజు వారికి మద్దతివ్వడం, మరుసటి రోజు వ్యతిరేకించడం, ఆ తర్వాత మళ్లీ రాజీపడటం వంటివి సరికాదు’’ అని భారతీయ కామ్ గార్ సేన ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్రకు, దాని ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులను తాను స్వాగతించబోనని ఆయన స్పష్టం చేశారు. ముందు ఈ విషయం స్పష్టం కావాలని, ఆ తర్వాత మహారాష్ట్ర కోసం కలిసి పని చేద్దామని అన్నారు.

హిందీని తప్పని సరి చేయడంపై..

ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడో భాషగా చేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు మళ్లీ కలిసేందుకు అవకాశం ఏర్పడింది. హిందీని తప్పని సరి చేసే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఇది అమలు కాకుండా చూస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఎంఎన్ఎస్ సహించదని స్పష్టం చేశారు. ప్రతిదీ ‘హిందీ-ఫై’ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రస్తుత ప్రయత్నాలను ఈ రాష్ట్రంలో విజయవంతం కానివ్వం’ అని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ‘హిందీ జాతీయ భాష కాదు. ఇది దేశంలోని ఇతర భాషల మాదిరిగానే రాష్ట్ర భాష. మొదటి నుంచి మహారాష్ట్రలో ఎందుకు బోధించాలి? మీ త్రిభాషా సూత్రం ఏదైనప్పటికీ, దాన్ని ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం చేయండి, దాన్ని విద్యకు తీసుకురావద్దు’ అని హితవు పలికారు.

హిందీని వ్యతిరేకిస్తాం..

హిందీని రుద్దడంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయడాన్ని తమ పార్టీ అనుమతించదని శివసేన నేత శనివారం స్పష్టం చేశారు. ‘‘మీరు (మమ్మల్ని) ఆప్యాయంగా అడిగితే మేం అన్నీ చేస్తాం, కానీ మీరు ఏదైనా రుద్దితే మేం వ్యతిరేకిస్తాం’’ అన్నారు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link