



Best Web Hosting Provider In India 2024

ఎండల దాటికి ఉమ్మడి ఆదిలాబాద్ ఉక్కిరిబిక్కిరి…! గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. దీంతో ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగిపోయింది. నిప్పుల కొలిమిలా మారిపోయింది. బుధవారం గరిష్టంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లాలో ఉదయం నుంచే భానుడు…. భగభగలా మండిపోతున్నాడు.
దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో సైతం మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మూడు రోజులుగా అన్ని మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేందుకు కూడా జనాలు జంకుతున్నారు. దాహం తీర్చుకునేందుకు చల్లని శీతల పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. కొంత మంది వడదెబ్బకు గురై ఆసుపత్రుల పాలవుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ లోని పలు ప్రాంతాలో ఐదు మంది వడ దెబ్బతో మృతి చెందినట్లు తెలిసింది.
ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలను విపరీతంగా వాడుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తల ను పాటిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావడం లేదు.
మే నెలలో ఎలాగో…?
ఏప్రిల్ నెలలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఉంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రానున్న మే మాసంలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలో జనాలు ఉన్నారు. రోహిణి కార్తె నాటికి పరిస్థితి మరింత మారిపోయే అవకాశం ఉంది.
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి….
వేసవిలో వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. తలనొప్పి, వికారం, కళ్లు తిరగడం, వాంతులు చేసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిచాలని హెచ్చరిస్తున్నారు. ప్రతీరోజూ 5 నుంచి 6 లీటర్ల నీటిని తాగాలని, శీతల పానీయాలకు బదులు మజ్జిగ, నిమ్మ, పండ్ల రసాలు తాగడం ఉత్తమమని అంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఎండలో ప్రయాణం చేయకూడదని సూచిస్తున్నారు.
(రిపోర్టింగ్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.)
సంబంధిత కథనం
టాపిక్