





Best Web Hosting Provider In India 2024

రేపు సిట్ విచారణకు హాజరవుతా, ఆడియో విడుదల చేసిన రాజ్ కసిరెడ్డి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి మరోసారి ఆడియో విడుదల చేశారు. మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి(కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి) మరో ఆడియో విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య సిట్ విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో వాదనలకు జరుగుతున్నాయని, వీటికి సమయం పట్టేలా ఉందని, అందువల్ల సిట్ విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాజ్ కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. అయితే మధ్యంతర రక్షణ కల్పించాలంటూ రాజ్ కసిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను మరో వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తాను సిట్ విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.
విజయసాయిరెడ్డి బండారం బయటపెడతా-రాజ్ కసిరెడ్డి
రెండ్రోజుల క్రితం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై రాజ్ కసిరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి రెడ్డి మొత్తం బండారం బయటపెడతానన్నారు. సిట్ విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే పోలీసులకు సహకరిస్తానన్నారు. అయితే పూర్తి సమాచారం లేకుండా ఒక పక్క వార్తలు రాయొద్దంటూ మీడియాను కోరారు.
మద్యం కేసులో సిట్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించానని రాజ్ కసిరెడ్డి తెలిపారు. మార్చిలో సిట్ అధికారులు తన ఇంటికి వచ్చారన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు తన అమ్మకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశానని, కోర్టుల్లో ప్రక్రియ ముగిసిన తర్వాత సిట్ విచారణకు హాజరవుతానని గత ఆడియోలో పేర్కొన్నారు. అయితే తాజా ఆడియోలో రేపు సిట్ విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.
ఇప్పటికే మూడు సార్లు సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయినా ఆయన సిట్ విచారణకు హాజరు కాలేదు. పోలీసులు తన ఇంటికి వచ్చిన సమయంలో వారికి అందుబాటులో లేకుండా పరారయ్యారని వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయన ఇళ్లలో సోదాలు చేసి తల్లిదండ్రులు, బంధువులకు నోటీసులు ఇచ్చారు. అయితే ముందస్తు బెయిల్ పై కోర్టుల్లో అనుకూల తీర్పు రాకపోవడంతో విచారణకు హాజరుకావాలని రాజ్ కసిరెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సంబంధిత కథనం
టాపిక్