





Best Web Hosting Provider In India 2024

కరివేపాకు వెల్లుల్లి నిల్వ పచ్చడి రెసిపీ, రైస్ ఇడ్లీ దోశెల్లోకి అద్భుతంగా ఉంటుంది
తెలుగిళ్లల్లో పచ్చళ్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ఎన్ని కూరలు ఉన్నా కూడా పక్కన పచ్చడి ఉండాల్సిందే. ఇక్కడ మేము వెరైటీగా కరివేపాకు వెల్లుల్లి నిల్వ పచ్చడి రెసిపీ ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు.
వేసవిలోనే నిల్వ పచ్చళ్లు అధికంగా చేస్తారు. ఏడాదిలో ఒకసారి చేసుకుంటే ఆ ఏడాదంతా వాడుకోవచ్చు. కొన్ని నిల్వ పచ్చళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఒకటి కరివేపాకు వెల్లుల్లి నిల్వ పచ్చడి. ఇది చేయడం చాలా సులువు. అంతేకాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పచ్చడిని ఒకసారి చేసుకుంటే రెండు మూడు నెలల పాటూ తినవచ్చు. ఇక్కడ మేము దీని రెసిపీ ఇచ్చాము.
కరివేపాకు వెల్లుల్లి నిల్వ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
కరివేపాకులు – రెండు కప్పులు
వెల్లుల్లి రెబ్బలు – అర కప్పు
ఆవాలు – ఒక స్పూను
పసుపు – అర స్పూన్
ఎండు మిర్చి – పది
చింత పండు – ఉసిరికాయ సైజులో
జీలకర్ర – ఒక స్పూను
మెంతులు – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
బెల్లం తురుము – ఒక స్పూను
నీళ్లు – తగినన్ని
నూనె – సరిపడినంత
ఇంగువ – చిటికెడు
పచ్చి శెనగపప్పు – ఒక స్పూను
కరివేపాకు వెల్లుల్లి పచ్చడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి వేయించాలి.
2. అందులో కరివేపాకులు కూడా వేసి బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
3. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన కరివేపాకులు, ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, చింతపండు వేసి రుబ్బుకోవాలి.
5. తగినంత నీరు, బెల్లం తురుము, ఉప్పు కూడా వేసి బాగా రుబ్బుకోవాలి.
6. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి.
7. వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి చిన్న ముక్కలుగా తరగాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
9. ఆ నూనెలో ఆవాలు, వెల్లుల్లి తరుగు, పచ్చి శెనగపప్పు వేసి బాగా వేయించాలి.
10. అలాగే ఇంగువ, పసుపు వేసి బాగా కలపాలి.
11. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కరివేపాకు పేస్టులో వేసి బాగా కలుపుకోవాలి.
12. స్పూనుతో బాగా కలిపి గాలి చొరబడని కంటైనర్లో వేసుకోవాలి.
13. దీన్ని వేడి అన్నంతో, ఇడ్లీతో, దోశెతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
కరివేపాకు మనం ప్రతిరోజూ ఉపయోగించే అతి ముఖ్యమైన ఆహారాలలో ఒకటి. అయితే కూరల్లో కనిపిస్తే మాత్రం తీసి బయటపడేస్తాం. కానీ కరివేపాకు శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది. కరివేపాకు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. కాలేయాన్ని కాపాడుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది.
అలాగే ఇందులో వాడిన వెల్లుల్లి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఉపయోగిస్తారు.
సంబంధిత కథనం