





Best Web Hosting Provider In India 2024

Pravasthi vs Singer Sunitha: గెలిస్తే కాళ్లు మొక్కి.. ఓడితే తిట్టడం సరికాదు.. ఆచితూచి మాట్లాడు: ప్రవస్తికి సునీత కౌంటర్
Pravasthi vs Singer Sunitha: సింగర్ ప్రవస్తి తనపై చేసిన ఆరోపణలపై సింగర్ సునీత చాలా ఘాటుగా స్పందించింది. ఆమెకు గట్టి కౌంటరే ఇచ్చింది. గెలిస్తే కాళ్లు మొక్కి.. ఓడితే తిట్టడం సరికాదంటూ ఆమెకు నచ్చజెప్పింది.
Pravasthi vs Singer Sunitha: పాడుతా తీయగా ప్రోగ్రామ్ కంటెస్టెంట్ ప్రవస్తి.. ఆ షో జడ్జి అయిన సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ పై చేసిన ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలుసు కదా. వీటిపై తాజాగా సునీత స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో ఓ సుదీర్ఘ వీడియో పోస్ట్ చేసింది. అందులో ప్రవస్తికి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. గెలిస్తే కాళ్లు మొక్కి, ఓడినప్పుడు తిట్టడం సరికాదని ఆమెకు క్లాస్ పీకింది.
ఒళ్లో కూచోబెట్టుకొని ముద్దు చేస్తే బాగుండదు
సింగర్ ప్రవస్తికి సునీత తన వీడియోలో ఘాటు రిప్లై ఇచ్చింది. తనని చిన్నతనం నుంచి బాలుగారు, జానకిగారు, చిత్రమ్మ, తను ఒళ్లో కూర్చోబెట్టుకొని పాటలు నేర్పామని, ఇప్పుడు 19 ఏళ్ల వయసులో ఆమెను ఒళ్లో కూర్చోబెట్టుకుంటే బాగుండదు కదా అని ఆమె అన్నది. ఈటీవీ, పాడుతా తీయగా, జ్ఞాపిక ప్రొడక్షన్స్ అంటూ నిన్నంతా వార్తలు రావడం, సునీత అంటూ ఆమె తన పేరు తీయడం వల్లే తాను ఈ వీడియో చేస్తున్నట్లు ఆమె చెప్పింది.
“నువ్వు చిన్నప్పుడు ముద్దుగా పాడేదానివి. అలాగే నిలకడగా 19 ఏళ్ల వయసులోనూ పాడి ఉంటే సంతోషించే వ్యక్తుల్లో నేనే మొదటిదాన్ని అవుతాను. మా ప్రవస్తి, మా గాయత్రి, మా ప్రణతి అని చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్లం. అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్డుమీదికెళ్లి ఇంత మందితో మాట్లాడి మాపై చర్చించేస్థాయికి ఎదిగిందంటే నాకు కాస్త అసంతృప్తిగా కూడా ఉంది. కానీ అది నీకు అవసరం లేదు.నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావ్” అని సునీత చెప్పింది.
చెబితే అన్నీ చెప్పు: సునీత
“ప్రవస్తి.. నువ్వు పాడుతా తీయగానే కాదు మిగతా ఛానెల్స్ లోనూ రియాల్టీ షోలలో పోటీ చేశావు. నీకు ప్రాసెస్ తెలియదా. ప్రతి ఛానెల్ కు కొన్ని పాటలపైనా హక్కులు ఉంటాయి. చెబితే అన్ని విషయాలు చెప్పు. ప్రాసెస్ గురించి చెప్పు.. ఆ ప్రాసెస్ లో ఛానెల్ కు ఉండే పరిమితుల గురించి కూడా మాట్లాడు.
సింగర్స్ ఇచ్చే పాటల లిస్టులో ఛానెల్ కు అనుమతి ఉండే పాటలనే పాడాలని మేము నచ్చజెప్తాం. నేను ఏ పాట ఇచ్చినా వాళ్లు వద్దంటున్నారు అని ఆమె చెబుతోంది. కారణం ఇదీ అని మీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను” అని సునీత చెప్పింది.
నిన్నేమీ టార్గెట్ చేయలేదు
“నిన్ను కొరకొరా చూశానని అన్నావు. నేను, కీరవాణిగారు, చంద్రబోస్ గారు నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తాం.. అసలు ఆ ఆలోచన కూడా నేను చేయలేకపోతున్నాను. క్లాసికల్ రౌండ్లో నేనే నీ దగ్గరికి వచ్చి నువ్వు అప్‌సెట్ అయి ఉంటే నువ్వు ఎలా పాడుతున్నావో మాకు తెలుసు. నువ్వు అప్‌సెట్ కావాల్సిన అవసరం లేదని అందరు సింగర్ల ముందే చెప్పాను” అని సునీత్ చెప్పింది.
అది నీ తప్పే
ఇక కీరవాణిపై ప్రవస్తి చేసిన ఆరోపణలపైనా సునీత స్పందించింది. ఆయన మ్యూజిక్ డే సందర్భంగా తాను పెళ్లిళ్లలో ఎందుకు పాడలేదో చెప్పాడని, అంతే తప్ప తననేమీ అవమానించలేదని సునీత తెలిపింది. ప్రవస్తికి ఉన్న ఆత్మన్యూనతా భావంతో తాను ఆ మాటలను ఓన్ చేసుకోవడం తప్పు కదా అని సునీత ప్రశ్నించింది. తాను కూడా ఇప్పటికీ పెళ్లిళ్లలో పాడతానని, టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన అనిరుధ్ కూడా ఆ పని చేస్తాడని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పింది.
ఒకరు ఓడిపోతే చూసి ఆనందించే మనస్తత్వం తనది కాదని సునీత స్పష్టం చేసింది. తాను ఎన్నో కష్టాలు అనుభవించానని, తన తోటి కళాకారులు ఎవరూ అన్ని కష్టాలు అనుభవించలేదని ఆమె వెల్లడించింది. తాను తెప్పించిన పేస్ట్రీ ప్రవస్తి కూడా తిన్నదని, మరి తాను ఓడిపోయినందుకు సునీత పార్టీ ఇచ్చిందని ఎలా చెబుతుందని ప్రశ్నించింది. గెలుపోటములు సాధారణమని, గెలిచనప్పుడు కాళ్లు మొక్కి, ఓడినప్పుడు ఇలా తిట్టడం సరికాదని హితవు పలికింది.
ప్రవస్తి ఏమన్నదంటే?
పాడుతా తీయగా కంటెస్టెంట్ అయిన ప్రవస్తి టాప్ 12 నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఆ షో జడ్జీలైన సునీత, కీరవాణి, చంద్రబోష్ లపై తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా సింగర్ సునీత తనను టార్గెట్ చేసిందని, గాయత్రితోపాటు పలువురు ఇతర సింగర్లనే ఆమె సపోర్ట్ చేస్తుందని ఆరోపించింది. ఆమె అందంగా కనిపించినా ఆమె ప్రవర్తన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది.
తాను ఎప్పుడు పాడటానికి వెళ్లినా ఆమె కొరకొరగా చూస్తుందని, ముఖం అదోలా పెడుతుందని కూడా చెప్పింది. తనకు హైపిచ్ సరిగా ఉండదని కీరవాణితో చెప్పడం తాను విన్నానని కూడా వెల్లడించింది. ప్రవస్తి ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో సింగర్ సునీత దీనిపై సుదీర్ఘ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.