




Best Web Hosting Provider In India 2024

ఏపీలో భానుడి భగభగలు – ఉత్తరాంధ్రకు 2 రోజులపాటు వర్ష సూచన…!
రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. పలుచోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది.
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం దాటితే బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఇవాళ నంద్యాల జిల్లా దోర్నిపాడులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వైఎస్సార్ జిల్లా అట్లూరులో 43.6°C, విజయనగరంలో 42.8°Cచొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే 139 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వెల్లడించింది.
ఏపీకి వర్ష సూచన….
శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని 4 మండలాలు… విజయనగరం-5 ,మన్యం -8 మొత్తం 17 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉంది. 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శని,ఆదివారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలోనూ భానుడి ప్రతాపం :
తెలంగాణలో భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణలో గత నాలుగైదు ఐదు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన పెరుగుదల నమోదవుతోంది. ప్రస్తుతం పలు ప్రాం తాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరాయి.
ఈ జిల్లాలకు హెచ్చరికలు….
తెలంగాణలో రేపు (ఏప్రిల్ 25) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, భువనగిరి, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో రాత్రి పూట వేడి వాతావరణ పరిస్థితులు అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మరోవైపు ఏప్రిల్ 26 నుంచి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
టాపిక్