




Best Web Hosting Provider In India 2024
కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రమాదానికి పరిహారం అడిగారని పనిలోకి రావొద్దంటూ ఆంక్షలు, ఓ వర్గంపై సామాజిక బహిష్కరణ…
కాకినాడ జిల్లా పిఠాపురంలో సామాజిక బహిష్కరణ ఆరోపణలు కలకలం రేపాయి. పిఠాపురం నియోజక వర్గంలోని మల్లం గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య తలెత్తిన విభేదాలతో ఓ వర్గం వారిపై సామాజిక బహిష్కరణ విధించడంపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సామాజిక బహిష్కరణ వార్తలు కలకలం రేపాయి. పిఠాపురం నియోజక వర్గంలో ఉన్న మల్లం గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య తలెత్తిన వివాదాలతో ఓ వర్గంపై ఆంక్షలు విధించినట్టు ప్రచారం జరిగింది. గ్రామంలో కొద్ది రోజుల క్రితం విద్యుదాఘాతంతో జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది.
పిఠాపురం రూరల్ పరిధిలోని మల్లాం గ్రామంలో జరిగిన ప్రమాదంలో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు ఆందోళనకు దిగడంతో యజమాని రెండున్నర లక్షల పరిహారం చెల్లించాడు. పనిలో జరిగిన ప్రమాదానికి పరిహారం చెల్లించాల్సి రావడంతో, మృతుడి సామాజిక వర్గం మొత్తాన్ని పనిలోకి పిలవకూడదని నిర్ణయించుకోవడంతో వివాదం తలెత్తిందని జిల్లా అధికారులు తెలిపారు.
గ్రామంలో ఓ వర్గానికి చెందిన వారికి హోటళ్లలో టీ, కాఫీ, టిఫిన్ ఇవ్వొద్దని, నిత్యావసరాలు విక్రయించొద్దని ఆంక్షలు విధించారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు.
మల్లాం గ్రామానికి చెందిన జల్లిబాబు ఇంట్లో అదే గ్రామానికి పల్లపు సురేష్ కరెంటు పని చేస్తూ ఏప్రిల్ 16న విద్యుత్ షాక్ గురై చనిపోయాడు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాని అతని బంధువులు 17వ తేదీన ఆందోళన నిర్వహించారు.
ఈ క్రమంలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి కొంత నగదును మృతుడి కుటుంబానికి పరిహారంగా ఇప్పించారు. ఈ ఘటన తర్వాత ఓ వర్గాన్ని పనుల్లోకి పిలవకూడదని గ్రామంలో నిర్ణయించారు. తరచూ తమను ఇబ్బంది పెడుతున్న వారిని సామాజికంగా బహిష్కరించాలని మరో వర్గం పెద్దలు నిర్ణయించారు.
దీంతో తమను వ్యవసాయ పనులకు రానివ్వడం లేదని, ఊళ్లో ఎవరూ పాలు పోయడం లేదని, హోటళ్లలో ఆహార పదార్ధాలు విక్రయించడం లేదని బాధితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు.
మల్లం గ్రామంలో గత ఐదేళ్లలో ప్రమాదాల్లో నలుగురు చనిపోయారని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం తమకు ఇబ్బందిగా మారిందని మరో వర్గం చెబుతోంది. తమ పొలాల్లో, వ్యాపారాల్లో పనిలోకి అనుమతిస్తే ప్రమాదాలు జరిగినపుడు పరిహారం చెల్లించాల్సి రావడం ఇబ్బందిగా మారిందని, దీంతో వారిని పనిలోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు అధికారులకు వివరించారు.
సామాజిక బహిష్కరణ ఫిర్యాదులపై పిఠాపురం ఆర్డీఓ మల్లిబాబు, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. తమ వద్ద చేపలు కొనకూడదని గ్రామంలో ఆంక్షలు విధించారని, హోటళ్లలో ఆహార పదార్ధాలు విక్రయించడం లేదని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. పాల కేంద్రంలో పాలు కూడా ఇవ్వడం లేదని బాధిత వర్గం ఫిర్యాదు చేసింది. దీంతో సామాజిక బహిష్కరణకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని రెవిన్యూ అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్