





Best Web Hosting Provider In India 2024

ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- దరఖాస్తు చేసే ముందు తెలుసుకోవాల్సిన 20 ముఖ్యమైన అంశాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. మార్పు చేర్పులకు అవకాశం ఉండదని, ఆప్షన్ మార్పునకు సైతం ఎడిట్ ఆప్షన్ ఉందని స్పష్టం చేసింది.
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. అయితే అభ్యర్థుల దరఖాస్తు చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, అభ్యర్థులకు తరచూ తలెత్తే ప్రశ్నలు తెలుసుకుందాం.
1. ప్రస్తుత మెగా డీఎస్సీలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తున్నారు?
- మెగా డీఎస్సీ ద్వా రా 16,347 ఉపాధ్యాయ పోస్టులు నుభర్తీ చేస్తున్నారు.
2. ఈ పోస్తులు ఏ ఏ యాజమాన్యాలలో ఉంటాయి?
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫే ర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ , జువనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖాళీలతో పాటు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో ఖాళీలను భర్తీచేస్తారు.
3. యాజమాన్యాల వారీగా పోస్టులు వివరాలు
- ఎంపీ, జెడ్పీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ -13192
- ఏపీఎంఎస్ – 286
- ఏపీఆర్ఈఐఎస్ -190
- ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ -439
- బీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ -170
- టీడబ్ల్యూ ఆశ్రం -881
- టీడబ్ల్యూ గురుకులం -1143
- వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ – 31
- జువనైల్ వెల్ఫేర్ -15
- మొత్తం పోస్టులు – 16,347
4.మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్తులు వివరాలు
- సెకండరీ గ్రేడ్ టీచర్లు(సాధారణ పాఠశాలలు)
- స్కూ ల్ అసిస్టెంట్ టీచర్లు (సాధారణ పాఠశాలలు)
- సెకండరీ గ్రేడ్ టీచర్లు (స్పెషల్ ఎడ్యుకేషన్-ప్రత్యేక పాఠశాలలు)
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (స్పెషల్ ఎడ్యుకేషన్ -ప్రత్యేక పాఠశాలలు)
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (స్పెషల్ ఎడ్యుకేషన్ -ప్రత్యేక పాఠశాలలు)
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (సొసైటీ పాఠశాలలు)
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (సొసైటీ పాఠశాలలు)
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు(సొసైటీ పాఠశాలలు)
- ఫిజికల్ డైరెక్టర్స్(సొసైటీ పాఠశాలలు)
- ప్రిన్సిపాల్ (సొసైటీ పాఠశాలలు)
5. మెగా డీఎస్సీ లో అప్లికేషన్ భర్తీలో జాగ్రత్తలు
మెగా డీఎస్సీ అప్లికేషన్ లో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం, రెండో విభాగంలో విద్యా అర్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు, మూడో విభాగంలో ఫీజులు చెల్లింపు వివరాలు ఉంటాయి. ఒకటి రెండు విభాగాల్లోని అంశాలను అభ్యర్థులు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సబ్మిట్ చేయాలి. మూడు విభాగాలలోని వివరాలను నింపిన తర్వాత ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కొక్క పోస్టుకు రూ.750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడో విభాగంలో ఎలాంటి సవరణలకు అవకాశం లేదు.
6. గత డీఎస్సీలో ఫీజు చెల్లించిన వారు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందా?
గత డీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయదలచినట్లయితే ఆ పోస్టులకు మాత్రమే పోస్టుకు రూ.750 చొప్పున అదనంగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
7. దరఖాస్తు నింపడానికి ఎప్పటి వరకు అవకాశం ఉంది?
మెగా డీఎస్సీకి 20-04-2025 నుండి 15-05-2025 వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
8. మెగా డీఎస్సీ పూర్తి వివరాలు ఎలా తెలుసుకోవచ్చు?
మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలను https://cse.ap.gov.in / లేదా https://apdsc.apcfss.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్స్ లో సిలబస్, ఇతర సమాచారం అందిస్తారు.
9. మెగా డీఎస్సీ రాయాలంటే టెట్ లో కనీస అర్హత మార్కులు ఎన్ని?
ఓసీ అభ్యర్థులకు 60% ( 90 మార్కులు), బీసీ అభ్యర్థులకు 50% (75 మార్కులు) , ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు 40% (60 మార్కులు) కనీస అర్హతలు మార్కులుగా నిర్ణయించారు.
10. అభ్యర్థి తన సర్టిఫికెట్లను ఎప్పుడు అప్లోడ్ చేయాలి?
అభ్యర్థి దరఖాస్తును నింపిన తర్వాత తప్పనిసరిగా తన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి.
11. మెగా డీఎస్సీలో రిజర్వేషన్లు ఎలా అమలుచేస్తారు?
జీవో 77 సాధారణ పరిపాలన శాఖ ఇచ్చే తదుపరి ఉత్తర్వులను అనుసరించి వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలుపరుస్తారు. హారిజాంటల్ రిజర్వేషన్లలో 4 విభాగాలకు ( woman , PwBD , Ex – Serviceman, Sports ) రోస్టర్ పాయింట్లు ముందుగా కేటాయించరు. అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి అపోహలకు లోనుకానవసరంలేదు.
12. హారిజాంటల్ రిజర్వేషన్ లో మహిళలకు రిజర్వేషన్ ఏవిధంగా అమలుచేస్తారు?
100 సైకిల్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలుచేస్తారు. జీఓ 77 ఉత్తర్వుల ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ ( woman , PwBD , Ex-Serviceman , Sports ) విభాగాలకు రోస్టర్ పాయింట్లను ముందుగా నిర్థారించకుండా అమలు చేస్తారు.
13. దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్తులకు ఆప్షన్ ఎంపిక ఎలా?
అభ్యర్థులు తమ విద్యార్హతలు బట్టి ఏయే పోస్టులకు అర్హులవుతారో సాఫ్ట్ వేర్ తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ప్రాధాన్య క్రమాన్ని ఎంచుకున్న తర్వాత మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. .
14. మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇక ఉద్యోగం రాదా?
అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఎంపిక కాకపోతే అతని పేరు రెండో ఆప్షన్ కు బదిలీ అవుతుంది. ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది. ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్ కు ఎంపికైతే మిగిలిన ఆప్షన్లు రద్దు అవుతాయి. ఒక పోస్టుకు ఎంపికైనా తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టు మార్చుకోవడానికి అవకాశం లేదు.
15. మెగా డీఎస్సీ వయోపరిమితి?
01-07-2024 నాటికి 18 సంవత్సరాలు కన్నా తక్కువ, 44 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండరాదు. రిజర్వుడు కేటగిరి అభ్యర్థుల గరిష్ట వయస్సు 49 సంవత్సరాలు, దివ్యాంగులకు గరిష్ట వయస్సు 54 ఏళ్లు. ఎక్స్ సర్వీస్ మెన్ విభాగంలో నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
16 షెడ్యూల్డు కులాల వర్గీకరణను ఎలా అమలుచేస్తారు ?
రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు విడుదల చేసిన ఉత్వరులు, సాధారణ పరిపాలన శాఖ నియమావళి ఆధారంగా గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్-3 విభాగాలుగా నిర్ధారిత శాతం మేరకు షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ అమలు చేస్తారు.
17. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎలా అమలుచేస్తారు?
రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని అనుసరించి అభ్యర్థుల అర్హతల మేరకు 3 % స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
18. అభ్యర్థులు తమకు సందేహాల గురించి ఎవరిని సంప్రదించాలి ?
డీఎస్సీ దరఖాస్తులు, హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాలు తదితర సహాయం కోసం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు.
19. ఏయే జిల్లాల్లో మెగా డీఎస్సీ పోస్టులు ఎక్కువగా వున్నాయి?
మెగా డీఎస్సీలో ప్రకటించిన 16347 పోస్టులలో 2678 పోస్టులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా 543 పోస్టులతో చివరి స్థానంలో ఉంది.
20. డీఎస్సీ-2025 సిలబస్ గురించి ఎలా తెలుసుకోవాలి?
అభ్యర్థుల సౌకర్యం కోసం గత సంవత్సరం నవంబరు నెలలోనే పోస్టుల వారీగా సిలబస్, ప్రశ్నపత్రం మార్కుల స్వరూపం పూర్తి వివరాలతో కూడిన సమాచారం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
సంబంధిత కథనం
టాపిక్