





Best Web Hosting Provider In India 2024

అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా.. ఈ మలయాళం మూవీ మిస్ కావద్దు.. ఇదో రియల్ క్రిమినల్ స్టోరీ
మంచి ట్విస్టులు, థ్రిల్ అందించే క్రైమ్ థ్రిల్లర్ సినిమా కోసం చూస్తున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే మలయాళం మూవీ కచ్చితంగా చూడండి. దుల్కర్ సల్మాన్, శోభిత ధూళిపాళ్ల నటించిన మూవీ ఇది. ఇదో రియల్ స్టోరీ కావడం విశేషం.
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా అంటే అందులోని ట్విస్టులు, థ్రిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఇండస్ట్రీ మేకర్స్ ఇవి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు చెప్పబోయే క్రైమ్ థ్రిల్లర్ మూవీది మరో లెవెల్. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో కూడా సినిమా తీస్తారా అనిపించేలా ఇది సాగుతుంది. ఆ మూవీ పేరు కురుప్ (Kurup).
కురుప్ మూవీ స్టోరీ ఏంటంటే?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, శోభిత ధూళిపాళ్ల నటించిన మూవీ కురుప్. 2021లో థియేటర్లలో రిలీజైంది. ఐఎండీబీలో 7 రేటింగ్ సాధించింది. రూ.35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. రూ.78 కోట్లు వసూలు చేసింది. శ్రీనాథ్ రాజేంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓ రియల్ స్టోరీ. కేరళ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సుకుమార కురుప్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఓ బయోగ్రఫికల్ పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సంపాదించి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశపడే ఓ క్రిమినల్ గోపీకృష్ణ కురుప్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలతోపాటు ఆయుధాలను అడ్డదారిలో విక్రయించడం వరకు ఎన్నో నేరాల్లో నిందితుడిగా ఉన్న అతడు.. కేరళ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతాడు.
అతని జీవితాన్ని కృష్ణదాస్ అనే ఓ రిటైర్ట్ పోలీస్ ఆఫీసర్ కోణంలో చూపించే ప్రయత్నం ఈ సినిమాలో చేశారు. అతని రిటైర్మెంట్ రోజు కురుప్ కు సంబంధించిన ఫైల్ ను కృష్ణదాస్ సబార్డినేట్ చూస్తాడు. అక్కడ మొదలయ్యే కథ.. కురుప్ ఎలా పోలీసులను బోల్తా కొట్టించి.. ఇండియా నుంచి పర్షియా వరకు వివిధ నేరాలకు పాల్పడ్డాడో చూపిస్తూ వెళ్తుంది.
ఆ కురుప్ స్టోరీయే ఈ మూవీ
40 ఏళ్లుగా కేరళ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార కురుప్ అలియాస్ గోపాలకృష్ణ కురుప్ కథే ఈ కురుప్ మూవీ. 1984లో అతడు మరో ముగ్గురితో కలిసి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చేసే హత్యతో కేరళ పోలీసుల దృష్టిలో పడతాడు.
ఈ కేసులో మిగిలిన ముగ్గురు పోలీసులకు చిక్కినా.. కురుప్ మాత్రం తప్పించుకుంటాడు. అతడు పోలీసులను ఎలా బోల్తా కొట్టించాడు.. ఎక్కడెక్కడ మారు పేర్లతో తిరిగాడు.. అనే విషయాలను ఈ కురుప్ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.
కురుప్ ఎలా ఉందంటే?
ఈ మూవీ ఫస్టాఫ్ చూస్తున్నంత సేపూ కాస్త గందరగోళంగానే అనిపిస్తుంది. అసలు ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. కానీ కాస్త ఓపిగ్గా సెకండాఫ్ వరకు వేచి చూస్తూ ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. సుకుమార కురుప్ నేరాల పరంపర ఎలా సాగిందో తెలుస్తుంది.
ఈ సినిమాలో ఆ కురుప్ పాత్రలో దుల్కర్ సల్మాన్, అతని భార్య శారద పాత్రలో శోభిత నటించారు. దుల్కర్ చాలా సులువుగా ఈ పాత్రలో జీవించేశాడు. శోభిత స్క్రీన్ టైమ్ తక్కువే అని చెప్పాలి. అయితే ఈ మూవీలో వచ్చే ట్విస్టులు మంచి థ్రిల్ పంచుతాయి.
కురుప్ ఎక్కడ చూడాలి?
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కురుప్ నవంబర్ 12, 2021లో థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ కావద్దు.
సంబంధిత కథనం